Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 146-147

146 యెహోవాను స్తుతించండి!
    నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
    నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
    మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
    అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
    సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
    గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
    విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
    అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!

147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    మన దేవునికి స్తుతులు పాడండి.
    ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
    బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
    వారి గాయాలకు కట్లు కడతాడు.
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
    వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
    ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
పేదలను యెహోవా బలపరుస్తాడు.
    కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
    స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
    భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
    పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
    ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
    సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
    నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
    ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
    దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
    ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
    ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
    మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.

19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
    దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
    ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.

యెహోవాను స్తుతించండి!

కీర్తనలు. 111-113

111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
    నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
    దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
    వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
    ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
    ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
    దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
    దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

112 యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
    మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
    అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
    దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
    తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
    ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
    ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
    అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
    అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
    వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
    దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.

113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
    యెహోవా నామాన్ని స్తుతించండి.
ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
    సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
    ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
    దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
    ఆయన తప్పక కిందికి చూడాలి.
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
    భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
    ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
    కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.

యెహోవాను స్తుతించండి!

2 సమూయేలు 24:1-2

దావీదు తన సైన్యాన్ని లెక్కింప నిర్ణయం

24 యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు.

దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు.

2 సమూయేలు 24:10-25

దావీదును యెహోవా శిక్షించటం

10 జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”

11 దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహితుడు. 12 గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.”

13 దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా? లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా? లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా? బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.”

14 గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయనే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు.

15 అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు. 16 దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం[a] వద్దవున్నాడు.

దావీదు అరౌనా కళ్లము కొనటం

17 ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”

18 ఆరోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం మీద యెహోవాకి ఒక బలిపీఠం నిర్మించమని చెప్పాడు”.

19 గాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు. 20 అరౌనా తలెత్తి చూడగా అక్కడ రాజు (దావీదు) వున్నాడు. ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి రాజుకు నమస్కరించాడు. 21 “నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా.

అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు.

22 “నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి ధాన్యం రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి! 23 ఓ రాజా! ఇవన్నీ నీకు నేను ఇస్తాను.” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభువైన దేవుడు నీ పట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ అన్నాడు.

24 అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెబుతున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమిని కొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!”

కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏబైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు. 25 తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింపజేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు.

దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.

గలతీయులకు 3:23-4:7

23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. 24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. 25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.

26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. 27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. 29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.

నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు. అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే. అదే విధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము. కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.

మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “అబ్బా![a] తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.

యోహాను 8:12-20

యేసు ఈ ప్రపంచానికి వెలుగు

12 యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.

13 పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.

14 యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. 15 మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. 16 కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. 17 ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు. 18 నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.

19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు.

యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు. 20 ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International