Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
పరమ గీతము 2:8-13

ఆమె మళ్లీ అంటుంది

నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
    పర్వతాల మీది నుంచి దూకుతూ
    కొండల మీది నుంచి వస్తున్నాడు.
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
    లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
    కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
    అల్లిక కిటికీలోనుంచి[a] చూస్తూ
10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“నా ప్రియురాలా, లెమ్ము,
    నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
    వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
    ఇది పాడే సమయం![b]
    విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13 అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
    పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు.
నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా,
    మనం వెళ్లిపోదాం!”

ఆదికాండము 29:1-14

యాకోబు రాహేలును కలసికొనుట

29 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు త్రాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది. గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు త్రాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా త్రాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.

“సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు.

“మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.

అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని అడిగాడు.

“మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.

అప్పుడు యాకోబు “అతను ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.

“అతను బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది అతని కుమార్తె. ఆమె పేరు రాహేలు, అతని గొర్రెల్ని తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.

“చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనియ్యండి” అన్నాడు యాకోబు.

కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు త్రాగుతాయి” అన్నారు.

కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.) 10 రాహేలు లాబాను కుమార్తె. యాకోబు తల్లియైన రిబ్కాకు లాబాను సోదరుడు. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. 11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. 12 తను ఆమె తండ్రి బంధువును అనీ, రిబ్కా కుమారుడననీ యాకోబు రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో ఆ విషయాలు చెప్పింది.

13 తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.

14 అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.

రోమీయులకు 3:1-8

సున్నతి పొందినవాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:

“నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువౌతుంది.
    నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!”(A)

మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు?

“నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International