Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 9-11

సౌలు కుటుంబానికి దావీదు కనికరము చూపటం

“సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.

సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు.

“అవును, నీ సేవకుడనైన సీబానే” అని అన్నాడు సీబా.

“అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా జీవించివున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు రాజుతో సీబా యిలా అన్నాడు:

“యోనాతాను కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని రెండు కాళ్లూ అవిటివి.”

“ఈ కుమారుడెక్కడున్నాడని” రాజు సీబాను అడిగాడు.

“లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్నాడని” రాజుకు చెప్పాడు సీబా.

అప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబారుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని రమ్మని చెప్పాడు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు.

“మెఫిబోషెతూ” అని పిలిచాడు దావీదు.

“అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు.

మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయపడకు. నేను నీ పట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రియైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి ఇచ్చివేస్తాను. నీవు ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద భోజనం చేస్తావు.”

మెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్కరించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ సేవకుడనైన నా పట్ల చాలా దయగలిగియున్నారు! పైగా నేను చచ్చిన కుక్కకంటె హీనమైన వాడిని!”

పిమ్మట దావీదు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిచి, “సౌలుకు, సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి పాస్తులన్నీ నీ యజమాని మనుమడైన మెఫీబోషెతుకు ఇచ్చాను. 10 మెఫీబోషెతు కొరకు ఆ భూమిని నీవు సాగుచేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ యజమాని మనుమడు మెఫిబోషెతుకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు నా బల్లవద్ద తింటూ వుంటాడు.”

సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువైమంది సేవకులు వున్నారు. 11 దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అంతా చేస్తాను.”

ఆ ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ కుమారులలో ఒకనిగా భోజనం చేస్తాడు. 12 మెఫీబోషెతుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. సీబా కుటుంబంలోని వారంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు. 13 మెఫీబోషెతు రెండు కాళ్లూ కుంటివే. మెఫీబోషెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతిరోజూ మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు.

హానూను దావీదు మనుష్యులను అవమానించటం

10 తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు హానూను రాజయ్యాడు. మరణవార్త విన్న దావీదు “నాహాషు నాపట్ల చాలా దయగలిగియుండెను. కాబట్టి అతని కుమారుడు హానూను పట్లకూడ నేను దయగలిగి ఉంటాను,” అని అన్నాడు. ఆ ప్రకారం దావీదు తన అధికారులను తండ్రి మరణంతో విచారంలో ఉన్న హానూనును పలకరించి ఓదార్చే నిమిత్తం పంపాడు.

దావీదు అధికారులు అమ్మోనీయుల దేశానికి వెళ్లారు. కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజైన హానూనును కలిసి, “నీ తండ్రి మరణ సందర్భంగా నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలిసికొనే నిమిత్తం గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు.

కాబట్టి హానూను దావీదు పంపిన అధికారులను పట్టుకొని, వారి గడ్డాలలో సగభాగం గొరిగించాడు. వారి దుస్తులను కూడ సగంనుంచి తొడలవరకు కత్తిరించి వేశాడు. తరువాత వారిని పంపివేశాడు.

ఆ అధికారులు చాలా అవమానం పొందారని విన్న దావీదు కొందరు దూతలను తన అధికారులను కలవటానికి పంపాడు. దూతల ద్వారా, “మీ గడ్డాలు బాగా పెరిగేవరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత యెరూషలేమునకు తిరిగిరండి,” అని కబురు పంపాడు దావీదు రాజు.

అమ్మోనీయులపై యుద్ధం

అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.

ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు. అమ్మోనీయులు బయటికి వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు నగర ద్వారం దగ్గర మోహరించారు. సోబానుండి రెహోబు నుండి వచ్చిన సిరియనులు, టోబునుండి, మయకానుండి వచ్చిన మనుష్యులందరూ అమ్మోనీయులతో కలిసి రంగంలో నిలబడలేదు.

అమ్మోనీయులు తనకు ముందు, వెనుక కూడ నిలబడి వున్నారని యోవాబు గమనించాడు. అందువల్ల తనతో వచ్చిన ఇశ్రాయేలీయులలో కొందరు నేర్పరులైన వారిని ఎన్నుకుని వారిని సిరియనులతో యుద్ధానికి సిద్ధం చేశాడు. 10 మిగిలిన సైన్యాన్ని అమ్మోనీయుల మీదికి పోవటానికి యోవాబు తన సోదరుడైన అబీషైకి ఇచ్చాడు. 11 యోవాబు అబీషైకి ఇలా చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం చేయము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధిక్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. 12 ధైర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన దేవుని నగరాలకోసం మనమంతా వీరోచితంగా పోరాడదాం! యెహోవా దృష్టికి ఏది మంచిదనిపించుతుందో అది ఆయన చేస్తాడు.”

13 తరువాత యోవాబు, అతని మనుష్యులు సిరియనులను ఎదుర్కొన్నారు. యోవాబు యొక్క, అతని సైన్యం యొక్క ధాటికి తట్టుకోలేక సిరియనులు పారి పోయారు. 14 సిరియనులు పారిపోతున్నట్లు అమ్మోనీయులు చూశారు. దానితో వారుకూడ అబీషైకి భయపడి పారిపోయారు. వారు వారి నగరానికి పోయారు.

యోవాబు అమ్మోనీయులతో యుద్ధానంతరం తిరిగి వచ్చి యెరూషలేముకు వెళ్లాడు.

సిరియనులు మళ్లీ యుద్ధానికి సిద్ధమవటం

15 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని సిరియనులు గుర్తించారు. వారంతా మళ్లీ సమకూడి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చారు. 16 హదదెజరు తనదూతలను యూఫ్రటీసు నది అవతల నివసిస్తూ ఉన్న సిరియనులనందరినీ తీసుకొని రావలసినదిగా పంపాడు. ఈ సిరియనులంతా హేలాముకు వచ్చారు. వారి నాయకుడు షోబకు. ఇతడు హదదెజరు సైన్యాధిపతి.

17 దావీదు ఇదంతా విని ఇశ్రాయేలీయులనందరనీ కూడ దీశాడు. వారు యోర్దాను నదిని దాటి హేలాముకు వెళ్లారు.

అక్కడ సిరియనులు యుద్ధానికి సిద్ధమై వారిని ఎదిరించారు. 18 కాని దావీదు సిరియనులను ఓడించాడు. సిరియనులు ఇశ్రాయేలీయులకు భయపడి పారిపోయారు. దావీదు సిరియను సైన్యంలో ఏడు వందల మంది రథసారధులను, నలుబది వేల మంది గుర్రపు దళం వారిని చంపివేశాడు. అంతేగాదు సిరియను సైన్యాధిపతియైన షోబకును కూడ దావీదు చంపివేశాడు.

19 హదదెజరు సామంత రాజులంతా వారి సైన్యాలను ఇశ్రాయేలీయులు ఓడించినట్లు చూశారు. కావున వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసికొని వారిని సేవిస్తూవచ్చారు. మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయటానికి సిరియనులు భయపడి పోయారు.

దావీదు బత్షెబను కలవటం

11 వసంతకాలం వచ్చింది. రాజులు యుద్ధాలకు దిగే తరుణం. దావీదు యోవాబును, ఇతర సేవకులను, ఇశ్రాయేలీయులను సిద్ధంచేసి అమ్మోనీయులను నాశనం చేయటానికి పంపాడు యోవాబు సైన్యం (అమ్మోనీయుల రాజధాని నగరమైన) రబ్బా నగరంపై కూడ దాడి చేసింది.

ఈసారి దావీదు యెరూషలేములోనే వుండిపోయాడు. ఆ రోజు సాయంత్రం పడకనుంచి లేచి, రాజు మేడ మీద అటు యిటు తిరుగ సాగాడు. అప్పుడతడు స్నానం చేస్తూ ఉన్న స్త్రీనొక దానిని చూసాడు. ఆమె చాలా అందంగా ఉంది. దావీదు తన సేవకులను పిలువనంపాడు. ఆ స్త్రీ ఎవరని అడుగగా, ఒక సేవకుడు, “ఆమె పేరు బత్షెబ అనీ, ఆమె ఏలీయాము కుమార్తె అనీ చెప్పాడు. ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య అనికూడ చెప్పాడు.”

దావీదు దూతలను పంపి బత్షెబను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె దావీదు వద్దకు వచ్చినప్పుడు, ఆమెతో అతడు సంగమించాడు. ఆమె స్నానాదులు చేసి, శుచియై తన ఇంటికి వెళ్లిపోయింది. కాని “బత్షెబ గర్భవతి” అయింది. ఈ విషయమై దావీదుకు వర్తమానం పంపింది.

దావీదు తన పాపాన్ని దాయజూడటం

దావీదు ఒక వర్తమానం యోవాబుకు పంపాడు. “హిత్తీయుడగు ఊరియాను నా వద్దకు పంపు” అని కబురు చేశాడు. అందువల్ల యోవాబు ఊరియాను దావీదు వద్దకు పంపాడు. ఊరియా దావీదు వద్దకు వచ్చాడు. దావీదు అతనిని యోవాబు ఎలా ఉన్నాడనీ, సైనికులెలా వున్నారనీ, యుద్ధం ఎలా కొనసాగుతున్నదనీ అడిగాడు. తరువాత “ఇంటికి పోయి విశ్రాంతి[a] తీసుకోమని” దావీదు ఊరియాకు చెప్పాడు.

ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు. కాని ఊరియా ఇంటికి పోలేదు. రాజు ఇంటి ఆవరణ ద్వారం వద్ద ఊరియా నిద్రపోయాడు. మిగిలిన రాజ సేవకుల మాదిరిగా అతను కూడా అక్కడే నిద్ర పోయాడు. 10 “ఊరియా ఇంటికి పోలేదని” సేవకులు దావీదుకు చెప్పారు.

అప్పుడు దావీదు ఊరియాను పిలిచి, “నీవు చాలా దూరంనుండి వచ్చావు గదా! నీవు ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.

11 దావీదుతో ఊరియా ఇలా అన్నాడు: “పవిత్ర పెట్టె, ఇశ్రాయేలు, యూదా సైనికులు అందరూ గుడారాలలో ఉంటున్నారు. నా యజమాని యోవాబు, నా ప్రభువు (దావీదు రాజు) యొక్క సేవకులందరూ బయట పొలాల్లో గుడారాలు వేసుకొనివున్నారు. కావున నేను ఇంటికి వెళ్లి తాగి, భార్యతో విలాసంగా కాలం గడపటం మంచిది కాదు!”

12 “అయితే ఈ రోజు ఇక్కడే ఉండు. రేపు నిన్ను మళ్లీ యుద్ధానికి పంపివేస్తాను” అని దావీదు ఊరియాతో అన్నాడు.

ఊరియా ఆ రోజు యెరూషలేములో ఉన్నాడు. అతడు మరుసటి రోజు తెల్లవారే వరకు వున్నాడు. 13 ఊరియాను తన వద్దకు వచ్చి కన్పించమని దావీదు కబురు పంపాడు. దావీదుతో కలిసి ఊరియా బాగా తాగి, తిన్నాడు. దావీదు ఊరియాకు బాగా తాగ బోశాడు. అయినా ఊరియా ఇంటికి పోలేదు. ఆరోజు సాయంత్రం ఊరియా రాజుగారి సేవకులతో కలిసి రాజభవన ద్వారం వద్ద నిద్రపోవటానికి వెళ్లాడు.

ఊరియాను చంపించేందుకు దావీదు పథకం

14 మరునాటి ఉదయం దావీదు యోవాబుకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఊరియా ద్వారా పంపాడు. 15 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”

16 యెవాబు నగరాన్ని పరిశీలించి ఎక్కడ అమ్మోనీయులు ధైర్యంగా ఉన్నారో చూశాడు. అతడా ప్రదేశానికి ఊరియాను పంప నిర్ణయించాడు. 17 ఆ నగర (అమ్మోనీయుల రాజధానియగు రబ్బా) ప్రజలు యోవాబును ఎదిరించటానికి బయటికి వచ్చారు. దావీదు మనుష్యులు కొందరు చంపబడ్డారు. చంపబడిన వారిలో హిత్తీయుడైన ఊరియా ఒకడు.

18 యుద్ధ పరిణామాలపై యోవాబు దావీదుకు ఒక నివేదిక పంపాడు. 19 ఆ దూతతో యుద్ధంలో ఏమి జరిగిందో దావీదురాజుకు వివరంగా చెప్పమన్నాడు. 20 “బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేసేవారని తెలియదా? 21 ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలుకును ఎవరు చంపారో మీకు గుర్తుందా? ఆ నగర గోడపై నుండి ఒక స్త్రీ తిరుగలి పై రాయిని విసరివేయగా అబీమెలెకు చనిపోయాడు. ఆ స్త్రీ అతనిని తేబేసువద్ద చంపింది. మీరు ఆ గోడ చెంతకు ఎందుకు వెళ్లారు?’ అని అనవచ్చు. దావీదు రాజు గనుక అలా అంటే, ‘నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని నీవు తప్పకుండా లచెప్పాలి” అంటూ యోవాబు దూతను పంపాడు.

22 ఆ వచ్చిన దూత లోనికి వెళ్లి యోవాబు చెప్పమన్నట్లు దావీదుకు వివరించి చెప్పాడు. 23 దూత ఇలా చెప్పాడు: “అమ్మోనీయులు మమ్మల్ని పొలాల్లో ఎదుర్కొన్నారు. కాని మేము వారితో నగర ద్వారం వద్ధ పోరాడాము. 24 మీ సేవకులపై నగర గోడల మీద ఉన్న వారు బాణాలు వేశారు. మీ సేవకులలో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడ చనిపోయాడు.”

25 సరే ఈ విషయంపై కలతపడవద్దని[b] యోవాబుతో చెప్పమని దూతతో దావీదు అన్నాడు. “కత్తికి వారూ, వీరూ అనీ తేడా వుండదు. అది అందరినీ చంపుతుంది. రబ్బా నగరంపై దాడి తీవ్రం చేయండి. ఆ నగరం అప్పుడు వశమవుతుంది” అని చెప్పి యోవాబును ప్రోత్సహించమని దావీదు దూతకు చెప్పాడు.

దావీదు బత్షెబను వివాహమాడటం

26 తన భర్త ఊరియా చనిపోయినట్లు బత్షెబ విన్నది. తన భర్తకై విలపించింది. 27 సంతాప దినాలు గడిచాక, దావీదు తన మనుష్యులను పంపి ఆమెను తన ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. తరువాత ఆమె దావీదుకు భార్య అయింది. దావీదు వల్ల ఆమెకు కుమారుడు జన్మించాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని యోహోవ ఆమోదించలేదు.

లూకా 15:11-32

తప్పిపోయిన కుమారుని ఉపమానం

11 యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి యిద్దరు కుమారులు ఉన్నారు. 12 చిన్నవాడు తండ్రితో, ‘నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి’ అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు.

13 “కొద్ది రోజుల్లో చిన్నవాడు తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి పొయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు. 14 అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. 15 ఆ ఆసామి అతణ్ణి పందులు కాయటానికి నియమించాడు. 16 ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు.

17 “అతనికి బుద్ధి వచ్చింది. అతడు ‘నా తండ్రి పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. 18 నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను. 19 నేను నీ కుమారుడనని చెప్పుకొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని చేసేవాళ్ళతో ఉండనీ!’ అని చెప్పాలని మనస్సులో అనుకున్నాడు. 20 వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు.

చిన్న కుమారుడు తిరిగి రావటం

“ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రికి తనకుమారుణ్ణి చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 21 అతడు తండ్రితో, ‘నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను’ అని అన్నాడు.

22 “అతని తండ్రి పని వాళ్ళతో, ‘వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి తొడిగించండి. 23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. 24 చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు తిరిగి దొరికాడు’ అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు.

పెద్ద కుమారుడు దోషారోపణ చేయటం

25 “ఇంతలో పెద్దవాడు పొలంనుండి ఇంటికి వస్తూవున్నాడు. ఆతనికి ఇంటినుండి సంగీతము, నాట్యము జరుగుతున్న ధ్వనులు వినిపించాయి. 26 అతడు పని వాళ్ళలో ఒకణ్ణి పిలిచి, ‘ఏమి జరుగుతోంది?’ అని అడిగాడు. 27 ఆ పనివాడు ‘మీ తమ్ముడు వచ్చాడు. మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు’ అని చెప్పాడు.

28 “ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక ఇంట్లొకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమిలాడాడు. 29 అతడు తండ్రితో, ‘యిదిగో నాన్నా! ఎన్నో ఏండ్లనుండి నేను బానిసలాగా పనిచేసాను. నీ ఆజ్ఞ జవదాట లేదు. ఆయినా నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు ఒక్క చిన్న గొఱ్ఱెను కూడా ఇవ్వలేదు. 30 కాని, నీ ఈ కుమారుడు ఆస్థినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు చేరుకొంటే వానికోసం బలిసిన దూడను కోస్తున్నావు!’ అని అన్నాడు.

31 “కాని తండ్రి అతనితో, ‘నా బాబూ! నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి. 32 కాని నీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి’ అని అన్నాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International