Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
“పగలు రాత్రిగా మారిపోయింది.
తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.
24 చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము.
శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
21 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నేనేమి చేశానో ఇతర దేశాల వారు చూసేలా చేస్తాను. ఆ అన్యదేశాల వారు నన్ను గౌరవించటం మొదలు పెడతారు! ఆ శత్రువు మీద నేను ఉపయోగించిన నా శక్తిని వారు చూస్తారు. 22 ఆ రోజునుంచి ఇశ్రాయేలు వంశం వారు నేను తమ దేవుడగు యెహోవానని తెలుసుకుంటారు. 23 అన్యదేశాలు ఇశ్రాయేలు వంశం వారు ఎందుకు బందీలుగా కొనిపోబడ్డారో తెలుసుకుంటాయి. నా ప్రజలు నామీద తిరుగుబాటు చేసినట్లు వారు తెలుసుకుంటారు. కావున నేను వారికి విముఖుడనయ్యాను. వారి శత్రువులు వారిని ఓడించేలా చేశాను. అందుచే నా ప్రజలు యుద్ధంలో చంపబడ్డారు. 24 వారు పాపం చేసి, వారిని వారు మలినపర్చుకున్నారు. కావున వారు చేసిన పనులకు నేను వారిని శిక్షించాను. నేను వారికి విముఖుడనై, వారికి సహాయం చేయ నిరాకరించాను.”
25 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇప్పుడు యాకోబు వంశాన్ని దేశ బహిష్కరణ నుండి విముక్తిచేసి తీసుకు వస్తాను. ఇశ్రాయేలు వంశమంతటి మీద దయ చూపుతాను. నా పవిత్ర నామ పరిరక్షణ విషయంలో నేను నా రోషాన్ని తెలియజేస్తాను. 26 ప్రజలు వారి అవమానాలను, వారు నాపై తిరుగుబాటు చేసిన రోజులను వారు మర్చిపోతారు. వారు తమ స్వంత దేశంలో సురక్షితంగా నివసిస్తారు. వారి నెవరూ భయపెట్టరు. 27 అన్య దేశాలనుంచి నా ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాను. వారి శత్రు రాజ్యాల నుండి వారిని కూడదీస్తాను. నేనెంత పవిత్రుడనో అనేక దేశాలు అప్పుడు చూస్తాయి. 28 వారు తమ ఇండ్లను వదిలి ఇతర దేశాలకు బందీలుగా పోయేటట్లు ఇంతకు ముందు నేను చేశాను. తరువాత మళ్లీ వారిని కూడదీసి తమ స్వంత దేశానికి తీసుకొని వచ్చాను. అందువల్ల నేను వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు. 29 ఇశ్రాయేలు వంశం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దాని తరువాత మరెన్నడూ నేను నా ప్రజలకు విముఖుడనై ఉండను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ, 14 ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.” 15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
16 ప్రజలు తమకన్నా గొప్పవాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి. 17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు.
తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.
© 1997 Bible League International