Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 70-71

సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.

70 దేవా, నన్ను రక్షించుము.
    దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారిని నిరాశపరచుము.
    వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
    వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
మనుష్యులు నన్ను హేళన చేసారు.
    వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.

నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
    ఆలస్యం చేయవద్దు!

71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
    నా మాట వినుము. నన్ను రక్షించుము.
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
    నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
    నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
    నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
    నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను.
    ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
కనుక నేను ముసలివాడినని నన్ను త్రోసివేయకుము.
    నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు.
    ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.
11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి.
    అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.
12 దేవా, నన్ను విడిచిపెట్టకుము.
    దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
13 నా శత్రువులను ఓడించుము.
    వారిని పూర్తిగా నాశనం చేయుము.
వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.
14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను.
    నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను.
    నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను.
    లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను.
    నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.
17 దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు.
    నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను.
18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు.
    నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.
19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది.
    దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు.
    నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.
20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు.
    కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు.
    భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
21 ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము.
    నన్ను ఆదరిస్తూనే ఉండుము.
22     స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను.
    నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.
23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది.
    నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.
24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది.
    నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.

కీర్తనలు. 74

ఆసాపు ధ్యాన గీతం.

74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
    నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
    నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
    శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.

శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
    యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
    నరికే మనుష్యుల్లా ఉన్నారు.
ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
    నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
    వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
    ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
    దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
    ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
    ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
    నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
    నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
    నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
    దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
    మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
    సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
    వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
    ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
    నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
    ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
    వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
    నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
    ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
    ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.

2 సమూయేలు 4

సౌలు కుటుంబానికి కష్టాలు రావటం

హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, అతని ప్రజలు చాలా గాభరా చెందారు. సౌలు సైన్యంలో దళాధిపతులైన ఇరువురు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో ఒకని పేరు బయనా, మరియొకని పేరు రేకాబు. బయానా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు బెన్యామీను వంశానికి[a] చెందిన వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెందినది. కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు.

సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారిక్రిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.

రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు. 6-7 రేకాబు, బయనా గోధుమలు తీసుకొని వెళ్లాలనే నెపంతో నట్టింట్లోకి వచ్చారు. ఇష్బోషెతు తన పడకగదిలో పక్కమీద పడుకున్నాడు. రేకాబు, బయనాలిద్దరూ ఇష్బోషెతును పొడిచి చంపారు. వారు అతని తల నరికి దానిని వారితో తీసుకొనిపోయారు. రాత్రంతా ప్రయాణం చేసి, హెబ్రోనుకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదుకు ఇచ్చారు.

రేకాబు, బయనాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!”

రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు. 10 ఒకానొకడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. వాడు వచ్చి, ‘సౌలు చచ్చిపోయాడు!’ అని చెప్పాడు. ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితోషికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని సిక్లగు వద్ద చంపివేశాను. 11 కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్కమీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!”

12 దావీదు కొందరు యువకులను పిలిచి రేకాబు, బయనాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు రేకాబు, బయనాల కాళ్లు, చేతులు నరికి, హెబ్రోను మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధి వద్ద పాతి పెట్టారు.

అపొస్తలుల కార్యములు 16:25-40

25 అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బంధీలు వింటున్నారు. 26 అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి. 27 చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. 28 కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు.

29 ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు. 30 ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.

31 వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు. 32 ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు. 33 ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోనివాళ్ళు బాప్తిస్మము పొందారు. 34 ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోనివాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు.

35 తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయమని ఆజ్ఞాపించారు.

36 “నిన్ను, సీలను విడుదల చేయమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి!” అని చెరసాల అధికారి అన్నాడు.

37 కాని పౌలు వాళ్ళతో, “మేము రోమా పౌరులమైనా విచారణ జరుపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు. కారాగారంలో పడవేసారు. కాని యిప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు.

38 భటులు ఈ వార్త అధికారులకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీల రోమా పౌరులని విని భయపడిపోయారు. 39 అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించమని వేడుకొన్నారు. వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు. 40 పౌలు, సీల కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.

మార్కు 7:1-23

దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం

(మత్తయి 15:1-20)

యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు,[a] శాస్త్రులు యేసు చుట్టూ చేరారు. వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు. పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు. వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను[b] శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం.

అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, “మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు?” అని అడిగారు.

యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు:

‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు.
    కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.
వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు.
    కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’(A)

దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు.

“మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు. 10 ఉదాహరణకు, మోషే మీ తల్లితండ్రుల్ని గౌరవించమని(B) మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధించమని ఆజ్ఞాపించాడు.(C) 11 కాని ఒక మనిషి దగ్గర తన తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం అని అంటే, 12 ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు. 13 మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు” అని అన్నాడు.

14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు. 16 మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు.

17 యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 18 యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా! 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.)

20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International