Old/New Testament
దావీదు తన మనుష్యులతో ఫిలిష్తీయుల రాజ్యానికి వెళ్లుట
27 తరువాత దావీదు, “ఏదో ఒకరోజు సౌలు నన్ను పట్టుకుంటాడు. ఈ పరిస్థితిలో నేను ఫిలిష్తీయుల రాజ్యానికి తప్పించుకోవటం ఒక్కటే ఉత్తమ మార్గం. అప్పుడు సౌలు నా కోసం ఇశ్రాయేలు రాజ్యంలో వెదకటం మానేస్తాడు. ఆ విధంగా నేను సౌలునుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
2 అందుచేత దావీదు, తన ఆరు వందలమంది అనుచరులతో ఇశ్రాయేలును వదిలి వెళ్లాడు. వారు మాయోకుమారుడైన ఆకీషు వద్దకు వెళ్లారు. ఆకీషు గాతుకు రాజు. 3 దావీదు, అతని మనుష్యులు వారి కుటుంబాలతో సహా ఆకీషు రాజుతో పాటు గాతులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలీ వాసి అహీనోయము, మరియు, కర్మెలు నివాసి, నాబాలు భార్య విధవరాలునైన అబీగయీలు అతనితో ఉన్నారు. 4 దావీదు గాతుకు పారిపోయాడని ప్రజలు సౌలుతో చెప్పగానే సౌలు అతని కొరకు వెదకటం మానేశాడు.
5 ఆకీషును దావీదు కలసి, “నా విషయమై నీవు సంతోషిస్తే బయట పట్టణంలో ఒక ఊరిలో స్థానమిస్తే అక్కడ ఉంటాను. నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే. రాజధానిలో నీతో నేను ఉండుటకంటె నేను అక్కడే ఉండటం మంచిది” అని చెప్పాడు.
6 సిక్లగు అనే ఊరిని అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున అప్పటి నుండి సిక్లగు యూదా రాజులకు చెందినదిగా ఉండిపోయింది. 7 ఫిలిష్తీయుల రాజ్యంలో దావీదు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
దావీదు ఆకీషు రాజును మోసగించుట
8 దావీదు, అతని మనుష్యులు కలిసి అమాలేకీయులతోనూ, గెషూరులో నివసిస్తున్న ప్రజలతోనూ యుద్ధానికి వెళ్లారు. దావీదు మనుష్యులు వారిని ఓడించి వారి ఆస్తులను దోచుకున్నారు. ఆ ప్రజలంతా షూరు పట్టణం దగ్గర తెలెమునుండి మొత్తం ఈజిప్టువరకు నివసిస్తూ ఉన్నారు. 9 ఆ ప్రాంతంలో దావీదు వారితో పోరాడి వారిని ఓడించాడు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఒంటెలను, దుస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటిని ఆకీషుకు ఇచ్చాడు.
10 దావీదు ఇలా చాలాసార్లు చేసాడు. ప్రతిసారీ దావీదు ఎక్కడ యుద్ధం చేసి, సంపద అంతా తెస్తున్నాడు అనే విషయం ఆకీషు అడిగేవాడు. “యూదాకు దక్షిణ ప్రాంతంలో యుద్ధం చేసాననీ యెరహ్మెయేలుకు దక్షిణ భాగాన పోరాడాననీ, కేనీయుల దేశానికి దక్షిణాన పోరాడాను” అనీ ప్రతిసారీ ఒక పేరు చెపుతూ ఉండేవాడు దావీదు. 11 బతికి వున్న ఒక స్త్రీని గాని, పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అనుకున్నాడు.”
ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అన్ని రోజులూ దావీదు ఇలాగే చేసాడు. 12 ఆకీషు మాత్రం దావీదును నమ్మటం మొదలు పెట్టాడు. “ఇప్పుడు దావీదు యొక్క స్వంత వాళ్లే అతనిని ద్వేషిస్తున్నారు. ఇశ్రాయేలీయులు దావీదును బాగా అసహ్యించుకుంటున్నారు. అందువల్ల దావీదు శాశ్వతంగా నాకు సేవచేస్తాడు” అని ఆకీషు తనలో తాను అనుకున్నాడు.
ఫిలిష్తీయుల యుద్ధ సన్నాహం
28 తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆకీషు దావీదుతో, “నీవూ, నీ మనుష్యులూ నాతో కలిసి ఇశ్రాయేలీయుల మీద పోరాటానికి వెళ్లాలని గ్రహించావా?” అని అన్నాడు.
2 “ఓ, తప్పకుండా. అప్పుడు నీవే చూస్తావుగా నేను ఏమి చేయగలిగిందీ” అని దావీదు జవాబిచ్చాడు.
“చాలా బాగుంది. నిన్ను నా అంగరక్షకునిగా శాశ్వత నియామకం చేస్తాను” అని అన్నాడు ఆకీషు.
సౌలు మరియు ఏన్దోరు మంత్రగత్తె
3 సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా అతని మరణానికి దుఃఖించారు. అతని స్వంత పట్టణమైన రామాలోనే సమూయేలు శరీరాన్ని ప్రజలు సమాధి చేశారు.
అంతకు ముందే సౌలు కర్ణపిశాచముగల వారిని[a] చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెడల గొట్టాడు.
4 ఫిలిష్తీయులంతా యుద్ధానికి సిద్ధమై షూనేము అనే చోట గుడారాలు వేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమీకరించి, గిల్బోవలో గుడారాలు వేసుకున్నాడు. 5 ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది. 6 సౌలు యెహోవాను ప్రార్థించాడు. కానీ యెహోవా అతనికి జవాబు ఇవ్వలేదు. కలలోకూడ దేవుడు సౌలుతో మాట్లాడలేదు. అతనికి జవాబు ఇచ్చేందుకు దేవుడు ఊరీము[b] ప్రయోగించ లేదు. 7 చివరికి సౌలు తన మనుష్యులతో, “ఒక కర్ణపిశాచంగల స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతుందో ఆమెను అడుగుతాను” అని చెప్పాడు.
“ఏన్దోరులో కర్ణపిశాచం గల ఒక స్త్రీ వుందని” అతని అధికారులు అతనితో చెప్పారు.
8 అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని ఆ స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.
9 కానీ ఆ స్త్రీ, “సౌలు ఏమి చేసాడో నీకు ఖచ్చితంగా తెలుసు. కర్ణపిశాచముగలవారిని, చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెళ్లగొట్టాడు. నీవు నన్ను ఉరివేసి చంపాలని చూస్తున్నావు” అని సౌలుతో అంది.
10 సౌలు యెహోవా పేరును ప్రయోగించి ఆ స్త్రీకి ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా చెబుతున్నాను. నీవు ఈ పని చేసినందుకు శిక్షపొందవు” అన్నాడు.
11 “అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించమంటావు?” అని ఆ స్త్రీ సౌలును అడిగింది.
“సమూయేలును” అన్నాడు సౌలు.
12 ఆ స్త్రీ సమూయేలును చూచి చావుకేక వేసింది. “నీవు నన్ను మాయ చేసావు, నీవు సౌలువే” అంది ఆ స్త్రీ సౌలుతో.
13 “అయినా ఏమీ భయపడకు! నీవు ఏమి చూస్తున్నావు?” అన్నాడు సౌలు ఆమెతో.
“భూమిలో నుండి[c] ఒక ఆత్మ రావటం నేను చూస్తున్నాను” అంది ఆ స్త్రీ.
14 “అయితే, వాని ఆకారం ఎలా ఉంది?” అని సౌలు అడిగాడు.
“అతడు అంగీ ధరించిన ముసలివానిలా కనబడుతున్నాడు” అని ఆ స్త్రీ జవాబిచ్చింది.
అది సమూయేలు అని అప్పుడు సౌలుకు తెలిసింది. సౌలు సాష్టాంగపడి నమస్కరించాడు. 15 “నన్నెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు?” అన్నాడు సమూయేలు సౌలుతో.
సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, ప్రవక్తల ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు చెప్పాలి” అన్నాడు.
16 సమూయేలు, “యెహోవా నిన్ను విసర్జించి ఇప్పుడు ఆయన నీ పొరుగువానితో ఉన్నాడు. అందు చేత నీవు నన్నెందుకు పిలిచావు? 17 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో అదే చేసాడు. ఈ విషయాలు నాద్వారా నీకు చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతులనుండి తీసివేసాడు. దానిని నీ పొరుగు వారిలో ఒకనికి ఆయన ఇచ్చాడు. ఆ పొరుగు వాడే దావీదు! 18 నీవు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. నీవు అమాలేకీయులను నాశనం చేయలేదు, వారిమీద యెహోవా ఎంత కోపగించాడో వారికి చూపించలేదు. అందుకే దేవుడు ఈ వేళ నీకు దీనిని చేసాడు. 19 యెహోవా ఇశ్రాయేలును, నిన్ను కూడ ఫిలిష్తీయులకు ఇచ్చివేసాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. రేపు నీవూ, నీ కుమారులు కూడా నాతో పాటు ఇక్కడ ఉంటారు” అని చెప్పాడు.
20 సౌలు వెంటనే నేల మీదికి ఒరిగిపోయి, అక్కడే పడి ఉన్నాడు. సమూయేలు చెప్పిన వాటి మూలంగా సౌలు భయపడిపోయాడు. ఆ రాత్రి, పగలు సౌలు ఏమీ తినకపోవటంతో చాలా నీరసించి పోయాడు.
21 ఆ స్త్రీ సౌలు వద్దకు వచ్చి, అతను నిజంగానే చాలా భయపడి పోయినట్టు గమనించింది. “చూడు, నేను నీ సేవకురాలిని. నేను నీకు విధేయురాలినయ్యాను. నేను నా ప్రాణానికి తెగిచిం నీవు చెప్పినట్లు చేసాను. 22 దయచేసి ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు కొంత ఆహారం ఇస్తాను. నీవు అది తినాలి. అప్పుడు నీ దారిన నీవు వెళ్లటానికి సరిపడే శక్తి నీకు ఉంటుంది” అని ఆమె చెప్పింది.
23 కానీ సౌలు తిరస్కరించాడు. “నేనేమి తినను” అన్నాడు.
సౌలు అధికార్లు ఆమెతో కలిసి సౌలును తినమని బ్రతిమలాడారు. చివరకు సౌలు ఒప్పుకుని నేల మీదనుండి లేచి పక్కమీద కూర్చున్నాడు. 24 ఆ స్త్రీ ఇంటివద్ద ఒక బలిసిన ఆవుదూడ వుంది. వెంటనే ఆమె ఆ దూడను చంపింది: కొంత పిండి తీసి, స్వయంగా కలిపి, దానిని పులియగపెట్టకుండా రొట్టెకాల్చింది. 25 ఆ ఆహారాన్ని సౌలు ముందు, అతని అధికార్ల ముందు ఆమె పెట్టింది. సౌలు, అతని అధికార్లు భోజనం చేసారు. అదే రోజు రాత్రి వారు బయలుదేరి వెళ్లిపోయారు.
దావీదు మనతో రావద్దు
29 ఆఫెకు వద్ద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని సమకూర్చారు. యెజ్రెయేలులో ఊట బావి వద్ద ఇశ్రాయేలు సైనికులు గుడారాలు వేసుకున్నారు. 2 ఫిలిష్తీయుల పాలకులు నూరుమంది దళాలతో, వేయిమంది దళాలతో ముందడుగు వేస్తున్నారు. దావీదు, అతని మనుష్యులు ఆకీషు వెనుక నడుస్తూఉన్నారు.
3 ఫిలిష్తీయుల దళాధిపతులు, “ఈ హెబ్రీవాళ్లు ఇక్కడ ఏమి చేస్తున్నారు” అని అడిగారు.
అప్పుడు ఆకీషు ఫిలిష్తీయుల దళాధిపతులతో, “ఇతడు దావీదు. ఇతడు సౌలు అధికారుల్లో ఒకడు. దావీదు చాలా కాలంగా నాతో ఉంటున్నాడు. దావీదు సౌలును విడిచిపెట్టి వచ్చి నా దగ్గర ఉంటున్నప్పటి నుండి ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదు,” అని చెప్పాడు.
4 కానీ ఆకీషు మీద ఫిలిష్తీ దళాధిపతులకు చాలా కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకున్నట్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపితన రాజు సౌలును సంతోష పెడతాడు. 5 ఈ దావీదును గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ
‘సౌలు వేల కొలదిగా హతము చేసెననియు,
దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు.’
అని పాట పాడారు” అని చెప్పారు ఆ దళాధిపతులు.
6 అందుచేత ఆకీషు దావీదును పిలిచాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా, నీవు నాకు నమ్మకంగా ఉన్నావు. నీవు నా సైన్యంలో పని చేయటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు వచ్చిన రోజునుండి నీలో ఏ తప్పూ నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల పాలకులు[d] కూడ నీవు మంచివాడివని తలస్తున్నారు. 7 శాంతితో వెనుకకు వెళ్లిపో. ఫిలిష్తీయుల పాలకులకు విరోధంగా ఏమీ చెయ్యకు,” అని ఆకీషు చెప్పాడు.
8 దావీదు, “నేను ఏమి తప్పుచేసాను? నేను నీ దగ్గరకు వచ్చిన రోజునుండి ఈ రోజు వరకు నీవు నాలో ఏమి తప్పు కనుగొన్నావు? నా యజమానివైన రాజు యొక్క శత్రువులతో నన్నెందుకు పోరాడనివ్వవు?” అని దావీదు అడిగాడు.
9 అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా ఉన్నావు. కానీ ఫిలిష్తీయుల దళాధిపతి మాత్రం, ‘దావీదు మాతో కలిసి యుద్ధానికి రాకూడదు’ అంటూనే ఉన్నాడు. 10 తెల్లవారు ఝామునే లేచి నీవూ, నీ మనుష్యులూ వెనక్కు వెళ్లిపోవాలి. నేను మీకిచ్చిన నగరానికి తిరిగి వెళ్లండి. నిన్ను గురించి దళాధిపతి చెప్పిన చెడ్డ మాటలను లెక్క చెయకు. నీవు మంచివాడివి. కనుక సూర్యోదయం కాగానే వెళ్లిపోవాలి” అన్నాడు.
11 అందుచేత దావీదు, అతని మనుష్యులు తెల్లవారుఝామునే లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లిపోయారు. ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు సాగిపోయారు.
పాపాలు చెయ్యటం మానుకోండి
13 ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని బలి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని” చెప్పారు. 2 యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని మీ అభిప్రాయమా? 3 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి. 4 గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా? 5 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.”
పండ్లుకాయని అంజూరపు చెట్టు యొక్క ఉపమానం
6 ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒకడు తన ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి పండ్లు కనిపించలేదు. 7 అతడు తోటమాలితో, ‘ఈ చెట్టుకు పండ్లు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొట్టేయి. అది అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది’ అని అన్నాడు. 8 ఆ తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను. 9 వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.”
యేసు విశ్రాంతిరోజున ఒక స్త్రీని నయం చేయటం
10 ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. 11 దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగి ఉంది. ఆమె చక్కగా నిలువలేకపోయేది. 12 యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు విముక్తి కలిగించాను.” 13 అని అంటూ ఆమె మీద తన చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది.
14 విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవలసిన రోజున కాదు” అని అన్నాడు.
15 యేసు, “మీరు కపటులు. విశ్రాంతి రోజు మీ ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి నీళ్ళు త్రాగించరా? 16 ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు. 17 ఈ మాటలు, ఆయన విరోధులు సిగ్గుపడేటట్లు చేశాయి. కాని ఆయన చేసిన మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు.
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-33; మార్కు 4:30-32)
18 ఆ తర్వాత యేసు, “దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? 19 అది ఒక ఆవగింజ లాంటిది. దాన్ని ఒకడు తన తోటలో నాటాడు. అది పెరిగి చెట్టయింది. ఆకాశంలో ఎగిరే పక్షులు దాని కొమ్మల మీద వ్రాలాయి” అని అన్నాడు.
20 యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?” అని అడిగి, 21 “అది పిండిలో కలిపే పులుపు లాంటిది. ఒక స్త్రీ ఆ పులుపును మూడు కుంచాల పిండిలో ఆ పిండంతా పులిసేదాకా కలిపింది” అని సమాధానం చెప్పాడు.
ఇరుకు ద్వారం
(మత్తయి 7:13-14, 21-23)
22 యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు.
© 1997 Bible League International