Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 21-22

గిబియోనీయులు సౌలు కుటుంబాన్ని శిక్షించమని కోరటం

21 దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం[a] ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.” (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు[b] ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు)

దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు. “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను[c] దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు.

“సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు.

“అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.

అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు. సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.”

రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద” నని అన్నాడు. కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం[d] చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు. అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు[e] రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు) దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.

రిస్పా తన కుమారుల శవాలకు కాపలా వుండటం

10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ[f] మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.

11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు. 12 అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు) 13 దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చినాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు. 14 బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు.

ఫీలిష్తీయులతో యుద్ధం

15 దావీదుతో ఫిలిష్తీయులు మరల యుద్ధానికి దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి తరలివెళ్లాడు. కాని దావీదు బాగా అలసిపోయి బలహీనపడిపోయాడు. 16 ఇష్బిబే నోబ అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బిబే నోబ ఈటె మూడు వందల షెకెలుల[g] ఇత్తడి ప్రమాణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు దావీదును చంపయత్నించాడు. 17 కాని సెరూయా కుమారుడైన అబీషై ఆ ఫిలిష్తీయుని చంపి, దావీదు ప్రాణం కాపాడాడు.

అప్పుడు దావీదు మనుష్యులు అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు యుద్ధాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ వెళితేమాత్రం నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు ఒక మహానాయకుని[h] కోల్పోతుంది,” అని చెప్పారు.

18 తరువాత గోబు వద్ద ఫిలిష్తీయులతో మరో యుద్ధం జరిగింది. అందులో హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతివాడగు సపును చంపాడు. సపు భయంకరాకారుడు.

19 ఫిలిష్తీయులతో గోబువద్ద మరో యుద్ధం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీయుడైన గొల్యాతును[i] సంహరించాడు. ఎల్హానాను బేత్లెహేము వాడైన యహరేయోరెగీము అనువాని కుమారుడు. గొల్యాతు ఈటె నేతగాని దోనెవలె మందంగా, పొడవుగావుంది.

20 గాతువద్ద మళ్లీ యుద్ధం జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసి వ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారులగు రెఫాయీముల సంతతివాడు. 21 ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి కాలుదువ్వాడు. దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు యోనాతాను వానిని చంపివేశాడు.

22 ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరులైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు.

దావీదు యెహోవాను స్తుతించడం

22 యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం ఆలపించాడు:

యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు!
    సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను!
ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం!
    ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది![j]
యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు.
    నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు!
యెహోవా స్తుతింపబడుగాక!
    ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను
    దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును!

మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి.
    అవి నన్ను బెదరగొట్టాయి!
సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి,
    మృత్యు మాయలో చిక్కుకున్నాను!
నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను.
    అవును, నేను నా దేవుని పిలిచాను!
ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు;
    నా ఆక్రందన ఆయన చెవులను చేరింది.
భూమి విస్మయం చెంది, కంపించింది,
    పరలోకపు పునాదులు కదిలి పోయాయి,
    యెహోవా కోపావేశుడైన కారణాన!
ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగవెడలింది,
    ఆయన నోటి నుండి
    అగ్ని జ్వాలలు వెలువడ్డాయి.
10 ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు!
    ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు!
11 యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు;
    అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు!
12 యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు.
    ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు.
13 ఆయన తేజస్సు బొగ్గులను
    మండింప చేసింది!
14 యెహోవా ఆకాశంలో గర్జించాడు
    ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు!
15 యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు.
    యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు.

16 అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు,
    భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.!
యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి,
    ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి!

17 యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు!
    అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు;
18 నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు.
    నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు!
19 నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు!
20     నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు.
ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు.
    నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు;
21 యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు
    పాపం చేయక పరిశుద్ధంగా వున్నాయి!
22 అంటే, యెహోవా యొక్క న్యాయ
    మార్గాన్ని నేననుసరించాను!
23 యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి.
    ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను.
24 దేవుని ముందు నేను దోషిని కాను;
    నేను పాపానికి దూరంగా ఉంటాను!
25 అందువల్లనే యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును.
    ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను.

26 నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు!
    ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు!
27 ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే, నీవు కూడ అతని పట్ల సద్భావం చూపిస్తావు!
    కాని ఎవరైనా నీకు ప్రతికూలంగా వుంటే, నీవు కూడ ప్రతికూలుడవై వుంటావు!
28 ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు.
    గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు!
29 యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు.
    యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు.
30 మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు.
    దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను!

31 దేవుని మార్గము దోషరహితమైనది;
    యెహోవా మాట పొల్లుపోనిది.
    తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.
32 యెహోవాను మించిన దేవుడు లేడు;
    మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు.
33 దేవుడు నా రక్షణ దుర్గం;
    సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు!
34 జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు!
    ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు.
35 దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు.
    నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు.

36 డాలువలె నీవు నన్ను రక్షిస్తావు!
    నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది!
37 నా పాదాలు తడబడకుండా
    నీవు నా మార్గాన్ని విశాలం చేశావు.
38 నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను!
    వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను;
39 నేను నా శత్రువులను నాశనం చేశాను,
    నేను వారిని పూర్తిగా సంహరించాను!
వారు మరల తలయెత్తే అవకాశం లేదు!
    అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను!

40 ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు.
    నీవే నా శత్రువులను ఓడించినావు.
41 నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు!
    నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను!
42 నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా
    వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి!
43 నా శత్రుమూకను తుత్తునియలు చేశాను!
    వారు నేలమీది ధూళిలా చితికిపోయారు;
నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని
    నా పాదములతో అణగ ద్రొక్కాను.

44 నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నీవు నన్ను కాపాడావు!
    నన్ను రాజ్యాలకు అధిపతిగా చేశావు;
    నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు!
45 ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు!
    నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు.
46 అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు;
    భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు!

47 యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి!
    ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి!
    అయన నన్ను కాపాడే కొండ;
48 నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు,
    ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన;
49     నా శత్రువుల నుండి నన్ను విముక్తి చేయువాడు ఆయనే!

అవును, నా శత్రువులకు మిన్నగా నన్ను ఉన్నతుని చేశావు!
    నన్ను గాయపర్చనుద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు.
50 యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో
    నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను!

51 ఆయన నియమించిన రాజుకు దిగ్విజయం కలిగేలా యెహోవా సహాయపడతాడు;
    ఆయన అభిషిక్తము చేసిన రాజైన దావీదుకు,
    అతని సంతతికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను పంచి ఇస్తాడు!

లూకా 18:24-43

24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

ఎవరు రక్షింపబడగలరు

26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.

27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.

28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. 30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.

యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం

(మత్తయి 20:17-19; మార్కు 10:32-34)

31 యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి. 32 ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు, 33 కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు. 34 శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.

గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం

(మత్తయి 20:29-34; మార్కు 10:46-52)

35 యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు. 36 అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.

37 వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.

38 ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.

39 ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.

40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి 41 “ఏమి కావాలి?” అని అడిగాడు.

“ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.

42 యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.

43 వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International