Revised Common Lectionary (Semicontinuous)
బేతేలులో యాకోబు కలగనుట
10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. 11 యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటికి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు. 12 యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్లు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్లు యాకోబు చూశాడు.
13 అప్పుడు ఆ నిచ్చెన పైన యెహోవా నిలిచినట్లు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి. ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. 14 నేలమీద ధూళి కణముల్లాగ నీకు కూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.
15 “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్దానం చేసింది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”
16 అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్లు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.
17 యాకోబు భయపడి, “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.
18 ఉదయం పెందలాడే యాకోబు లేచి, తాను పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోశాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేశాడు. 19 ఆ స్థలం పేరు లూజు. అయితే యాకోబు దానికి బేతేలు[a] అని పేరు పెట్టాడు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
“పగలు రాత్రిగా మారిపోయింది.
తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.
24 చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము.
శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
12 అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. 13 ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు.
14 దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. 15 మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!” అని పిలుస్తున్నాము 16 మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. 17 మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.
రానున్న తేజస్సు
18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.
22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.
కలుపు మొక్కలు
24 యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. 25 అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. 26 గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. 27 పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు.
28 “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు.
“పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.
29 “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. 30 కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”
కలుపు ఉపమానానికి అర్థం
36 ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు.
37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు. 38 ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. 39 వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు.
40 “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. 41 వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు. 42 వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు. 43 ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి!
© 1997 Bible League International