Book of Common Prayer
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
సీనాయి పర్వతంపై ఏలీయా
19 ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో అహాబు ఆమెకు వివరించాడు. 2 అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”
3 ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు. 4 తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు, ఇక నన్ను తీసికొనుము. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.”
5 ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత. 6 ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు.
7 యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు. 8 అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు. 9 అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు.
అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు.
10 ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”
11 అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. 12 ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది.
క్రొత్త నిబంధన యొక్క సేవకులు
3 ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా? 2 మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. 3 మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.
4 మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది. 5 మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. 6 దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.
క్రొత్త నిబంధన యొక్క మహిమ
7 రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే, 8 దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. 9 శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి.
18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.
© 1997 Bible League International