Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 24:34-38

రిబ్కా కోసం సంప్రదింపు

34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను. 35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ, మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి. 36 నా యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు. 37 నేను ఒక వాగ్దానం చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేశాడు. నా యజమాని ‘నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నెవరినీ అతడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. 38 కనుక నీవు నా తండ్రి దేశానికి వెళ్తానని వాగ్దానం చేయాలి. నా వంశం వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను కుదుర్చు’ అని నాతో చెప్పాడు.

ఆదికాండము 24:42-49

42 “ఈ వేళ నేను ఈ బావి దగ్గరకు వచ్చి అన్నాను: ‘నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా, దయతో నా ప్రయాణం విజయవంతం చేయి. 43 నేను ఈ బావి దగ్గర నిలబడి, నీళ్లకోసం ఒక అమ్మాయి ఇక్కడికి రావాలని నిరీక్షిస్తాను. అప్పుడు నేను, దయచేసి త్రాగటానికి నీ కడవలోనుంచి నీళ్లు ఇమ్మని అడుగుతాను. 44 సరైన అమ్మాయి అయితే ఒక ప్రత్యేక విధానంలో జవాబిస్తుంది. ఈ నీళ్లు త్రాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను అని ఆమె అంటుంది. ఆ విధంగా, నా యజమాని కుమారుని కోసం యెహోవా ఏర్పరచిన స్త్రీ ఆమె అని నేను తెలుసుకొంటాను.’

45 “నేను ప్రార్థించటం ముగించక ముందే, నీళ్ల కోసం రిబ్కా బావి దగ్గరకు వచ్చింది. ఆమె తన నీళ్ల కడవ తన భుజం మీద పెట్టుకొంది. ఆమె వెళ్లి బావినుండి నీళ్లు తోడింది. ‘దయచేసి కొంచెం నీళ్లు ఇమ్మని’ నేను ఆమెతో అన్నాను. 46 వెంటనే ఆమె తన భుజం మీదనుండి కడవ దించి, నాకు నీళ్లు పోసి, ‘ఇవి త్రాగు, నీ ఒంటెలకు కూడ నేను నీళ్లు తెస్తాను’ అంది. అందుచేత నేను నీళ్లు త్రాగాను, నా ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పెట్టింది. 47 అప్పుడు ‘నీ తండ్రి ఎవరు?’ అని నేను ఆమెను అడిగాను. ‘మిల్కా, నాహోరుల కుమారుడైన బెతూయేలు నా తండ్రి’ అని ఆమె జవాబిచ్చింది. అప్పుడు ఆమె చేతికి ఉంగరం, గాజులు నేను ఇచ్చాను. 48 ఆ సమయంలో నేను నా తలవంచి యెహోవాకు వందనాలు చేశాను. నా యజమాని దేవుడైన యెహోవాను నేను స్తుతించాను. నా యజమాని సోదరుని మనుమరాలి దగ్గరకే నన్ను ఆయన తిన్నగా నడిపించినందుకు ఆయనకు వందనాలు చెప్పాను. 49 ఇప్పుడు మీరేం చేస్తారో నాకు చెప్పండి. నా యజమాని యెడల మీరు దయ, నమ్మకత్వం చూపి, మీ కుమార్తెను ఆయనకు ఇస్తారా? లేక మీ కుమార్తెను ఇవ్వటానికి మీరు నిరాకరిస్తారా? నేను ఏమి చెయ్యాలో నాకు తెలిసేటట్లు మీరు చెప్పండి.”

ఆదికాండము 24:58-67

58 వారు రిబ్కాను పిలిచి, “నీవు ఈ మనుష్యునితో కలిసి ఇప్పుడే వెళ్తావా?” అని అడిగారు.

“అవును, నేను వెళ్తాను” అంది రిబ్కా.

59 కనుక అబ్రాహాము సేవకునితో, అతని మనుష్యులతో కలిసి రిబ్కా వెళ్లటానికి వారు అనుమతించారు. రిబ్కా దాది కూడ వారితో వెళ్లింది. 60 వారు వెళ్తున్నప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు:

“మా సోదరీ, వేలమందికి, పది వేలమందికి నీవు తల్లివి అవుదువు గాక.
    నీ సంతానము వారి శత్రువులను ఓడించి, వారి పట్టణాలను స్వాధీనం చేసుకొందురు గాక!”

61 అప్పుడు రిబ్కా, ఆమె దాది ఒంటెలను ఎక్కి ఆ సేవకుని, అతని మనుష్యులను వెంబడించారు. ఆ విధంగా ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని తిరుగు ప్రయాణమయ్యాడు.

62 అప్పటికి ఇస్సాకు బెయేర్ లహాయిరోయి విడిచి, నెగెవులో నివసిస్తున్నాడు. 63 ఒక సాయంకాలం ఇస్సాకు ధ్యానించుట కోసం అలా బయటకు పోలాల్లోకి వెళ్లాడు. ఇస్సాకు తలెత్తి చూచేటప్పటికి అంత దూరంలో వస్తున్న ఒంటెలు కనిపించాయి.

64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసింది. అప్పుడామె ఒంటె మీద నుండి క్రిందికి దిగింది. 65 “మనలను కలుసుకొనేందుకు ఆ పొలాల్లో నడిచి వస్తున్న యువకుడు ఎవరు?” అంటూ ఆమె సేవకుని అడిగింది.

“ఆయనే నా యజమాని కుమారుడు” అని చెప్పాడు ఆ సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం మీద ముసుగు కప్పుకొంది. 66 జరిగిన సంగతులన్నీ ఇస్సాకుతో ఆ సేవకుడు చెప్పాడు. 67 అప్పుడు ఇస్సాకు ఆ అమ్మాయిని తన తల్లి గుడారంలోకి తీసుకు వచ్చాడు. ఆ రోజు రిబ్కా ఇస్సాకు భార్య అయ్యింది. ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. తన తల్లి మరణించిన తర్వాత అప్పుడు ఇస్సాకు దుఃఖనివారణ పొందాడు.

కీర్తనలు. 45:10-17

10 కుమారీ, నా మాట వినుము.
    నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11     రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
    నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
    వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.

13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
    ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
    ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
    సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.

16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
    దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
    శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

పరమ గీతము 2:8-13

ఆమె మళ్లీ అంటుంది

నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
    పర్వతాల మీది నుంచి దూకుతూ
    కొండల మీది నుంచి వస్తున్నాడు.
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
    లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
    కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
    అల్లిక కిటికీలోనుంచి[a] చూస్తూ
10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“నా ప్రియురాలా, లెమ్ము,
    నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
    వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
    ఇది పాడే సమయం![b]
    విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13 అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
    పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు.
నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా,
    మనం వెళ్లిపోదాం!”

రోమీయులకు 7:15-25

15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. 17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. 18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. 19 చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. 20 చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.

21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. 22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. 23 కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది. 24 నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు? 25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం.

స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.

మత్తయి 11:16-19

16 “ఈ తరం వాళ్ళను నేను ఎవరితో పోల్చాలి? వాళ్ళు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్లాడుకొంటున్న పిల్లలతో సమానము. వాళ్ళు ఇలా అన్నారు:

17 ‘మేము పిల్లనగ్రోవి వూదాము;
    కాని మీరు నాట్యం చెయ్యలేదు,
మేము విషాదగీతం పాడాము,
    కాని మీరు దుఃఖించలేదు.’

18 ఎందుకంటే యోహాను తింటూ, త్రాగుతూ రాలేదు. కాని అతనిలో దయ్యం ఉందన్నారు. 19 మనుష్య కుమారుడు తింటూ త్రాగుతూ వచ్చాడు. కాని వాళ్ళు, ‘ఇదిగో తిండిపోతు, త్రాగుపోతు. ఇతను పన్నులు సేకరించే వాళ్ళకు, పాపులకు మిత్రుడు’ అని అన్నారు. జ్ఞానము దాని పనులను బట్టి తీర్పు పొందుతుంది.”

మత్తయి 11:25-30

అలసిన వాళ్ళకు విశ్రాంతి

(లూకా 10:21-22)

25 ఆ సమయంలో యేసు యింకా ఈ విధంగా అన్నాడు, “తండ్రీ! ఆకాశానికి భూలోకానికి ప్రభువైన నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నీవు వీటిని తెలివిగల వాళ్ళ నుండి, జ్ఞానుల నుండి దాచి చిన్న పిల్లలకు తెలియ జేసావు. 26 ఔను తండ్రీ! నీవీలాగు చేయటం నీకిష్టమయింది.

27 “నా తండ్రి నాకు అన్నీ అప్పగించాడు. తండ్రికి తప్ప నాగురించి ఎవ్వరికి తెలియదు. నాకును, నా తండ్రిని గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎన్నుకొన్న వాళ్ళకును తప్ప, తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు.

28 “బరువు మోస్తూ అలసిపోయిన వాళ్ళంతా నా దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. 29 నేనిచ్చిన కాడిని మోసి, నా నుండి నేర్చుకోండి. నేను సాత్వికుడను. నేను దీనుడను. 30 నేనిచ్చిన కాడిని మోయటం సులభం. నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International