Book of Common Prayer
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
“దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
నీ శక్తి గొప్పది!
విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
38 కాని దేవా, ఏర్పరచబడిన నీ రాజు[b] మీద నీకు కోపం వచ్చింది.
నీవు అతన్ని ఒంటరివానిగా విడిచి పెట్టావు.
39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు.
రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు.
అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు.
దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు.
అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు.
నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు.
నీవు అతన్ని అవమానించావు.
46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా?
నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా?
ఎంత కాలం యిలా సాగుతుంది?
47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము.
అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు.
ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.
49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ?
దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
50-51 ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము.
యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది.
ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.
52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి.
ఆమేన్, ఆమేన్![c]
అబ్షాలోము పగ తీర్చుకొనటం
23 రెండు సంవత్సరాల తరువాత అబ్షాలోము కొందరు మనుష్యులను తన గొర్రెల నుండి ఉన్ని తీయటానికి బయల్దాసోరుకు రావించాడు. ఈ కార్యక్రమం చూడటానికి రాజకుమారులందరినీ అబ్షాలోము ఆహ్వానించాడు. 24 అబ్షాలోము రాజు వద్దకు వెళ్లి, “నా గొర్రెల నుండి ఉన్ని తీయటానికి మనుష్యులను పిలిచాను. దయచేసి నీ సేవకులతో వచ్చి ఆ కార్యక్రమం తిలకించ” మని అడిగాడు.
25 “వద్దు, కుమారుడా! మేము రాము. మేమంతా వస్తే అది నీకు చాల శ్రమ అవుతుంది” అని దావీదు రాజు అబ్షాలోముతో అన్నాడు.
దావీదును రమ్మని అబ్షాలోము ప్రాధేయపడ్డాడు. దావీదు వెళ్లలేదు గాని, అతని పనిని ఆశీర్వదించాడు.
26 “నీవు రాకుంటే, దయచేసి నా సోదరుడు అమ్నోనును నాతో పంపించు” మని అబ్షాలోము అడిగాడు.
“అతడు నీతో ఎందుకు రావాలి?” అని దావీదు రాజు అడిగాడు.
27 అయినా అబ్షాలోము వినిపించుకోకుండా అదే పనిగా ప్రాధేయపడి అడిగాడు. చివరికి అమ్నోను, మిగిలిన రాజకుమారులు అబ్షాలోముతో వెళ్లటానికి ఒప్పుకున్నారు.
అమ్నోను హత్య చేయబడటం
28 అబ్షాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “అమ్నోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు బాగా తాగిన పిమ్మట ‘అమ్నోనును చంపండి’ అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయపడకండి నేను మీకు అజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, ధైర్యంగా వుండండి” అని అబ్షాలోము సేవకులతో అన్నాడు.
29 అబ్షాలోము ఆజ్ఞ మేరకు అతని యువసేవకులు అమ్నోనును చంపివేశారు. కాని దావీదు మిగిలిన కుమారులంతా తప్పించుకున్నారు. వారిలో ప్రతి ఒక్కడూ తన కంచర గాడిదపై ఎక్కి తప్పించుకు పోయాడు.
అమ్నోను మరణవార్తను దావీదు వినటం
30 రాజకుమారులంతా మార్గంమధ్యలో వుండగానే, ఈ వార్త దావీదుకు చేరింది. “అబ్షాలోము రాజ కుమారులందరినీ చంపివేశాడనీ, ఒక్కడు కూడా మిగల లేదనీ” ఆయనకు వర్తమానం వచ్చింది.
31 దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు.
32 దావీదు సోదరుడగు షిమ్యా కుమారుడు యెహోనాదాబు దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “రాజకుమారులంతా చనిపోయారని అనుకోవద్దు. చనిపోయినది అమ్నోను ఒక్కడు మాత్రమే! అబ్షాలోము ఇదంతా జరిపించాడు. 33 కారణమేమనగా అమ్నోను అబ్షాలోము చెల్లెలు తామారును చెరిచాడు. కాబట్టి అమ్నోను మాత్రము చంపబడ్డాడు.”
34 అబ్షాలోము పరారైనాడు.
నగర ప్రహరీ గోడమీద ఒక కావలివాడు నిలబడి వున్నాడు. కొండకు అవతలి ప్రక్కనుండి చాలా మంది రావటం చూశాడు. 35 అది చూసి యెహోనాదాబు దావీదు రాజుతో, “చూడండి, నేను చెప్పింది నిజమైనది. రాజ కుమారులంతా వస్తున్నారు!” అన్నాడు.
36 యెహోనాదాబు ఈ మాటలు అంటూ వుండగానే రాజకుమారులు వచ్చారు. వారు గగ్గోలు పడి ఏడుస్తూవున్నారు. దావీదు, అతని సేవకులందరూ కూడ విలపించసాగారు. వారంతా విపరీతంగా దుఃఖించారు. 37 దావీదు తన కుమారుడైన అమ్నోను కొరకు ప్రతి రోజూ దుఃఖించాడు.
అబ్షాలోము గెషూరుకు తప్పించుకు పోవటం
అబ్షాలోము తల్మయి రాజు[a] వద్దకు పారిపోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి పేరు అమీహూదు. 38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. 39 అమ్నోను మరణం గూర్చి దావీదురాజు క్రమేపీ ఓడార్చబడ్డాడు. కాని అతడు అబ్షాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడసాగాడు.
పౌలు ఎఫెసు పెద్దలతో మాట్లాడటం
17 పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.
18 వాళ్ళు వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. 19 యూదుల పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేసాను. 20 ఆత్మీయ విషయాల్లో మీకు ఉపయోగమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు. 21 మారుమనస్సు పొంది, దేవుని కోసం జీవించమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు, గ్రీకులకు చెప్పాను.
22 “పరిశుద్ధాత్మ చెప్పినట్లు చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. 23 నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. 24 నా జీవితాన్ని నేను లెక్కచెయ్యను. కాని ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం.
25 “మళ్ళీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. 26 అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. 27 ఎందుకంటే, నేను దేవుడు చెయ్యదలచినదాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. 28 పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 29 నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. 30 మీలోనుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు. 31 అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి.
32 “ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతే కాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించేటట్లు చేస్తుంది. 33 మీనుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించలేదు. 34 నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. 35 కష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ చేసాను. యేసు ప్రభువు, ‘తీసుకోవటంలో కన్నా యివ్వటంలో చాలా దీవెన ఉంది!’ అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేసాను.”
36 ఈ విధంగా చెప్పి, అతడు మోకాళ్ళూని అందరితో కలిసి ప్రార్థించాడు. 37 ఆ తర్వాత అందరూ కంటతడి పెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు. 38 “మిమ్మల్ని మళ్ళీ చూడటం వీలుపడదు” అని అతడన్న మాటలు వాళ్ళకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడవరకు వెళ్ళారు.
పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం
(మత్తయి 18:6-9; లూకా 17:1-2)
42 “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. 43 మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటివానిగా నిత్య జీవంపొందటం ఉత్తమం. 44 [a] 45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. 46-47 [b] పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. 48 అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు(A)
49 “ప్రతి వాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు.
50 “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”
© 1997 Bible League International