Revised Common Lectionary (Semicontinuous)
దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.
142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
యెహోవాను నేను ప్రార్థిస్తాను.
2 నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
3 నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
నా ప్రాణం నాలో మునిగిపోయింది.
అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.
4 నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
పారిపోవుటకు నాకు స్థలం లేదు.
నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
5 కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
6 యెహోవా, నా ప్రార్థన విను.
నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
7 ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
సమరయ, ఇశ్రాయేలులకు దండన
1 యెహోవా వాక్కు మీకాకు అందింది. ఇది యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా అనే రాజుల కాలంలో జరిగింది. వీరు ముగ్గురూ యూదా రాజులు. మీకా, మోరషతు నగరం వాడు. సమరయ, యెరూషలేములను గురించిన ఈ దర్శనాలను మీకా చూశాడు.
2 ప్రజలారా, మీరంతా వినండి!
భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి!
నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయంనుండి వస్తాడు.
నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు.
3 చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు.
ఆయన భూమియొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు.
4 దేవుడైన యెహోవా అగ్ని ముందు
మైనంలా పర్వతాలు కరిగిపోతాయి.
గొప్ప జలపాతంలా,
లోయలు వికలమై కరిగిపోతాయి.
5 యాకోబు పాపం కారణంగా,
ఇశ్రాయేలు ఇంటివారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది.
సమరయ పాప హేతువు
యాకోబు పాపానికి కారణం ఏమిటి?
దానికి కారణం సమరయ!
యూదాలో ఉన్నత స్థలమేది?[a]
అది యెరూషలేము!
దేవునికి నచ్చిన జీవితం
4 సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. 2 యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. 3 మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. 4 మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.[a] 5 పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. 6 ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. 7 దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. 8 అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు.
© 1997 Bible League International