Book of Common Prayer
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
8 ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
9 దేవుడు రాజును రక్షించును గాక!
మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
2 రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.
3 యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
4 దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
5 రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
6 దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
8 రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
9 నీవు కనబడినప్పుడు
ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.
13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.
దావీదు స్తుతి కీర్తన.
110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]
4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”
5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.
6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!
7 మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.
116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
నాకు ఎంతో సంతోషం.
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
నేను భయపడి చింతపడ్డాను.
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
యెహోవా దయగలవాడు.
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
7 నా ఆత్మా, విశ్రమించు!
యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
10 “నేను నాశనమయ్యాను!”
అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.
12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
13 నన్ను రక్షించినందుకు
నేను ఆయనకు పానార్పణం యిస్తాను.
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.
15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
యెహోవా, నీవే నా మొదటి గురువు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.
యెహోవాను స్తుతించండి!
117 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి.
సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
2 దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు.
దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు.
యెహోవాను స్తుతించండి!
51 ఆ రకంగా రాజైన సొలొమోను కోరుకున్న ప్రకారం యెహోవా దేవాలయంయొక్క పని పూర్తి అయింది. అప్పడు రాజైన సొలొమోను తన తండ్రి దావీదు దేవునికి అంకితం చేసిన వస్తువులన్నీ దేవాలయానికి తెచ్చాడు. దేవాలయపు ధనాగారంలో ఆ వెండి బంగారాలు భద్రపరిచాడు.
నిబంధన మందసం దేవాలయానికి తేబడుట
8 రాజైన సొలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలందరినీ, ఆయా వంశాల ప్రధాన పురుషులను, ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురంనుండి దేవుని ఒడంబడిక పెట్టెను దేవాలయానికి తరలించే కార్యక్రమంలో పాల్గొనమని సొలొమోను వారిని కోరాడు. 2 కావున ఇశ్రాయేలీయులందరూ రాజైన సొలొమోను వద్దకు వచ్చారు. ఏతనీము అనబడే మాసంలో పండుగ సందర్భంగా ప్రత్యేక సెలవు రోజున (పర్ణశాలల పండుగ) సమావేశం జరిగింది. అది సంవత్సరంలో ఏడవనెల.
3 ఇశ్రాయేలు పెద్దలందరూ ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు యాజకులు పవిత్ర ఒడంబడిక పెట్టె తీసుకున్నారు. 4 యెహోవా ఒడంబడిక పెట్టె సన్నిధి గుడారము, దానిలోని పవిత్ర వస్తువులతో పాటు వారు మోసుకొని వెళ్లారు. లేవీయులు కొందరు ఈ వస్తువులను మోయుటలో సహాయం చేశారు. 5 రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడంబడిక పెట్టె ముందు సమావేశమయ్యారు. వారప్పుడు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని గొర్రెలను, పశువులను బలి యిచ్చారు. 6 అప్పుడు యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టె దాని అసలైన స్థానంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలము. ఒడంబడిక పెట్టె కెరూబుల రెక్కల కిందుగా ఉంచబడింది. 7 ఒడంబడిక పెట్టె ఉంచబడిన స్థానం మీదుగా కెరూబుల రెక్కలు వ్యాపించి వున్నాయి. ఆ రెక్కలు ఒడంబడిక పెట్టె, దానిని మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి. 8 ఒడంబడిక పెట్టె మోసే కోలలు (కర్రలు) చాలా పొడవైనవి. అతి పరిశుద్ధ స్థలం ముందు పవిత్ర స్థలంలో ఎవరు నిలబడి చూసినా ఆ కోలలను చివరి వరకు చూడగలరు. కాని వాటినెవరూ బయటి నుండి చూడలేరు. ఈ నాటికీ ఆ కోలలు అదే స్థానంలో వున్నాయి. 9 ఆ ఒడంబడిక పెట్టెలో వున్నవి కేవలం రెండు రాతి ఫలకాలు. ఈ రెండు ఫలకాలను హోరేబు అనే చోట మోషే ఈ ఒడంబడిక పెట్టెలో భద్రపరచాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి బయటికి వచ్చిన తరువాత హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన ఒడంబడిక చేశాడు.
10 యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయటికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాలయాన్ని కమ్మివేసింది. 11 యెహోవా మహిమతో దేవాలయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వర్తించలేక పోయారు. 12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు:
“ఆకాశంలో ప్రకాశించటానికి యెహోవా సూర్యుడ్ని కలుగజేశాడు,
కాని ఆయన మాత్రం ఒక నల్లని మేఘంలో నివసిస్తానన్నాడు.
13 నిజానికి నేకొక అద్భుతమైన దేవాలయాన్ని నీ కొరకు నిర్మించాను,
అది నీవు శాశ్వతంగా నివసించే స్థలం.”
14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియున్నారు. రాజైన సొలొమోను వారి వైపు తిరిగి వారిని దీవించుమని దేవుడిని అడిగాడు. 15 తరువాత రాజైన సొలొమోను దేవునికి సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. అతడిలా అన్నాడు:
“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నతుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట ప్రకారం అతడు అన్నీ నెరవేర్చాడు. 16 యెహోవా నా తండ్రితో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టునుండి విముక్తులను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయలేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించటానికి దావీదును ఎంపిక చేశాను’ అని చెప్పాడు.
17 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఘనంగా ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కిలిగా కోరుకున్నాడు. 18 కాని యెహోవా నా తండ్రి దావీదుతో ‘నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం సంతోషించ తగ్గ విషయం. 19 కాని నాకు దేవాలయం కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు,’ అని అన్నాడు.
20 “కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నా తండ్రి దావీదు స్థానంలో ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను దేవాలయం కట్టించాను. 21 దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు.”
17 మూడు రోజుల తర్వాత పౌలు యాదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వికుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏది చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోమా అధికారులకు అప్పగించారు. 18 వాళ్ళు విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు. 19 కాని, దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు. 20 ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు.
21 వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు: “యూదయనుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా మాట్లాడలేదు. 22 కాని అన్ని ప్రాంతలవాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
23 పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతలనుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 24 అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. 25 వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వికులతో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు:
26 ‘ప్రజలతో ఈ విధంగా చెప్పు:
మీరెప్పుడూ వింటుంటారు.
కాని ఎన్నటికి అర్థం చేసుకోరు!
మీరు అన్ని వేళలా చూస్తుంటారు.
కాని ఎన్నటికి గ్రహించరు.
27 వాళ్ళు కళ్ళతో చూసి,
చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని
నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను.
కాని అలా జరుగకూడదని ఈ ప్రజల
హృదయాలు ముందే మొద్దు బారాయి.
వాళ్ళకు బాగా వినిపించదు.
వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’(A)
28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” 29 [a]
30 పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చినవాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. 31 ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.
యేసును బంధించటం
(మత్తయి 26:47-56; లూకా 22:47-53; యోహాను 18:3-12)
43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు.
44 ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో[a] ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు. 45 వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు. 46 వచ్చిన ప్రజలు యేసును బంధించారు. 47 యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు.
48 యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? 49 నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు. 50 అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు.
51 ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని, 52 అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.
© 1997 Bible League International