Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 40

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
    నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
    ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
    ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
    యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
    వారు యెహోవాను నమ్ముకొంటారు.
ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
    ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
    ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
    మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
    నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

కీర్తనలు. 54

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

ద్వితీయోపదేశకాండము 26:1-11

ప్రథమ పంట

26 “మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పరచుకొన్నప్పుడు మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసుకొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్లండి. అది యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొనే స్థలం. అప్పటికి అక్కడ పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. ‘యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా దేవుడైన యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను’ అని నీవు ఆతనితో చెప్పాలి.

“అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని క్రింద ఉంచుతాడు. అప్పుడు అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా చెప్పాలి: ‘నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. అతడు ఈజిప్టులోనికి వెళ్లి, అక్కడ నివసించాడు. అతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఈజిప్టులో అతడు అనేకమంది ప్రజలుగా, శక్తివంతమైన ఒక గొప్ప జనంగా తయారయ్యాడు. ఈజిప్టువాళ్లు మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, బానిస పని బలవంతంగా మాతో చేయించారు. అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. యెహోవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు. అప్పుడు యెహోవా తన మహా శక్తి, ప్రభావాలతో ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గొప్ప అద్భుతాలు, మహాత్యాలు ఆయన చేశాడు. భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన చేసాడు. కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసుకొనివచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించుచున్న ఈ మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు. 10 ఇప్పుడు యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ పంటను నీకు తెచ్చాను.’

“తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా ఎదుట క్రింద పెట్టాలి. మరియు మీరు ఆయనను ఆరాధించాలి. 11 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాలన్నింటినీ మీరు తిని ఆనందించవచ్చును. మీ మధ్య నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని పంచుకోవాలి.

2 కొరింథీయులకు 8:16-24

తీతును కొరింథుకు పంపటం

16 మీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 17 తీతు మా నివేదన అంగీకరించాడు. అంతేకాక, చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. 18 అతని వెంట యింకొక సోదరుణ్ణి పంపుతున్నాము. ఈ సోదరుడు సువార్త ప్రకటించి చేసిన సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి. 19 పైగా, అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్ళాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం.

20 ఈ గొప్ప విరాళాలు విమర్శకు గురి కాకుండా జాగ్రత్తగా యిస్తాము. 21 ప్రభువు దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము.

22 అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్ళతో పంపుతున్నాము. ఇతన్ని మేము చాలా సార్లు పరీక్షించాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో ఉన్నట్లు గ్రహించాము. ఇక అతనికి మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండటంవల్ల అతని ఉత్సాహం ఇంకా ఎక్కువైంది.

23 ఇక తీతు విషయమా! అతడు నేను మీకోసం చేస్తున్న సేవలో భాగస్థుడు. నాతో కలిసి పని చేసేవాడు. ఇక మేము పంపిన సోదరులు, సంఘాల ప్రతినిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించేవాళ్ళు. 24 అందువల్ల, మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్ళకు రుజువు చెయ్యండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి.

లూకా 18:9-14

పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు

తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’

13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International