Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 7-9

కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా పవిత్ర పెట్టెను తీసుకొని వెళ్లారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి వారు యెహోవా పెట్టెను తీసుకొని వెళ్లారు. పెట్టె విషయంలో జాగ్రత్త పుచ్చు కొనేందుకు అబీనాదాబు కుమారుడగు ఎలియాజరును వారు ప్రత్యేక క్రమం ప్రకారం ఏర్పరిచారు. కిర్యత్యారీములో ఆ పెట్టె ఇరువది సుధీర్ఘ సంవత్సరాలుండెను.

ఇశ్రాయేలీయులను యెహోవా రక్షించుట

ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ భక్తిశ్రద్ధలతో యెహోవా ఎదుట దుఃఖపడి ఆయనను వెదకటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు[a] దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.”

అది విన్న ఇశ్రాయేలీయులు బయలు[b] అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు.

“ఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమావేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను ప్రార్థిస్తాను” అని సమూయేలు వారితో చెప్పాడు.

ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు.

ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతున్నట్లు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి తరలి వచ్చారు. వారు వస్తున్నారని ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు. వారు సమూయేలుతో “మా కొరకు ప్రభువైన దేవుని ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిష్తీయుల బారినుండి మమ్మును రక్షించమని యెహోవాను వేడుము!” అని విన్నవించారు.

అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గొర్రెపిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల కోసం యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతనికి జవాబిచ్చాడు. 10 సమూయేలు బలి పశువును దహించుచున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా ఒక భయంకర ఉరుమును ఫిలిష్తీయుల వద్ద కలిగించాడు. ఆ ఉరుము ఫిలిష్తీయులను భయపెట్టగా వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు సంభవించిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు. 11 ఇశ్రాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి ఫిలిష్తీయులను అందిన వారిని అందినట్లు చంపుతూ బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు.

ఇశ్రాయేలులో ప్రశాంతత

12 ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకార్థంగా మిస్పాకు, షేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని నిలబెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల”[c] అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసాడు” అని చెప్పాడు.

13 ఫిలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు బ్రతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగానే వున్నాడు. 14 ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకుగల ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలను తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు ప్రక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది.

15 సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు. 16 ప్రతి సంవత్సరం సమూయేలు దేశవ్యాప్తంగా సంచారం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు చెబుతూ ఒక స్థలంనుండి మరో స్థలానికి వేళ్లేవాడు. బేతేలు, గిల్గాలు, మిస్పాకు అతడు వెళ్లాడు. కనుక ఈ స్థలాలన్నింటిలో అతడు ఇశ్రాయేలీయులకు తీర్పు చెబుతూ, వారిని పాలించాడు. 17 కానీ సమూయేలు తన ఇల్లు ఉన్న రామాకు తిరిగి వెళ్లేవాడు. రామాలో వున్న ప్రజలను కూడ సమూయేలు పాలిస్తూ, తీర్పు చెప్పేవాడు. రామాలో యెహోవాకు ఒక బలిపీఠాన్ని సమూయేలు నిర్మించాడు.

రాజుకొరకు ఇశ్రాయేలు ప్రజల అభ్యర్థన

సమూయేలు వృద్ధుడయిన పిమ్మట తన కుమారులను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా నియమించాడు. సమూయేలు మొదటి కుమారుని పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ బెయేర్షెబాలో న్యాయాధిపతులు. కాని సమూయేలు కుమారులకు తండ్రి నడవడి రాలేదు. యోవేలు, అబీయా, ఇద్దరూలంచం ద్వారా ధన సంపాదనకు పాల్పడినారు. తమ తీర్పులను తారుమారు చేయటానికి ప్రజలను మోసంచేసి రహస్యంగా లంచాలు తీసుకునేవారు. కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు. వారు సమూయేలుతో, “నీవు వృద్ధుడవు. పైగా నీ కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు.

ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను కాదు. వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఈజిప్టునుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్ల కూడా వారిప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయినా నీవు ప్రజలు చెప్పిన దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.”

10 రాజుకొరకు అడుగుతున్న ప్రజలకు సమూయేలు సమాధాన మిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన విషయమంతా సమూయేలు ప్రజలకు ఇలా వివరంగా చెప్పాడు: 11 “మిమ్మల్ని పాలించేందుకు మీకు గనుక ఒక రాజు ఉంటే అతడు ఇలా చేస్తాడు: అతడు మీ కుమారులను తనకు సేవ చేసేటట్లు బలవంతంచేస్తాడు. అతడు వారిని బలవంతంగా సైనికులుగా చేస్తాడు. వారిని తన రథాలలో, అశ్వదళాలలో పని చేయిస్తాడు. మీ కుమారులు రాజు రథానికి ముందు పరుగెత్తే సంరక్షకులు అవుతారు.

12 “రాజు మీ కుమారులలో కొంతమందిని వేయిమంది మీద అధికారులుగాను, ఏబదిమంది మీద అధికారులుగాను చేస్తాడు. మీ సంతతిలో మరికొంత మందిని రాజు తన భూమిని సాగు చేయుటకు, మరికొంత మందిని పంట కోయుటకు నియమిస్తాడు.

“ఇంకా కొంతమందిని యుద్ధ పరికరాలను, ఆయుధాలను తయారు చేసేందుకు, ఆయన రథాలకు కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చటానికి రాజు వినియోగిస్తాడు.”

13 “ఈ రాజు మీ కుమార్తెలను కూడా తీసుకుని, వారిలో కొంతమందిని అత్తరులు చేసేందుకు, మరికొంత మందిని ఆయన ఆహార పదార్థాలు తయారు చేయటానికి వినియోగిస్తాడు.

14 “ఈ రాజు మీ భూములలో శ్రేష్ఠమైన వాటిని, ద్రాక్షాతోటలను, ఒలీవ తోటలను తీసుకుంటాడు. వాటిని తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు. 15 మీ పంటలోను, ద్రాక్ష దిగుబడిలోను పదవవంతు అతను తీసు కుంటాడు. ఈ పదవ భాగాన్ని రాజు తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.

16 “ఈ రాజు మీ సేవకులను, పనిపిల్లలను కూడ తీసుకుంటాడు. మీకున్న మంచి మంచి పాడి పశువులను, గాడిదలను కూడా తీసుకుంటాడు. వారందరినీ తన స్వంత పనులకు వినియోగించుకుంటాడు. 17 అతను మీ గొర్రెల మందలలో పదవవంతు తీసుకుంటాడు.

“అసలు మీరు కూడా ఈ రాజుకు బానిసలైపోతారు. 18 ఆ సమయం వచ్చినప్పుడు మీరెన్నుకున్న రాజు మూలంగా మీరు చాలా ఏడుస్తారు. కానీ యెహోవా మాత్రం ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు.”

19 సమూయేలు ఇంత చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా ఇలా అన్నారు: “కాదు! మమ్ములను ఏలటానికి మాకో రాజు కావాలి. 20 అప్పుడు మేము ఇతర రాజ్యాలతో సమాన ప్రతిపత్తిగల వారమవుతాము. మా రాజే మా నాయకుడు. యుద్ధంలో ఆయన మమ్మల్ని నడిపించి, మాకోసం ఆయన యుద్ధం చేస్తాడు.”

21 ప్రజలు చెప్పినదంతా విన్న సమూయేలు వారు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేసాడు. 22 “వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు.

అప్పుడు సమూయేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణానికి వెళ్లిపొమ్మని చెప్పాడు.”

సౌలు తన తండ్రి గాడిదలను వెదకబోవటం

బెన్యామీను గోత్రమునకు చెందిన వారిలో కీషు చాలా ముఖ్యడు. అతను అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు. సెరోరు బెకోరతు పుత్రుడు. బెకోరతు బెన్యామీనీయుడైన అఫీయ కుమారుడు. కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు చాలా అందగాడు. సౌలుకంటె ఎక్కువ అందగాడు మరొకడు లేడు. ఇశ్రాయేలీయులందరిలోనూ అతడు ఆజానుబాహుడు.

ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక “సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవలసిందిగా” కీషు తన కుమారుడైన సౌలుతో చెప్పాడు. ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వెదికారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కోలేకపోయారు. వారు షయలీము ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి దొరకలేదు.

చివరికి సౌలు, అతని సేవకుడు కలసి సూపు పట్టణానికి వచ్చారు. సౌలు, “ఇంటికి వెళ్లి పోదామని తన సేవకునితో అన్నాడు. తన తండ్రి గాడిదల విషయం మర్చిపోయి తమను గురించి కంగారు (చింత) పడతాడని” అన్నాడు సౌలు.

“మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ అతను చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.

“సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్దాము. కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేందుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు.

“చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని ఆ దైవజనుడికి ఇద్దాము. అప్పుడాయన మన ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు.

9-11 “ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం వైపు బయలుదేరి వెళ్లారు.

సౌలు, “సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయటికి వస్తున్నారు.” “దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను, “దీర్ఘదర్శి” అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకొంటే, “దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే వాళ్లు).

12 అది విన్న యువతులు, “అవును ఆ దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ వేళే పట్టణంలోకి వచ్చాడు. వీధిలో ఉన్నాడు ఆరాధనా స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు ఈ వేళ సమావేశం అవుతున్నారు. 13 మీరు పట్టణంలోకి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే, ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు చెప్పారు.

14 సౌలు, అతని సేవకుడు పట్టణానికి వెళ్లారు. పట్టణంలోకి వెళ్లగానే వారు సమూయేలును చూసారు. ఆరాధనకు వెళ్లే నిమిత్తం సమూయేలు పట్టణంలోనుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు.

15 ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: 16 “రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి[d] నా ప్రజల బాధ నేను గమనించాను. నా ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.”

17 సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; నా ప్రజలను పాలించువాడితడే” అన్నాడు.

18 సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూయేలును అడిగాడు.

19 “నేనే దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధనా స్థలానికి వెళ్లు. ఈ రోజు నీవు, నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను. 20 మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు.

21 అది విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి చెందిన వాడిని! ఇశ్రాయేలు అంతటిలో నావంశం చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు కోరుతూ వుందని ఎందుకు చెబుతున్నావు?” అని అడిగాడు.

22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది మంది ఆహ్వానించబడ్డారు. 23 వంటవానితో సమూయేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యేకంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం అది” అన్నాడు.

24 వంటవాడు తొడ మాంసాన్ని[e] తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.

25 భోజనాలు అయిన తరువాత వారు ఆరాధనా స్థలం నుండి క్రిందికి దిగి పట్టణంలోకి వెళ్లారు. ఒక మిద్దెమీద సౌలుకు పడక ఏర్పాటు చేసారు. అక్కడ సౌలు నిద్రపోయాడు.

26 మరునాడుతెల్లవారుఝామున సమూయేలు లేచి మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్దేరు, నిన్ను నీ దారిని నేను పంపిస్తాను” అన్నాడు సమూయేలు. సౌలు లేచి సమూయేలుతో కలిసి బయటికి వెళ్లాడు.

27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.

లూకా 9:18-36

పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం

(మత్తయి 16:13-19; మార్కు 8:27-29)

18 ఒకరోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు.

19 వాళ్ళు, “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్త బ్రతికి వచ్చాడు అని అంటున్నారు” అని సమాధానం చెప్పారు.

20 “మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన అడిగాడు.

పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు” అని సమాధానం చెప్పాడు.

21 “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు.

యేసు తన మరణాన్ని గురించి చెప్పటం

(మత్తయి 16:21-28; మార్కు 8:31–9:1)

22 ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు.

23 ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 24 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు. 25 ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి? 26 నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27 ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు.”

యేసుని రూపాంతరం

(మత్తయి 17:1-8; మార్కు 9:2-8)

28 ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు. 29 ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం మొదలు పెట్టాయి. 30 అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు తేజస్సుతో యేసు ముందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు మోషే, ఏలీయాలు. 31 యెరూషలేములో నెరవేర్చబడనున్న దైవేచ్ఛను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, మాట్లాడారు. 32 పేతురు, అతని వెంటనున్న వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో నిలుచొని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును చూసారు. 33 మోషే, ఏలీయాలు వెళ్తుండగా పేతురు యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలీయా కొకటి మూడు పర్ణశాలలు వేయమంటారా?” అని అడిగాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు అన్నాడు.

34 పేతురు ఈ మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను ఆ మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది. 35 ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్నవాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి” అని వినబడింది.

36 ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International