Revised Common Lectionary (Semicontinuous)
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
3 యాకోబు అన్న ఏశావు శేయీరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఎదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావు దగ్గరకు వార్తాహరులను పంపాడు. 4 “ఏశావుకు ఇలా చెప్పండి” అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: “‘మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను. 5 పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.’”
6 వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు.
7 ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. 8 “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు.
9 యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీవు నాకు మేలు చేస్తానన్నావు. 10 నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేశావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది. 11 దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను, పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది. 12 ‘నేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుంబాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుంటారు’ అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ!”
13 యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను యాకోబు సిద్ధం చేశాడు. 14 యాకోబు 200 ఆడ మేకలను, 20 మేకపోతులను, 200 ఆడ గొర్రెలను, 20 పొట్టేళ్లను తీసుకొన్నాడు. 15 30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 మగ గాడిదలను యాకోబు తీసుకొన్నాడు. 16 “ఒక్కొక్క రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య ఎడం ఉంచండి” అన్నాడు. 17 యాకోబు వారికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి ఉన్న సేవకునితో యాకోబు “నా అన్న ఏశావు నీ దగ్గరకు వచ్చి, ‘ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడువి?’ అని అడిగితే, 18 ‘ఇవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజమాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపించాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు’ అని నీవు చెప్పాలి” అన్నాడు.
19 అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, మూడవ సేవకునికి, మిగిలిన సేవకులందరికి యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసుకొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి. 20 ‘ఇది నీ కోసం కానుక, నీ సేవకుడైన యాకోబు వెనుక ఉన్నాడు’ అని మీరు చెప్పాలి” అన్నాడు యాకోబు.
“ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే, ఒకవేళ ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడేమో” అనుకొన్నాడు యాకోబు. 21 కనుక యాకోబు ఏశావుకు కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు.
12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి.
13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయినవాళ్ళు ధన్యులు” అని అన్నది.
“అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
భూమ్మీద పంట కోత
14 ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద “మనుష్యకుమారుని”[a] లాంటివాడు కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. 15 ఆ తర్వాత మందిరం నుండి మరొక దూత వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చొన్నవాణ్ణి పిలిచి, “భూమ్మీద పంట పండింది. పంటను కోసే సమయం వచ్చింది. నీ కొడవలి తీసుకొని పంటను కోయి!” అని అన్నాడు. 16 మేఘంమీద కూర్చొన్నవాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే ఆ కొడవలి పంటను కోసింది.
17 పరలోకంలో ఉన్న మందిరం నుండి యింకొక దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉంది. 18 మరొక దూత బలిపీఠం నుండి వచ్చాడు. అగ్నికి అధికారియైన యితడు బిగ్గరగా పదునైన కొడవలి ఉన్నవాణ్ణి పిలుస్తూ, “ద్రాక్ష పండింది. నీ పదునైన కొడవలి తీసుకెళ్ళి భూమ్మీద వున్న ద్రాక్షా తోటనుండి ద్రాక్షాగుత్తుల్ని కోయి” అని అన్నాడు. 19 ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి ద్రాక్షా పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద తొట్టిలో వేసాడు. 20 ఊరికి అవతలవున్న ద్రాక్షా తొట్టిలో ద్రాక్షా పళ్ళను వేసి వాటిని త్రొక్కారు. దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుఱ్ఱం నోటి కళ్ళెం అంత ఎత్తు లేచి, సుమారు రెండు వందల మైళ్ళ దూరందాకా ప్రవహించింది.
© 1997 Bible League International