Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66-67

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

కీర్తనలు. 19

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
    యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
    ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
    మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
    వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.

అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
    తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
    ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
    మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
    దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.

యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
    అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
    జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
యెహోవా చట్టాలు సరియైనవి.
    అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
    ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

యెహోవాను ఆరాధించుట మంచిది.
    అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
    అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
    సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
    నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.

12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
    కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
    ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.

కీర్తనలు. 46

సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.

46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
    ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
అందుచేత భూమి కంపించినప్పుడు,
    మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
    భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.

ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
    మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
    సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
రాజ్యాలు భయంతో వణకుతాయి.
    యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
    ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
    సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.

10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
    రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
    భూమిమీద మహిమపర్చబడతాను.”

11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

2 సమూయేలు 13:1-22

అమ్నోను తామారును మోహించుట

13 దావీదుకు అబ్షాలోము అను కుమారుడొకడున్నాడు. అబ్షాలోముకు ఒక సోదరివుంది. ఆమె పేరు తామారు. ఆమె బహుసౌందర్యవతి. దావీదు యొక్క మరో కుమారుడైన అమ్నోను[a] తామారును మోహించాడు. తామారు కన్యక. అందువల్ల ఆమెను తన కామవంఛ తీర్చుకోవటానికి అమ్నోను ఆమెను ఏమీ చేయలేకపోయాడు. కాని అమ్నోను ఆమెను మిక్కిలిగా మోహించాడు. ఆమెను పొందలేక ఆమె ధ్యాసతో అమ్నోను విరక్తితో నీరసించిపోయాడు.

అమ్నోనుకు యెహోనాదాబు అనే స్నేహితుడొకడున్నాడు. అతడు షిమ్యా కుమారుడు. షిమ్యా దావీదు సోదరుడు. యెహోనాదాబు యుక్తిగల వాడు. యెహోనాదాబు అమ్నోనుతో, “రోజు రోజుకీ నీవు చిక్కిపోతున్నావు! నీవు రాజ కుమారుడవు! తినటానికి కావలసినంత ఉంది. కాని ఎందుకిలా చిక్కి శల్యమై పోతున్నావు? నాతో చెప్పు” అన్నాడు.

“నేను తామారును ప్రేమిస్తున్నాను. కాని ఆమె నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి” అన్నాడు అమ్నోను.

యెహోనాదాబు అమ్నోనుకు ఇలా సలహాయిచ్చాడు: “నీవు పోయి పడుకో, జబ్బు పడిన వానిలా నటించు. అప్పుడు నీ తండ్రి నిన్ను చూసేందుకు వస్తాడు. నీవాయనతో నీ చెల్లెలైన తామారును నీకు ఆహారాన్నిచ్చి సేవ చేయటానికి పంపమను. ఆమె నీ ఎదుట ఆహారం నీవు చూస్తూవుండగా తయారు చేసి ఆమె నీకు పెడుతుందని కూడా చెప్పు.”

ఆ సలహా మేరకు అమ్నోను పక్క మీద పడుకుని జబ్బు పడిన వానిలా నటించాడు. అమ్నోనును చూడటానికి దావీదు రాజు వచ్చాడు. “దయచేసి చెల్లెలు తామారును పంపించు. నేను చూస్తూవుండగా ఆమె రెండు ప్రత్యెకమైన రొట్టెలు చేసి పెడుతుంది. ఆమె చేతిమీదుగా తింటాను” అని దావీదుతో అమ్నోను చెప్పాడు.

దావీదు తామారు ఇంటికి దూతలను పంపాడు. వారు తామారుతో ఆమె సోదరుడు, “అమ్నోను ఇంటికి వెళ్లి అతనికి కొంత ఆహారం చేసిపెట్టమని చెప్పారు.”

తన సోదరుడైన అమ్నోను ఇంటికి తామారు వెళ్లింది. అమ్నోను మంచంపై ఉన్నాడు తామారు కొంత పిండి తీసుకొని, దానిని ఆమె స్వయంగా కలిపింది. అమ్నోను చూస్తూవుండగా ఆమె కొన్ని రొట్టెలు చేసింది. తరువాత ఆమె రొట్టెలను కాల్చింది. తామారు రొట్టెలను కాల్చిన పిమ్మట పెనంలో వాటిని తీసుకొని వెళ్లి అమ్నోను ముందు పళ్లెంలో వేసింది. కాని అమ్నోను తినటానికి అంగీకరించలేదు. అమ్నోను తన సేవకులందరినీ, “అతనిని ఒంటరిగా వదిలి వెళ్లి పొమ్మన్నాడు” అమ్నోను గదినుండి సేవకులంతా బయటికి పోయారు.

అమ్నోను తామారును చెరచుట

10 అమ్నోను తామారుతో, “రొట్టెలను లోపలి గది లోనికి తీసుకొనిరా. అప్పుడు నీ చేతిమీదుగా వాటిని తింటాను” అని అన్నాడు.

తామారు లోపలి గదిలో వున్న తన సోదరుడైన అమ్నోను వద్దకు వెళ్లింది. ఆమె చేసిన రొట్టెలను తీసుకొని వెళ్లింది. 11 తన చేతుల మీదుగా తింటాడని ఆమె అమ్మోను వద్దకు వెళ్లింది. కాని అమ్నోను తామారును పట్టుకున్నాడు. “చెల్లీ, రా! నాతో కలిసి పడుకో!” అని అన్నాడు.

12 అందుకు తామారు అమ్నెనుతో ఇలా ప్రాధేయపడింది: “వద్దు, సోదరా! నన్ను బలవంతం చేయకు! ఇశ్రాయేలులో ఇలా ఎన్నటికీ జరుగకూడదు! ఈ అవమానకరమైన పని చేయకు! 13 నా కళంకాన్ని నేనెన్నడూ మాపుకోలేను. ఇశ్రాయేలీయులలో నీచకార్యాలు చేసే మూర్ఖులలో నీవొకడివై పోతావు. దయచేసి రాజుతో మాట్లాడు. నన్ను వివాహం చేసికోటానికి ఆయన నీకు అనుమతిస్తాడు.”

14 కాని అమ్నోను తామారు చెప్పే దానిని వినటానికి నిరాకరించాడు. అతడు తామారుకంటె బలవంతుడు. అతడామెను బలాత్కరించి సంగమించాడు. 15 దాని తరువాత అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. ముందు అతనామెనెంతగా ప్రేమించాడో, అంతకు మించి ఇప్పుడు అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. అమ్నోను తామారుతో, “మంచం మీది నుంచి లేచి బయటికి పొమ్మన్నాడు.”

16 అందుకు తామారు అమ్నోనుతో, “కాదు! నీవిప్పుడు మునుపటికంటె ఇంకా ఘోరమైన తప్పు చేస్తున్నావు. నీవు నన్ను పంపివేయటానికి ప్రయత్నిస్తున్నావు!” అనిఅన్నది.

కాని అమ్నోను తామారు చెప్పేది వినలేదు. 17 అమ్నోను తన సేవకుణ్ణి లోనికి పిలిచి, “ఇప్పుడే ఈ పిల్లను గదినుండి బయటికి పంపించు! బయటకు నెట్టి తలుపుకు తాళం వేయి” అని చెప్పాడు.

18 అమ్నోను సేవకుడు తామారును బయటికి గెంటి గదికి తాళం పెట్టాడు.

తామారు ఒక రంగురంగుల పొడవైన చేతులు, చాలా వదులుగా వుండే అంగీని వేసుకున్నది. ఆ రకమైన అంగీలను పెండ్లికాని రాజ కుమార్తెలు మాత్రమే వేసుకునేవారు. 19 తామారు కొద్దిగా బూడిద తీసుకొని తన నెత్తి మీద పోసుకున్నది. తన రంగురంగుల అంగీని చింపుకొన్నది. తన చేయి నెత్తిమీద పెట్టుకుని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోయింది.[b]

20 తామారు సోదరుడు అబ్షాలోము తామారుతో, “నీ సోదరుడు అమ్నోను నిన్ను చెరిచినాడుగా?”[c] అన్నాడు. “అమ్నోను నీ సోదరుడు. కావున చెల్లీ, ప్రస్తుతానికి నీవు మాట్లాడక వుండు. ఇది నిన్ను విపరీతంగా సంక్షోభపెట్టకుండా[d] చూసుకో!” అది విన్న తామారు ఇక ఏమీ మట్లాడ లేదు. నాశనమైన స్త్రీలా, అమె అబ్షాలోము ఇంటి వద్దనే ఉండసాగింది.

21 ఈ వార్త దావీదు రాజు విన్నాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. 22 అబ్షాలోము అమ్నోనును అసహ్యించుకున్నాడు. అబ్షాలోము అమ్నోను నుద్దేశించి మంచిగా గాని, చెడ్డగా గాని ఏమీ అనలేదు. తన సోదరి తామారును చెరచినందుకు అమ్నోనును అసహ్యించుకున్నాడు.

రోమీయులకు 15:1-13

15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)

10 మరొక చోట:

“యూదులు కాని ప్రజలారా!
    మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)

11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:

“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
    ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)

12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:

“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
    ఆయన దేశాలను పాలిస్తాడు.
    యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)

13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.

యోహాను 3:22-36

యోహాను చెప్పిన సందేశం

22 ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు. 23 అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. 24 ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన.

25 పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది. 26 వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.

27 యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు. 28 నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం. 29 పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది. 30 ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.

పరలోకమునుండి వచ్చువాడు

31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు. 33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. 36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International