Book of Common Prayer
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
2 దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
7 దేవా, నీవు భీకరుడవు.
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.
23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో. 24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”
25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుముకుంటూ పోయి చంపాడు.
దేవుని పవిత్ర పెట్టెను యెరూషలెముకు తరలించుట
6 దావీదు మరల ప్రత్యేకంగా ఉత్తములైన ముప్పదివేల మంది ఇశ్రాయేలు యోధులను సమకూర్చుకొన్నాడు. 2 దావీదు వారిని తీసుకొని యూదాలో ఉన్న బాలాకు[a] ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెట్టె తీసుకొని, దానిని యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర పెట్టె సైన్యములకు అధిపతియైన యెహోవా పరమ పవిత్ర నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్టె పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైయున్నాడు. 3 దావీదు మనుష్యులు యెహోవా పవిత్ర పెట్టెను ఒక కొత్త బండిపై ఉంచారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి వారా పెట్టెను తెచ్చారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహ్యో అనువారు ఆ బండిని తోలారు.
4 కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి ఉజ్జా, అహ్యోలిరువురూ ఆ బండిని బయలుదేరదీశారు. బండిపై దేవుని పవిత్ర పెట్టె వున్నది. అహ్యో బండిముందు నడుస్తూ ఉన్నాడు. 5 దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి. 6 దావీదు మనుష్యులు నాకోను నూర్పిడి కళ్లం దగ్గరకు రాగానే ఎద్దులు తూలి పడబోయాయి. దానితో బండి మీదవున్న దేవుని ఒడంబడిక పెట్టె ఒరిగి క్రింద పడబోయింది. వెంటనే ఉజ్జా పవిత్ర పెట్టెను పట్టుకున్నాడు. 7 యెహోవాకు ఉజ్జాపై కోపం వచ్చి చంపివేశాడు.[b] దేవుని పవిత్ర పెట్టెను తాకినప్పుడు ఉజ్జా దేవుని గౌరవించినట్లు గాదు. దేవుని పవిత్ర పెట్టెవలన ఉజ్జా చంపబడ్డాడు. 8 ఉజ్జాను యెహోవా చంపినందుకు దావీదు కలత చెందాడు. దావీదు ఆ స్థలానికి “పెరెజ్ – ఉజ్జా”[c] అని పేరు పెట్టాడు. ఆ ప్రదేశం ఈనాటికీ పెరెజ్ – ఉజ్జా అనే పిలవబడుతూ వుంది.
9 ఆ రోజు దావీదు యెహోవా అంటే భయపడిపోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర పెట్టె నా వద్దకు ఎలా వస్తుంది?” అని అడిగాడు. 10 దావీదు పురములోనికి తనకై తాను దేవుని పవిత్ర పెట్టెను దావీదు తీసుకొని పోవుటకు సుముఖత చూపలేదు. గాతువాడైన ఓబేదెదోము[d] ఇంటిలో పవిత్ర పెట్టెను దావీదు వుంచాడు. బాటమీద నుంచి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటివరకు పవిత్ర పెట్టెను దావీదు మోసాడు. 11 ఓబేదెదోము ఇంటి వద్ద యెహోవా పవిత్ర పెట్టె మూడు నెలలపాటు వుండెను. కాబట్టి ఓబేదెదోమును, అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు.
ఏథెన్సులో
16 పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది. 17 అందువల్ల సమాజమందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవభీతిగల యూదులుకాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు. 18 ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు.
“ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.
19 వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు. 20 “నీవు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసావు. వాటి అర్థం మాకు చెప్పు” అని మరి కొందరడిగారు. 21 ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు.
22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.
24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.
27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”
32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.
యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 15:32-39)
8 ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ ఉండనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి, 2 “నాకు జాలివేస్తోంది. వాళ్ళిప్పటికే మూడు రోజులనుండి నా దగ్గరున్నారు. తినటానికి వాళ్ళ దగ్గర ఏమీలేదు. 3 నేను వాళ్ళను ఆకలితో యింటికి పంపివేస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు. కనుక వాళ్ళు దారిలో మూర్ఛపోవచ్చు” అని అన్నాడు.
4 ఆయన శిష్యులు, “ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తినటానికి చాలినంత ఆహారం ఎక్కడనుండి తెమ్మంటారు?” అని అన్నారు.
5 “ఎన్ని రొట్టెలున్నాయి” అని యేసు అడిగాడు.
“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
6 యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఏడు రొట్టెలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. ఆ రొట్టెముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. 7 వాళ్ళ దగ్గర కొన్ని చేపలుకూడా ఉన్నాయి. వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకు యిచ్చాడు.
8 ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని ఏడు గంపలనిండా నింపారు. 9 నాలుగు వేలమంది ప్రజలు అక్కడవున్నారు. వాళ్ళను పంపివేసి వెంటనే 10 యేసు తన శిష్యులతో కలిసి పడవనెక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
© 1997 Bible League International