Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:49-72

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

తేత్

65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
    నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
    నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
    కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
    కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
    నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
    నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
    వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.

కీర్తనలు. 49

సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.

49 సర్వ దేశములారా, ఇది వినండి.
    భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
    ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
    నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
సామెతపైనా ఆసక్తినుంచుతాను.
    ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.

అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
    నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
    తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
    నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
    సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
    కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
    మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
    మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
    వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
    వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
    అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
    మరణం వారి కాపరి.
    వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.

15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
    సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
    వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
    వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
    ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
    అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.

కీర్తనలు. 53

సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.

53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
    అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
    సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
    దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
    కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
    ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
    ఒక్కడూ లేడు.

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
    కాని వారు నన్ను ప్రార్థించరు.
    ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”

కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
    భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
    కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.

ఇశ్రాయేలు ప్రజలారా,
    సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
    యాకోబు సంతోషిస్తాడు.
    ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

1 రాజులు 17

ఏలీయా మరియు వర్షాభావ పరిస్థితి

17 ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్బీ నగరానికి చెందినవాడు. ఏలీయా వచ్చి రాజైన అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్సరాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. నేను ఆజ్ఞ ఇస్తేగాని వర్షం పడదు.”

తరువాత యెహోవా ఏలీయాతో, “నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. ఆ వాగు యోర్దాను నదికి తూర్పున ఉన్నది. నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు[a] ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు. కావున యెహోవా చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్దాను నదికి తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి అతడు వెళ్లాడు. బొంత కాకులు ప్రతి ఉదయం రొట్టెను, ప్రతి సాయంత్రం మాంసాన్ని తెచ్చి ఇచ్చేవి. ఏలీయా వాగు నీటిని తాగేవాడు.

వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది. అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.”

10 కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు. 11 అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు.

12 “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెబుతున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది.

13 ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నేను చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో. 14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’”

15 అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. 16 పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.

17 కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ్రమయ్యింది. చివరిగా అతని శ్వాస ఆగిపోయింది. 18 ఆమె ఏలీయా వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా చేయటానికే నీవు వచ్చావా?” అని అడిగింది.

19 “నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు. 20 తరువాత ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభువైన దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద నీవు కలుగజేస్తావా? ఆమె కుమారుడు చనిపోయేలా చేస్తావా?” 21 పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! ఈ బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు.

22 యెహోవా ఏలీయా ప్రార్థన ఆలకించాడు. బాలుడు శ్వాసపీల్చటం ప్రారంభించాడు. వాడు బతికాడు. 23 ఏలీయా బాలుని కిందికి తీసుకుని వచ్చాడు. బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు బతికాడు” అని ఏలీయా అన్నాడు.

24 “నీవు నిజంగా దైవజనుడవేనని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లాడుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ స్త్రీ అన్నది.

ఫిలిప్పీయులకు 2:1-11

క్రీస్తు వినయంను అనుకరించుట

క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.

నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి

యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.

ఆయన దేవునితో సమానము.
    అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
ఆయన అంతా వదులుకొన్నాడు.
    మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
    మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
    మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
    అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
    ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
    తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!

మత్తయి 2:1-12

తూర్పు నుండి జ్ఞానులు రావటం

హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.

ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు. అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని[a] సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు. వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:

“‘యూదయ దేశంలోని బేత్లెహేమా!
    నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు!
ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు.
    ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”(A)

ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.

వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. 10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.

11 ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు. 12 హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International