Old/New Testament
ఇశ్రాయేలు, యూదా మధ్య యుద్ధం
3 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి[a] మధ్య దీర్ఘకాలిక యుద్ధం కొనసాగింది. దావీదు రాను రాను బాగా బలపడ్డాడు. సౌలు కుటుంబం నానాటికీ బలహీనమయింది.
హెబ్రోనులో దావీదుకు ఆరుగురు కుమారులు కలగటం
2 హెబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది.
మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెజ్రె యేలీయురాలగు అహీనోయము.
3 రెండవ కుమారుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు.
మూడవ కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము తల్లి గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకా.
4 నాల్గవ కుమారుడు అదోనీయా. అదోనీయా తల్లి హగ్గీతు.
ఐదవ కుమారుడు షెఫట్య. షెఫట్య తల్లి అబీటలు.
5 ఆరవ కుమారుడు ఇత్రెయాము. ఇత్రెయాము తల్లి దావీదు భార్యయగు ఎగ్లా.
ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో దావీదుకు కలిగారు.
అబ్నేరు దావీదుతో చేరేందుకు నిశ్చయించటం
6 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిన కాలంలో అబ్నేరు సౌలు సైన్యంలో బలాన్ని పుంజుకున్నాడు. 7 సౌలుకు రిస్పా అనే ఒక దాసి వుండేది. ఆమె సౌలుకు ఇంచుమించు భార్యవలె వుండేది. రిస్పా అయ్యా అనువాని కుమార్తె. ఇష్బోషెతు ఒకనాడు అబ్నేరును పిలిచి, “నా తండ్రి పనిగత్తెతో నీవు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు?” అని అడిగాడు.
8 ఇష్బోషెతు అన్న మాటకు అబ్నేరుకు ఎక్కడా లేని కోపం వచ్చింది. అబ్నేరు ఇలా అన్నాడు, “నేను సౌలుకు, అతని కుటుంబానికి చాలా విధేయుడనై వున్నాను! నేను నిన్ను దావీదుకు అప్పగించలేదు; (పైగా అతడు నిన్ను ఓడించేలా చేయనూ లేదు.) యూదావారి తరపున పనిచేస్తూ ఒక రాజద్రోహిగా[b] నేను ఎన్నడూ మెలగలేదు. కాని నీవిప్పుడు నేనొక నీచకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు! 9-10 నేనిప్పుడు నిశ్చియంగా చెబుతున్నాను. దేవుడు చెప్పిన విషయాలు ఇప్పుడు జరిగేలా నేను తప్పక ప్రయత్నం చేస్తాను! సౌలు వంశంనుండి రాజ్యాన్ని తీసుకొని దావీదుకు ఇస్తానని యోహోవా చెప్పాడు. దావీదును యూదా రాజ్యానికి, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా చేస్తాడు. దాను నుండి బెయేర్షబా వరకు దావీదు పరిపాలిస్తాడు! ఈ పనులన్నీ నెరవేరేలా నేను సహాయ పడకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక!” 11 ఇష్బోషెతు అబ్నేరుతో ఇంకేమీ చెప్పలేక పోయాడు. ఇష్బోషెతు అతనంటే విపరీతంగా భయపడిపోయాడు.
12 అబ్నేరు దావీదు వద్దకు దూతలను పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను నీకు సహాయపడతాను.”
13 అందుకు దావీదు, “మంచిది! నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుంటాను. కాని నిన్నొకటి అడుగుతాను; నీవు సౌలు కుమార్తె మీకాలును తీసుకొని వచ్చేవరకు నేను నిన్ను కలవను” అని చెప్పమన్నాడు.
14 సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దావీదు దూతలను పంపాడు. “నా భార్య మీకాలును తిరిగి నాకు తెచ్చి ఇవ్వు. ఆమె నాకు ప్రధానం చేయబడింది. ఆమెను వివాహమాడటానికి నేను వందమంది ఫిలిష్తియులను చంపియున్నాను”[c] అని చెప్పి పంపాడు.
15 లాయీషు కుమారుడైన పల్తీయేలు అనే వాని నుండి మీకాలును తీసుకొని రమ్మని సౌలు కుమారుడు ఇష్బోషెతు తన మనుష్యులను పంపాడు. 16 మీకాలు భర్త పల్తీయేలు మీకాలుతో కూడా వచ్చాడు. మీకాలును అనుసరించి పల్తీయేలు బహూరీము వరకు ఏడుస్తూవచ్చాడు. కాని అబ్నేరు పల్తీయేలుతో, “ఇంటికి తిరిగి పొమ్మని” చెప్పాడు. అప్పుడు పల్తీయేలు ఇంటికి వెళ్లి పోయాడు.
17 అబ్నేరు ఇశ్రాయేలు నాయకులకు యిలా వర్తమానం పంపించాడు: “మీరు దావీదును మీ రాజుగా చేసుకోవాలని చాలా కాలంగా కోరుకుంటూ వున్నారు. 18 ఆ పని ఇప్పుడు చేయండి! ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలందరినీ ఫిలిష్తీయుల నుండి, వారి తదితర శత్రువుల నుండి రక్షిస్తాననీ; ఈ పని నా సేవకుడైన దావీదు ద్వారా నెరవేరుస్తాననీ’ యెహోవా పలికినప్పుడు ఆయన ఈ దావీదును గురించే చెప్పాడు.”
19 అబ్నేరు ఈ విషయాలన్నీ దావీదుతో హెబ్రోనులో చెప్పాడు. ఈ విషయాలు బెన్యామీనీయులందరికీ కూడ చెప్పాడు. అబ్నేరు చెప్పిన విషయాలు బెన్యామీను వంశంవారికీ, ఇశ్రాయేలీయుందరికీ మంచివిగా తోచాయి.
20 అప్పుడు అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చాడు. అబ్నేరు అతనితో ఇరువది మంది మనుష్యులను తీసుకొని వచ్చాడు. అబ్నేరుకు, అతనితో వచ్చిన మనుష్యులకు దావీదు విందు ఇచ్చాడు.
21 అబ్నేరు దావీదుతో ఇలా అన్నాడు, “ప్రభువైన నా రాజా! నేను ఇశ్రాయేలీయులందరినీ నీ వద్దకు తీసుకొని వస్తాను. అప్పుడు వారంతా నీతో ఒక ఒడంబడిక చేసుకొంటారు. తరువాత నీకు నచ్చిన విధంగా ఇశ్రాయేలును పరిపాలించవచ్చు!”
తరువాత దావీదు అబ్నేరును వెళ్లమని చెప్పగా, అబ్నేరు ప్రశాంతంగా వెళ్లిపోయాడు.
అబ్నేరు మరణం
22 యోవాబు, దావీదు అధికారులు యుద్ధం నుండి తిరిగి వచ్చారు. వారు శత్రువుల నుండి ఎన్నో విలువైన వస్తువులను కొల్లగొట్టుకొచ్చారు. దావీదు అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు. అందువల్ల హెబ్రోనులో దావీదు వద్ద అబ్నేరు లేడు. 23 యోవాబు, అతని సైనికులంతా హెబ్రోనుకు చేరారు. సైన్యం యోవాబుతో, “నేరు కుమారుడైన అబ్నేరు దావీదు రాజు వద్దకు రాగా, ఆయన అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు” అని అన్నది.
24 యోవాబు రాజు వద్దకు వచ్చి, “ఏమిటి నీవు చేసిన పని? అబ్నేరు నీ వద్దకు వస్తే, అతనికి ఏ హాని చేయకుండా ఎందుకు పంపించివేశావు! 25 నేరు కుమారుడైన అబ్నేరును నీవెరుగుదువు! అతడు నిన్ను మోసగించటానికి వచ్చాడు! నీవు చేస్తున్నదంతా సమగ్రంగా తెలుసుకోవాలనే తలంపుతో వచ్చాడు!” అని అన్నాడు.
26 యోవాబు దావీదు వద్ద నుండి వెళ్లి, సిరా అనుబావి వద్దకు అబ్నేరు కొరకు తన దూతలను పంపాడు. దూతలు అబ్నేరును వెనుకకు తీసుకొని వచ్చారు. కాని ఇదంతా దావీదుకు తెలియదు. 27 అబ్నేరు హెబ్రోనుకు రాగానే, యోవాబు అతనిని సింహద్వారం మధ్యలో ఏదో రహస్యంగా మాట్లాడాలని ఒక పక్కకు తీసుకొని వెళ్లాడు. కాని యోవాబు తన కత్తితో అబ్నేరు పొట్టలో పొడిచాడు. అబ్నేరు చనిపోయాడు. గతంలో యోవాబు సోదరుడైన అశాహేలును అబ్నేరు చంపాడు. కావున యోవాబు అబ్నేరును చంపివేశాడు.
దావీదు అబ్నేరు కొరకు దుఃఖించటం
28 తరువాత ఈ వార్త దావీదు విన్నాడు. దావీదు ఇలా అన్నాడు; “నేను, నా రాజ్యం నేరు కుమారుడైన అబ్నేరు హత్య విషయంలో నిర్దోషులం. యెహోవాకి ఇది తెలుసు. 29 యోవాబు, అతని కుటుంబం దీనంతటికీ బాధ్యులు. అతని కుటుంబమంతా నిందితులే. యోవాబు కుటుంబానికి అనేక కష్టాలు ఎదురవుతాయని నేను నమ్ముతున్నాను. అతని కుటుంబంలో ఎప్పుడూ ఎవరో ఒకరు కుష్టువ్యాధి పీడితుడో, అంగవైకల్యంతో కర్ర పట్టుకు నడిచే వాడో, యుద్ధంలో హతుడయ్యేవాడో, లేదా ఆహారము లేనివాడో వుంటాడని కూడ నేను నమ్ముతున్నాను.”
30 యోవాబు, అతని సోదరుడు అబీషైలిరువురూ అబ్నేరును చంపిన కారణమేమనగా అబ్నేరు వారి సహోదరుడైన అశాహేలును గిబియోను వద్ద యుద్ధంలో చంపాడు.
31-32 యోవాబుతోను, అతనితో ఉన్న మనుష్యులతోను దావీదు “తమ బట్టలను చింపుకొని,[d] విషాద సూచకంగా వేరే వస్త్రాలు వేసుకోమనీ, అబ్నేరు కొరకు విలపించుమనీ” చెప్పాడు. వారు అబ్నేరును హెబ్రోనులో సమాధి చేశారు. అంత్యక్రియలకు దావీదు హాజరయ్యాడు. దావీదు రాజు, ప్రజలు అబ్నేరు సమాధి వద్ద దుఃఖించారు.
33 దావీదు రాజు అబ్నేరుపై ఈ విషాద గీతిక పాడాడు:
“అబ్నేరు ఒక అవివేకిలా హతుడాయెనా?
34 అతని చేతులకు బంధాలులేవు,
పాదాలకు గొలుసులు వేయలేదు!
అయినా క్రూరుల ముందు నీవు నేలకొరిగావు. ఒరిగి మరణించావు.”
అప్పుడు ప్రజలంతా మళ్లీ అబ్నేరు కొరకు విలపించారు. 35 ఆ రోజు ఇంకా పొద్దువుండగానే దావీదును ఆహారం తీసుకోమని కోరటానికి ప్రజలు వచ్చారు. కాని దావీదు ఒక ప్రత్యేకమైన ప్రమాణం చేశాడు. “నేను రొట్టెగాని, తదితరమైన ఆహారంగాని సూర్యాస్తమయం గాకుండా తింటే దేవుడు నన్ను శిక్షించుగాక! నాకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టుగాక!” అని అన్నాడు. 36 అసలు అక్కడ ఏమి జరిగిందో ప్రజలంతా చూశారు, కనుక దావీదు రాజు చేసేవాటన్నిటినీ ప్రజలు ఒప్పుకున్నారు. 37 నేరు కుమారుడైన అబ్నేరును చంపినది దావీదు రాజు కాదని యూదా ప్రజలకీ, ఇశ్రాయేలీయులందరికీ ఆ రోజు అర్థమయ్యింది.
38 దావీదు రాజు తన సేవకులతో ఇలా అన్నాడు: “మీకు తెలుసు; ఇశ్రాయేలులో ఈ రోజు ఒక ప్రముఖ నాయకుడు చనిపోయాడు. 39 పైగా ఇదే రోజున నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఈ సెరూయా కుమారులు నాకు మిక్కిలి దుఃఖాన్ని కలుగజేశారు. యెహోవా వారికి అర్హమైన శిక్ష విధించుగాక!”
సౌలు కుటుంబానికి కష్టాలు రావటం
4 హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, అతని ప్రజలు చాలా గాభరా చెందారు. 2 సౌలు సైన్యంలో దళాధిపతులైన ఇరువురు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో ఒకని పేరు బయనా, మరియొకని పేరు రేకాబు. బయానా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు బెన్యామీను వంశానికి[e] చెందిన వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెందినది. 3 కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు.
4 సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారిక్రిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.
5 రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు. 6-7 రేకాబు, బయనా గోధుమలు తీసుకొని వెళ్లాలనే నెపంతో నట్టింట్లోకి వచ్చారు. ఇష్బోషెతు తన పడకగదిలో పక్కమీద పడుకున్నాడు. రేకాబు, బయనాలిద్దరూ ఇష్బోషెతును పొడిచి చంపారు. వారు అతని తల నరికి దానిని వారితో తీసుకొనిపోయారు. రాత్రంతా ప్రయాణం చేసి, 8 హెబ్రోనుకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదుకు ఇచ్చారు.
రేకాబు, బయనాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!”
9 రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు. 10 ఒకానొకడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. వాడు వచ్చి, ‘సౌలు చచ్చిపోయాడు!’ అని చెప్పాడు. ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితోషికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని సిక్లగు వద్ద చంపివేశాను. 11 కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్కమీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!”
12 దావీదు కొందరు యువకులను పిలిచి రేకాబు, బయనాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు రేకాబు, బయనాల కాళ్లు, చేతులు నరికి, హెబ్రోను మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధి వద్ద పాతి పెట్టారు.
ఇశ్రాయేలీయులు దావీదును రాజు చేయటం
5 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం![f] 2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”
3 ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.
4 పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు. 5 హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.
దావీదు యెరూషలేమును జయించుట
6 రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులుదేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు.[g] ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు”[h] అని అన్నారు. 7 కాని దావీదు సీయోను కోటను[i] వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.
8 ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం[j] ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గ్రుడ్డివారు ఇంట్లోకి[k] రాలేరని” అంటారు.
9 దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో[l] నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు. 10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.
11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు. 12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.
13 దావీదు యెరూషలేము నుండి పెక్కు మంది దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమార్తెలు కలిగారు. 14 యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల పేర్లు: షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా మరియు ఎలీపేలెటు.
ఫిలిష్తీయుల పైకి దావీదు యుద్దానికి పోవటం
17 ఇశ్రాయేలీయులు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలిష్తీయులంతా దావీదును చంపాలని వెదకటం మొదలు పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక కోటలోకి వెళ్లాడు. 18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగారు.
19 దావీదు ప్రార్థన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దానికి వెళ్లనా? ఫిలిష్తీయులను ఓడించటంలో నాకు సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు.
“వెళ్లు. ఫిలిష్తీయులను ఓడించటంలో నీకు నేను తప్పక సహాయం చేస్తాను” అని యెహోవా చెప్పాడు.
20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి, ఫిలిష్తీయులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించినట్లు, యెహోవా నా శత్రువులను నాముందు చెల్లాచెదురై పారిపోయేలా చేసాడు,” అని అనుకున్నాడు దావీదు. ఆ కారణం చేత దావీదు ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[m] అని పేరుపెట్టాడు. 21 ఫిలిష్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని మనుష్యులు ఆ విగ్రహాలన్నిటినీ తీసుకొని వెళ్లారు.
22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.
23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో. 24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”
25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుముకుంటూ పోయి చంపాడు.
నన్ను వెంబడించగలవేమో తీర్మానించుకొనుము
(మత్తయి 10:37-38)
25 ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, 26 “నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. 27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు.
28 “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? 29-30 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.
31 “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా? 32 యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు.
33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.
నీ గోప్పతనమును పోగొట్టుకొనవద్దు
(మత్తయి 5:13; మార్కు 9:50)
34 “ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే దాన్ని మళ్ళీ ఉప్పుగా ఎట్లా చెయ్యగలము? 35 అది పెంట కుప్పుకు పనికి రాదు. పొలానికి పనికి రాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది.
“చెప్పిన వాటిని జాగ్రత్తగా గమనించండి” అని అన్నాడు.
© 1997 Bible League International