Book of Common Prayer
సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.
69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
నా నోటి వరకు నీళ్లు లేచాయి.
2 నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
3 సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
4 నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
5 దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
6 నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.
ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
7 నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
8 నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
9 నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
19 నా అవమానం నీకు తెలుసు.
నా శత్రువులు నన్ను అవమానపరిచారని నీకు తెలుసు.
వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
20 సిగ్గు నన్ను కృంగదీసింది.
అవమానం చేత నేను చావబోతున్నాను.
సానుభూతి కోసం నేను ఎదురు చూశాను.
కాని ఏమీ దొరకలేదు.
ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను.
కాని ఎవరూ రాలేదు.
21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.
ద్రాక్షారసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.
విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.
24 నీ కోపమును వారిపై కుమ్మరించుము.
నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము.
25 వారి కుటుంబాలు, ఇండ్లు
పూర్తిగా నాశనం చేయబడునుగాక.
26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు.
అప్పుడు బాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము.
నీవు ఎంత మంచివాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు.
28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము.
మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు.
29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను.
దేవా, నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.
30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36 ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.
మూడవ భాగం
(కీర్తనలు 73–89)
ఆసాపు స్తుతి కీర్తన.
73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
2 నేను దాదాపుగా జారిపోయి,
పాపం చేయటం మొదలు పెట్టాను.
3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
వారు జీవించుటకు శ్రమపడరు.[a]
5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
6 కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
7 ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
8 ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
9 ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”
12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
నీవు కనబడకుండా చేస్తావు.
21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
దేవుడు నా యెడల దయ చూపించాడు.
నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.
ఇశ్రాయేలీయులు దావీదును రాజు చేయటం
5 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం![a] 2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”
3 ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.
4 పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు. 5 హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.
దావీదు యెరూషలేమును జయించుట
6 రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులుదేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు.[b] ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు”[c] అని అన్నారు. 7 కాని దావీదు సీయోను కోటను[d] వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.
8 ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం[e] ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గ్రుడ్డివారు ఇంట్లోకి[f] రాలేరని” అంటారు.
9 దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో[g] నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు. 10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.
11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు. 12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.
థెస్సలొనీకలో
17 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. 2 అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. 3 క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. 4 తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.
5 ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. 6 వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. 7 వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.
8 ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. 9 ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.
బెరయలో
10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. 11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. 12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.
13 పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. 14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. 15 పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.
యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం
(మత్తయి 15:21-28)
24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు[a] ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. 25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది. 26 ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.
27 ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు”[b] అని అన్నాడు.
28 “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది.
29 అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు.
30 ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.
చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం
31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు. 32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు.
33 యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. 34 ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.) 35 వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.
36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు. 37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు.
© 1997 Bible League International