Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

కీర్తనలు. 12-14

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

1 రాజులు 3:1-15

సొలొమోను జ్ఞానం కోసం అడుగుట

సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింపచేస్తూనేవున్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడకూడా నిర్మిస్తున్నాడు. దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై[a] వున్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూండేవారు. యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పనిది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొనసాగించాడు.

సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు. సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా అతనికి స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను” అని యెహోవా అన్నాడు.

సొలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. అతను నిన్ననుసరించాడు. అతను కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవతని కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు అతనికి అపూర్వమైన కరుణ చూపావు. నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పసివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది. నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్కపెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది. అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానము లేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.”

10 సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు. 11 అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు. 12 కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు. 13 పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు. 14 నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.”

15 సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో కలలో మాట్లాడినట్లు తెలుసుకొన్నాడు. సొలొమోను తరువాత యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒడంబడిక పెట్టె ముందు నిల్చున్నాడు. సొలొమోను యెహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరువాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగావున్న నాయకులకు, అధికారులందరికీ విందు ఇచ్చాడు.

అపొస్తలుల కార్యములు 27:9-26

అప్పటికే చాలా కాలం వృథా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం[a] చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడమని చెబుతూ, 10 “ప్రజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు. 11 కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు. 12 వాళ్ళున్న రేవు చలి కాలంలో ఉండటానికి పనికిరాదు. కనుక అనేకులు ప్రయాణం సాగించమని సలహాయిచ్చారు. చలికాలం గడపటానికి “ఫీనిక్సు” అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫీనిక్సు రేవు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి, వాయవ్య దిశలనుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించటానికి వీలుంటుంది.

తుఫాను

13 దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. 14 అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. 15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. 16 “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. 17 దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.

18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు. 19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. 20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.

21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. 22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. 23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: 24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ 25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. 26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.

మార్కు 14:1-11

యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం

(మత్తయి 26:1-5; లూకా 22:1-2; యోహాను 11:45-53)

14 పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు రెండురోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు. “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు” అని మాట్లాడుకొన్నారు.

బేతనియ గ్రామంలో తైలాభిషేకం

(మత్తయి 26:6-13; లూకా 12:1-8)

ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా, ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది.

ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, “అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు? దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు[a] వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.

యేసు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు. ఆమె మంచి పని చేసింది. పేదవాళ్ళు మీలో ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది.[b] ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.

యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం

(మత్తయి 26:14-16; లూకా 22:3-6)

10 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. 11 వాళ్ళు ఇది వినిచాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International