Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 86

దావీదు ప్రార్థన.

86 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    యెహోవా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు.
    నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు.
    నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
నా ప్రభువా, నా మీద దయ చూపించుము.
    రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను.
    నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు.
    సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే
    నా ప్రార్థనలు ఆలకించుము.
యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
    నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
దేవా, నీవంటివారు మరొకరు లేరు.
    నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు.
    వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు.
    నీవు మాత్రమే దేవుడవు.
11 యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు
    నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను.
నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా
    అతి ముఖ్యాంశంగా చేయుము.
12 దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను.
    నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
13 దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది.
    మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
14 దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు.
    కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
15 ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు.
    నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.
    నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను.
    నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.
    అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు.
    ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.

ఆదికాండము 28:10-17

బేతేలులో యాకోబు కలగనుట

10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. 11 యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటికి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు. 12 యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్లు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్లు యాకోబు చూశాడు.

13 అప్పుడు ఆ నిచ్చెన పైన యెహోవా నిలిచినట్లు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి. ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. 14 నేలమీద ధూళి కణముల్లాగ నీకు కూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.

15 “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్దానం చేసింది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”

16 అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్లు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.

17 యాకోబు భయపడి, “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.

యోహాను 1:43-51

43 మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. 44 అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. 45 ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.

46 నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు.

“వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.

47 నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.

48 “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు.

యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.

49 నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు.

50 యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు. 51 ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.

కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

కీర్తనలు. 67

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

1 పేతురు 5:1-11

దేవుని మంద

మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట మేమనగా, మీలాగే నేను కూడ ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్థుణ్ణి. సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే! డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ కార్యాన్ని చేయండి. దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.

అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో:

“దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు,
    కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.”(A)

అని వ్రాయబడి ఉంది. అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి.

మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మ్రింగివేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి సాతానుకి ఎదురు తిరగండి.

10 దయామయుడైన దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని యిచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. 11 ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International