Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 22:1-14

అబ్రాహామా, నీ కొడుకును బలి ఇవ్వు

22 ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు అనుకొన్నాడు. “అబ్రాహామా” అని దేవుడు అతణ్ణి పిలిచాడు.

దానికి అబ్రాహాము “చిత్తం” అన్నాడు.

అప్పుడు దేవుడు చెప్పాడు, “నీ కుమారుని మోరీయా దేశం తీసుకొని వెళ్లు. మోరీయాలో నీ కుమారుణ్ణి నాకు బలిగా చంపు. నీ ఒకే కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును ఇలా చేయాలి. అక్కడ కొండల్లో ఒక దానిమీద అతణ్ణి దహనబలిగా ఉపయోగించు. ఏ కొండ అనేది నేను నీతో చెబుతాను.”

ఉదయాన అబ్రాహాము లేచి, తన గాడిదను సిద్ధం చేశాడు. ఇస్సాకును తన ఇద్దరు సేవకులను అబ్రాహాము తన వెంట తీసుకు వెళ్లాడు. బలి అర్పణ కోసం కట్టెలను అబ్రాహాము నరికాడు. తర్వాత వారు వెళ్లాలని దేవుడు అతనితో చెప్పిన చోటికి వారు వెళ్లారు. వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత, అబ్రాహాము కన్నులెత్తి దూరంలో వారు వెళ్లవలసిన చోటును చూశాడు. అప్పుడు అబ్రాహాము, “మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి. నేను, నా కుమారుడు అక్కడికి వెళ్లి, ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో చెప్పాడు.

అబ్రాహాము బలికోసం కట్టెలు తీసుకొని, తన కుమారుని భుజంమీద పెట్టాడు. ఒక ప్రత్యేక ఖడ్గం, నిప్పు అబ్రాహాము పట్టుకొన్నాడు. అప్పుడు అబ్రాహాము, అతని కుమారుడు యిద్దరు కలిసి ఆరాధనా స్థలానికి వెళ్లారు.

ఇస్సాకు “తండ్రీ!” అని తన తండ్రి అబ్రాహామును పిలిచాడు.

“ఏమిటి కొడుకా?” అని అడిగాడు అబ్రాహాము.

“కట్టెలు, నిప్పు నాకు కనబడుతున్నాయి. కాని మనం బలిగా దహించే గొర్రెపిల్ల ఏది?” అని ఇస్సాకు అడిగాడు. “నా కుమారుడా, బలికోసం గొర్రెపిల్లను సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

కనుక అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్లారు. దేవుడు వారికి వెళ్లమని చెప్పిన చోటికి వారు వెళ్లారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును అబ్రాహాము కట్టివేశాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. 10 అప్పుడు అబ్రాహాము తన ఖడ్గం తీసుకొని, తన కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు.

11 కాని అప్పుడు యెహోవా దూత అబ్రాహామును ఆపు చేశాడు. దేవుని దూత ఆకాశం నుండి “అబ్రాహామా, అబ్రాహామా” అని పిలిచాడు.

“చిత్తం” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

12 “నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి, అదీ, నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి కూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత.

13 అబ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొన్నాయి. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమారుడు రక్షించబడ్డాడు. 14 అందుచేత ఆ స్థలానికి “యెహోవా ఈరె[a] అని అబ్రాహాము పేరు పెట్టాడు. “పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు.

కీర్తనలు. 13

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

రోమీయులకు 6:12-23

12 నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. 13 మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. 14 మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.

నీతికి బానిసలు

15 అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. 16 సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు. 17 ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. 18 మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు. 19 మీకు వీటిని అర్థం చేసుకొనే శక్తి లేదు కనుక నేను మాములు ఉదాహరణలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవిత్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా అర్పించుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా అర్పించుకోండి.

20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు. 21 ఆ పనుల వల్ల మీరు ఏమి ఫలం పొందారు? వాటివల్ల మరణమే కలుగుతుంది. 22 ఇక ఇప్పుడు మీరు పాపంనుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది. 23 పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు.

మత్తయి 10:40-42

నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును

(మార్కు 9:41)

40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. 41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. 42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International