Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 30

దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.

30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
    నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
    నీవు నన్ను స్వస్థపరచావు.
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
    నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.

దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
    ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
    నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
    మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
    నేను ఎన్నటికీ ఓడించబడను.
యెహోవా, నీవు నామీద దయ చూపావు.
    బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
    మరి నేను చాలా భయపడిపోయాను.
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
    నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
“దేవా, నేను మరణించి,
    సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
    అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
    యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.

11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
    నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
    ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

కీర్తనలు. 32

దావీదు దైవధ్యాన కీర్తన.

32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
    తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
    తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.

దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
    కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
    నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
    తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.

అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
    కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
    నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
    మరియు నీవు నా పాపాలను క్షమించావు.
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
    కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
    నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
    నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
    నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
    నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
    ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”

10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
    కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.

కీర్తనలు. 42-43

రెండవ భాగం

(కీర్తనలు 42–72)

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం

42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
    అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
    ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
    నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.

కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
    నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
    అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.

నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
    ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
    ఆయన నన్ను కాపాడుతాడు.
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
    కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
    నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.

ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
    అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
    “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
    నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
    “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.

11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
    నా సహాయమా! నా దేవా!

43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
దేవా, నీవే నా క్షేమ స్థానం.
    నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
    నేనెందుకు విచారంగా ఉండాలి?
దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
    నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
    దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
    దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.

నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
    నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
    నా దేవుడే నాకు సహాయము.

1 రాజులు 12:1-20

అంతర్యుద్ధం

12 1-2 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను నుండి తప్పించుకొని ఈజిప్టుకు పారిపోయాడు. అక్కడే వుండి పోయాడు. అతడు సొలొమోను మరణం గురించి విన్నప్పుడు, ఎఫ్రాయీము కొండలలో వున్న జెరేదా అను తన నగరానికి తిరిగి వచ్చాడు. రాజైన సొలొమోను చనిపోయి, తన పూర్వీకులతో పాటు సమాధి చేయబడిన పిమ్మట అతని కుమారుడు రెహబాము అతని స్థానంలో రాజయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలంతా షెకెమునకు వెళ్లారు. వారంతా రెహబామును రాజుగా చేయటానికి వెళ్లారు.

రెహబాము కూడా రాజు కావటానికి షెకెమునకు వెళ్లాడు. ప్రజలు రెహబాముతో, “నీ తండ్రి మమ్మల్ని బలవంతంగా భరింపరాని శరీర కష్టం చేయించాడు. కాని ఇప్పుడు నీవు మాకు శ్రమ తగ్గించాలి. నీ తండ్రి మాకు విధించిన శరీరకష్టం నీవు మాన్పించాలి. అప్పుడు మేము నీకు సేవ చేస్తాము” అని అన్నారు.

దానికి సమాధానంగా రెహబాము, “మూడు రోజుల తరువాత నా వద్దకు రండి. అప్పుడు మీకు నేను సమాధానం చెబుతాను” అని అన్నాడు. కావున ప్రజలంతా వెళ్లిపోయారు.

సొలొమోను జీవించి వున్నప్పుడు అతనికి పరిపాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన సలహాదారులున్నారు. కావున రాజైన రెహబాము ఈ సందర్భంలో, “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను కొంటున్నారు?” అని సలహా అడిగాడు.

పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి సేవకునిలా మెలగితే, రేపు వారంతా నిన్ను సేవిస్తారు. నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.”

కాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. తన స్నేహితులైన యువకులను సలహా అడిగాడు. “నా తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంటె తక్కువ పని ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమాధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన స్నేహితులను అడిగాడు.

10 రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు నీ వద్దకు వచ్చి, ‘నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని ఇప్పుడు సులభం చేయుము’ అని అడిగారు కదా! అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, ‘నా చిటికెనవేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది. 11 నా తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి మీచేత పని చేయించటానికి కొరడాలు ఉపయోగించాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్లుగా కొడతాను’” అని సమాధానం చెప్పమన్నారు.

12 రెహబాము ప్రజలను, “మూడు రోజుల తరువాత తన వద్దకు రమ్మని” చెప్పాడు. కావున మూడు రోజుల తరువాత ఇశ్రాయేలీయులంతా రెహబాము వద్దకు వచ్చారు. 13 అప్పుడు రాజైన రెహబాము వారితో చాలా పరుషంగా మాట్లాడాడు. పెద్దలిచ్చిన సలహా రాజు పెడచెవిని పెట్టాడు. 14 తన యువ స్నేహితులు చెప్పినదే చేశాడు. రెహబాము వారితో, “నా తండ్రి మిమ్మల్ని హింసించి శరీర కష్టం చేయించాడు. కాని నేను మీకు ఇంకా కఠినమైన పని ఇస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టి పని చేయించాడు. కాని నేను మిమ్మల్ని ఎలా కొడతానంటే మీరు తేళ్లు కుట్టినట్లు బాధపడతారు!” అని చెప్పాడు. 15 కావున రాజు తన ప్రజలు కోరిన దానిని చేయలేదు. ఇదంతా యెహోవాయే తన చిత్తప్రకారం జరిపించాడు. తాను నెబాతు కుమారుడైన యరొబాముకు ఇచ్చిన వాగ్దాం నెరవేరేలాగున యెహోవా ఇది ఈ విధంగా జరిగేలా చేశాడు. షిలోహుకు చెందిన ప్రవక్త అహియా ద్వారా ఈ వాగ్దానం చేశాడు.

16 ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు:

“మనం దావీదు వంశానికి చెందినవారమా?
    కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా?
రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి,
    దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!”

తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు. 17 అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు.

18 కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు. 19 అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు.

20 యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశారు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు.

యాకోబు 5:7-12

సహనము

అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.

10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. 11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.

మీరేమంటున్నారో జాగ్రత్త

12 నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.

యాకోబు 5:19-20

పాపిని నీతికి మళ్ళించటం

19 నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే యిది గమనించండి. 20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి నుండి రక్షించినవాడౌతాడు. అదీగాక అతన్ని చావు నుండి తప్పించినవాడౌతాడు.

మార్కు 15:33-39

యేసు మరణం

(మత్తయి 27:45-56; లూకా 23:44-49; యోహాను 19:28-30)

33 మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. 34 మూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అంటే, “నాదేవా! నాదేవా! నన్నెందుకు ఒంటరిగా వదిలివేసావు”(A) అని కేకవేసాడు.

35 దగ్గర నిలుచున్న కొందరు ఇది విని, “వినండి! అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు.

36 ఒకడు పరుగెత్తి వెళ్ళి ఒక స్పాంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కట్టెకు తగిలించి యేసుకు త్రాగటానికి అందించాడు. మరొకడు, “అతణ్ణి వదలండి! అతణ్ణి క్రిందికి దింపటానికి ఏలియా వస్తాడేమో చూద్దాం!” అని అన్నాడు.

37 పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు.

38 అప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది. 39 యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని,[a] ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక దేవుని కుమారుడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International