Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

కీర్తనలు. 77

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.

77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
    దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
    రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
    నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
    నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
నీవు నన్ను నిద్రపోనియ్యవు.
    నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
    చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
    నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
“మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
    ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
    ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
    ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.

10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
    అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.

11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
    ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
    దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
    నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
    యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
    లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
    ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
    అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
    మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
    భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
    కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
    మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

కీర్తనలు. 79

ఆసాపు స్తుతి కీర్తన.

79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
    ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
    యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
    అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
    మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
    మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
    బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
    నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
    వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
    త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
    నీవు మాకు ఎంతో అవసరం.
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
    నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
    నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
    అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
    నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
    దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
    ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
    మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
    దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.

1 సమూయేలు 1:1-20

ఎల్కానా కుటుంబము షిలోహులో ఆరాధించుట

ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల దేశమైన ఎఫ్రాయిములోని రామతయి మ్సోఫీము పట్టణవాసి. ఎల్కానా సూపు వంశస్థుడు. అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమారుడు. ఎలీహు తండ్రి తోహు. తోహు ఎఫ్రాయిము వంశపువాడైన సూపు కుమారుడు.

ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతానవతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు.

ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మ్సోఫీమునుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించేవాడు. అక్కడ అతను బలులు కూడ అర్పించేవాడు. షిలోహులో హొఫ్నీ, మరియు ఫీనెహాసు అనే వారిరువురు యెహోవా యాజకులుగా ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని కుమారులు. ప్రతిసారీ బలిఅర్పణలో ఒక భాగం ఎల్కానా తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు. ఆమె కుమారులకు కూడా భాగాలు ఇచ్చేవాడు. యెహోవా హన్నాను గొడ్రాలుగా చేసినప్పటికీ, ఎల్కానా మాత్రం ఆమెను బాగా ప్రేమించేవాడు గనుక ఆమెకు కూడ ఎల్లప్పుడు అర్పణలో సమానభాగం ఇచ్చేవాడు.

పెనిన్నా హన్నాను కలవర పెట్టుట

పెనిన్నా అదేపనిగా హన్నాను పీడిస్తూ ఆమె మనస్సుకు ఎంతో బాధ కలిగించేది. అందుకు కారణం దేవుడు ఆమెను గొడ్రాలుగా చేయటమే. ప్రతి ఏటా ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ హన్నాను పెనిన్నా కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్పించుచుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయలేదు. ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నావనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటె నేను నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు.

హన్నా ప్రార్థన

హన్నా అన్న పానాలు పుచ్చుకొన్న తర్వాత, యెహోవాను ప్రార్థించటానికి వెళ్లింది. యెహోవా పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ ఆసీనుడైవున్నాడు. 10 హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది. 11 ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది[a] వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు”[b] అని కోరుకున్నది.

12 ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. 13 హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు. 14 “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు.

15 “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను. 16 నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది.

17 అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు.

18 “నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు.

19 మరునాటి తెల్లవారు ఝామునే ఎల్కానా కుటుంబ సభ్యులంతా లేచి దేవుని ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి వెళ్లిపోయారు.

సమూయేలు జననం

ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు. హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. 20 మరు సంవత్సరం సమయానికి హన్నా గర్భవతియై, ఒక కుమారుని కని తన కుమారునికి సమూయేలు[c] అని పేరు పెట్టింది. “వీనిపేరు సమూయేలు. ఎందుకంటే వీని కొరకు నేను యెహోవాని ప్రార్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు” అని అన్నది హన్న.

అపొస్తలుల కార్యములు 1:1-14

యెరూషలేములో సమావేశం

ప్రియమైన థెయొఫిలాకు,

నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాసాను. ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకొన్న అపొస్తలులకు[a] వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను. యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”

యేసు పరలోకానికి వెళ్ళటం

వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా?” అని యేసును అడిగారు.

ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని తెలుసుకొనే అవసరం మీకు లేదు. కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.

ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. 10 ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో, 11 “గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీనుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు” అని అన్నారు.

మత్తీయని ఎన్నుకోవటం

12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.[b] 13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, “జెలోతే”[c] అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.

14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండేవాళ్ళు.

లూకా 20:9-19

రైతుల ఉపమానం

(మత్తయి 21:33-46; మార్కు 12:1-12)

ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: “ఒకడు ఒక ద్రాక్షాతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి పోయ్యాడు. 10 పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు. 11 ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్తో పంపారు. 12 అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తీవ్రంగా గాయపరచి తరిమి వేసారు.

13 “ఆ ద్రాక్షాతోట యజమాని, ‘నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కొడుకుని పంపుతాను. బహుశా వాళ్ళతణ్ణి గౌరవించవచ్చు’ అని అనుకున్నాడు. 14 కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు. 15 అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు.

“ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు? 16 వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షాతోట యింకొకరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు.

ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగకూడదు” అని అన్నారు. 17 యేసు వాళ్ళవైపు సూటిగా చూసి, “మరి అలాగైతే లేఖనాల్లో వ్రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి:

‘పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది’?(A)

18 ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలిగిపోతారు” అని అన్నాడు.

19 శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International