Old/New Testament
అమాలేకీయులను సౌలు నాశనం చేయుట
15 సమూయేలు ఒక రోజు సౌలు వద్దకు వచ్చాడు. గతంలో అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయటానికి యెహోవా తనను పంపిన విషయం జ్ఞాపకం చేస్తూ, మరో వర్తమానం యెహోవా దగ్గర నుండి తెచ్చినట్లు సమూయేలు చెప్పాడు. 2 సర్వశక్తిమంతుడైన యెహోవా వర్తమానం ఇది: “ఈజిప్టునుండి విముక్తి పొంది ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు వారిని కనానుకు పోకుండా ఆపాలని అమాలేకీయులు ప్రయత్నించారు. అమాలేకీయులు ఏమి చేశారో నేను స్వయంగా చూశాను. 3 నీవు ఇప్పుడు వెళ్లు. అమాలేకీయులపై యుద్ధం ప్రకటించు. నీవు అమాలేకీయులను సర్వనాశనం చేయాలి. అంతేగాదు, వారికి చెందిన ప్రతి వస్తువూ నాశనం కావాలి. దేనినీ బతకనివ్వకు. పురుషులను, స్త్రీలను, పిల్లలను పసివాళ్లను, పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను-అన్నింటినీ హతమార్చి వేయాలి.”
4 సౌలు సైన్యాన్ని పిలిచి తెలాయీము వద్ద సమీకరించాడు. సైనికులు రెండు లక్షలమంది ఉన్నారు. అందులో పదివేలమంది యూదాకు చెందినవారు. 5 సౌలు అమాలేకీయుల ఒక నగర సమీపానికి వెళ్లి లోయలో పొంచివున్నాడు. 6 ఆ ప్రాంతంలో కేనీయులు కూడా వున్నారు. సౌలు వారితో అమాలేకీయులను వదిలి వెళ్లిపొమ్మన్నాడు. అలా వెళ్తే అమాలే కీయులతో పాటు వారిని చంపనని చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీరు వారికి కనికరము చూపారు గనుక మిమ్మల్ని చంపను” అని సౌలు అన్నాడు. అది విని అమాలేకీయులనుండి విడి పోయి కేనీయులు వెళ్లిపోయారు.
7 అమాలేకీయులను సౌలు ఓడించాడు. హవీలా నుండి ఈజిప్టు సరిహద్దుల్లోని షూరు పట్టణం వరకూ సౌలు వారితో పోరాడాడు. 8 అమాలేకీయుల రాజైన అగగును మాత్రం సజీవంగా పట్టుకుని అతని సైన్యం అంతటినీ సౌలు చంపేసాడు. 9 సౌలు, మరియు ఇశ్రాయేలు సైనికులు అగగును బతకనిచ్చారు. బలంగా, ఆరోగ్యంగావున్న గొర్రెలను, పశువులను, గొర్రెపిల్లలను కూడా వారు వదిలివేశారు. ప్రయోజన కరమైన వాటన్నింటినీ చంపకుండా విడిచిపెట్టి వారికి అవసరం లేని వాటన్నింటినీ వారు చంపేసారు.
సమూయేలు సౌలుకు తన పాపం విషయం చెప్పుట
10 యెహోవా వాక్కు సమూయేలు దగ్గరకు వచ్చింది. 11 “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు గాభరా పడిపోయాడు. రాత్రంతా దుఃఖంతో యెహోవాని ప్రార్థించాడు.
12 మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయాణం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు.
కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటిని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు. 13 సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లాడు: “యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు.
14 “ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొర్రెల, పశువుల అరుపులు ఏమిటి” అని సమూయేలు ప్రశ్నించాడు.
15 సౌలు ఇలా జవాబు చెప్పాడు: “సైనికులు వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవుడైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు మంచి గొర్రెలను పశువులను కాపాడారు. కాని మిగిలిన వాటన్నిటినీ మేము చంపేశాము.”
16 సమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను” అన్నాడు సౌలుతో.
సౌలు, “సరే నాకు చెప్పు” అన్నాడు.
17 సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాలన్నింటికీ నీవు నాయకుడవైనావు. ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు. 18 యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. ‘వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపివేయి. వాళ్లను పూర్తిగా నాశనం చేయి’ అని యెహోవా చెప్పాడు. 19 కానీ నీవు యెహోవా మాట వినలేదు. వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.”
20 సౌలు, “నేనైతే యెహోవాకు విధేయుడనయ్యాను. యెహోవా పంపిన చోటికి నేను వెళ్లాను. అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి రాజు అగగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను. 21 సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు గిల్గాలువద్ద బలి అర్పించేందుకు శ్రేష్ఠమైన గొర్రెలను, పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు.
22 కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము. 23 అవిధేయుడవై ఉండట మంటే మంత్రం వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా ఇప్పుడు యెహోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.”
24 అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్లుగా నేను చేయలేదు. నేను ప్రజలకు భయపడ్డాను. వారు ఎలా చెప్పితే అలా చేశాను. 25 నా పాపం క్షమించుమని ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యెహోవాని ఆరాధిస్తాను, నాతో కూడ రా” అని సమూయేలుతో చెప్పాడు.
26 కానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకురాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తున్నాడు” అని చెప్పాడు.
27 సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు అతని అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది. 28 సమూయేలు, “నీవు నా అంగీ చింపేసావు. అదే విధంగా ఈవేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచివాడు. 29 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్ధం చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం మనస్సుమార్చుకునే మనిషిలాంటివాడు కాదు యెహోవా” అని సౌలుతో చెప్పాడు.
30 సౌలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు. 31 కనుక సమూయేలు సౌలుతో కలిసి వెనుకకు వెళ్లాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు.
32 “అమాలేకీయుల రాజైన అగగును తన వద్దకు తీసుకుని రమ్మని” సమూయేలు చెప్పాడు.
అగగుసంకెళ్లతో బంధించబడి సమూయేలు ముందుకు వచ్చాడు. “నిశ్చయంగా ఇతడు నన్ను చంపడు” అని అగగు అనుకున్నాడు.
33 కాని సమూయేలు అగగుతో, “నీ కత్తివేటుకు గురిచేసి అనేకమంది పిల్లలను తమ తల్లులకు లేకుండా చేసావు. కనుక ఇప్పుడు నీ తల్లికి పిల్లలు ఉండరు,” అంటూ గిల్గాలులో యెహోవా ఎదుట సమూయేలు అగగును ముక్కలుగా నరికి వేశాడు.
34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. 35 ఆ తరువాత సమూయేలు తన జీవితాంతం సౌలును మళ్లీ ఎన్నడూ చూడలేదు. కాని సౌలు విషయంలో సమూయేలు చాలా దుఃఖించాడు. సౌలును ఇశ్రాయేలుకు రాజుగా చేసినందుకు యెహోవా చాలా చింతించాడు.
సమూయేలు బేత్లెహేముకు వెళ్లుట
16 యెహోవా, “ఎంతకాలం ఇలా సౌలుకోసం చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను నిరాకరించాను. నీ కొమ్ములనునూనెతో నింపుకొని వెళ్లు. యెష్షయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. యెష్షయి బేత్లెహేములో నివసిస్తున్నాడు. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు.
2 కానీ, “నేను వెళితే ఈ వార్త సౌలు విని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు” అని సమూయేలు అన్నాడు.
“నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు వెళ్లు. ‘యెహోవాకు నేను ఒక బలి అర్పించటానికి వచ్చాను’ అని చెప్పు. 3 బలి కార్యక్రమానికి యెష్షయిని రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు.
4 యెహోవా చెప్పినట్లు సమూయేలు చేసాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు భయంతో వణకిపోయారు. వారు సమూయేలును కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చావా?” అని అడిగారు.
5 “అవును నేను సమాధానంగానే వచ్చాను. యెహోవాకు ఒక బలి అర్పించటానికి నేను వచ్చాను. మీరంతా తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి సిద్ధపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. సమూయేలు యెష్షయిని, అతని కుమారులను సిద్ధంచేశాడు. బలి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూయేలు వారిని ఆహ్వానించాడు.
6 యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలంచాడు.
7 అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు.
8 అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు.
9 తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు.
10 తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు.
11 అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు.
“అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు.
సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు.
12 యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు.
“లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!” అని యెహోవా సమూయేలుతో చెప్పాడు.
13 ప్రత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు తీసుకుని యెష్షయి చిన్న కుమారుని సోదరులందరి ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి పోయాడు.
ఒక దుష్ట శక్తి సౌలును పీడించుట
14 యెహోవా ఆత్మ సౌలును విడిచి పెట్టేసాడు. యెహోవా సౌలు మీదికి ఒక దుష్టాత్మను పంపించాడు. అది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది. 15 సౌలు సేవకులు అతనితో ఇలా అన్నారు: “దేవుని వద్దనుండి వచ్చిన ఒక దుష్ట ఆత్మ వచ్చి నిన్ను బాధ పెడుతోంది. 16 మాకు ఆజ్ఞ ఇవ్వుము. సితారాను వాయించగలవాని కోసం వెదుకుతాము. యెహోవా దగ్గరనుండి ఆ దుష్ట శక్తి నీ మీదికి వస్తే ఇతడు సితారా వాయిస్తాడు. అప్పుడు ఆ దుష్ట ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తుంది. నీకు ఊరట కలుగుతుంది.”
17 “ఒక మంచి సితార వాయించువానిని చూసి నా దగ్గరకు తీసుకుని రండి” అని సౌలు తన సేవకులతో చెప్పాడు.
18 అప్పుడు నౌకర్లలో ఒకడు, “బేత్లెహేములో యెష్షయి అని ఒక మనిషి ఉన్నాడు. యెష్షయి కొడుకును నేను చూసాను. సితార వాయించటం అతనికివచ్చు. అతడు ధైర్యవంతుడు. బాగా పోరాడగలవాడు. కూడా. అతడు చాతుర్యంగలవాడు. అతడు అందగాడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.
19 కనుక సౌలు కొందరు మనుష్యులను యెష్షయి దగ్గరకు పంపించాడు. “నీకు దావీదు అనే కొడుకు ఉన్నాడు. అతడు గొర్రెలను కాస్తున్నాడు. అతనిని నా దగ్గరకు పంపించు” అని సౌలు చెప్పినదానిని వారు యెష్షయికి చెప్పారు.
20 కనుక యెష్షయి సౌలుకు కానుకలుగా కొన్ని వస్తువులు సిద్ధం చేసాడు. ఒక గాడిదను, కొంత రొట్టె, ఒక ద్రాక్షారసపు తిత్తి, ఒక మెక పిల్లను యెష్షయి సిద్ధం చేసాడు. యెష్షయి వాటిని దావీదుకు ఇచ్చి అతనిని సౌలు వద్దకు పంపించాడు. 21 కనుక దావీదు సౌలు దగ్గరకు వెళ్లి అతని ఎదుట నిలిచాడు. సౌలు దావీదును చాలా ప్రేమించాడు. దావీదు సౌలుకు ఆయుధాలు మోసే సహాయకుడయ్యాడు. 22 “దావీదును నాతో ఉండనియ్యి. నా సేవ చేయనియ్యి. అతడంటే నాకు చాలా ఇష్టం” అని యెష్షయికి ఒక సందేశం పంపాడు సౌలు.
23 దేవుడు పంపిన దురాత్మ సౌలు మీదికి వచ్చినపుడు దావీదు తన సితార తీసుకుని వాయించేవాడు. ఆ దుష్ట ఆత్మ సౌలును వదిలిపోయేది, అతనికి హాయిగా ఉండేది.
మంచి సమరయుని ఉపమానం
25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం[a] పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.
27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.
28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”
29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.
30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.
31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.
33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”
36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.
దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
యేసు మార్త యింటికి వెళ్ళటం
38 యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది. 40 కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.
41 ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 42 నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.
© 1997 Bible League International