Book of Common Prayer
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
వారు నిన్నే నడిపించ నిస్తారు.
6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
16 మనం ఈజిప్టు దేశంలో ఎలా జీవించామో మీకు జ్ఞాపకమే. ఇక్కడికి వచ్చే మార్గంలో ఉన్న దేశాల్లోంచి మనం ఎలా ప్రయాణం చేసామో అదీ మీకు జ్ఞాపకమే. 17 చెక్క, రాయి, వెండి, బంగారంతో వారు చేసిన అసహ్యమైన విగ్రహాలను మీరు చూసారు. 18 ఈ వేళ ఇక్కడ ఉన్న పురుషుడుగాని, స్త్రీగాని, కుటుంబంగాని, వంశం గాని మీ దేవుడైన యెహోవా నుండి తిరిగిపోకుండా గట్టి జాగ్రత్తలో ఉండండి. ఏ వ్యక్తి కూడా పోయి ఆ రాజ్యల దేవుళ్లను సేవించకూడదు. అలా చేసేవాళ్లు చేదైన విష ఫలాలు ఫలించే మొక్కల్లా ఉంటారు.
19 “ఒక వ్యక్తి ఈ శాపాలన్నీ విని, ‘నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూనే ఉంటాను. నాకేమీ కీడు సంభవించదు’ అంటూ తనను తాను ఆదరించుకో వచ్చును. ఆ వ్యక్తి తనకు మాత్రమేగాక ప్రతి ఒక్కరికీ చివరకు మంచి వాళ్లకుకూడ కీడు జరిగిస్తాడు. 20-21 ఆ వ్యక్తిని యోహోవ క్షమించడు. మరియు, ఆ వ్యక్తిమీద యెహోవాకు కోపం వస్తుంది, యెహోవా ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ యెహోవా అతణ్ణి వేరు చేసేస్తాడు. యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విషయాలన్నీ ఒక భాగం:
22 “భవిష్యత్తులో మీ సంతానంవారు, దూరదేశాల్లోని విదేశీయులు మీ దేశం ఎలా పాడైపోయిందో చూస్తారు. యెహోవా దాని మీదికి రప్పించిన రోగాలను వారు చూస్తారు. 23 దేశం అంతా మండే గంధకం, ఉప్పుతో నిష్ప్రయోజనంగా ఉంటుంది. దేశంలో ఏమీ నాట బడదు ఏవీ, చివరకు గురుగులుకూడ పెరగవు. యెహోవా చాలా కోపగించినప్పుడు నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, జెబోయిం పట్టణాల్లా ఈ దేశం ఉంటుంది.
24 “‘యెహోవా ఈ దేశానికి ఎందుకు ఇలా చేసాడు? ఆయనకు ఎందుకు ఇంతకోపం వచ్చింది?’ అని ఇతర రాజ్యాలన్నీ అడుగుతాయి. 25 జవాబు ఇదే: ‘ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా ఒడంబడికను విడిచిపెట్టేసారు గనుక యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా వారిని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చినప్పుడు ఆయన వారితో చేసిన ఒడంబడికను పాటించటం వాళ్లు మానివేసారు. 26 ఇశ్రాయేలు ప్రజలు ఇదివరకు ఎన్నడూ ఆరాధించని ఇతర దేవుళ్లను ఆరాధించటం మొదలు పెట్టారు. ఆ దేవుళ్లను పూజించ వద్దని యెహోవా ఆ ప్రజలతో చెప్పాడు. 27 అందువల్లనే ఈ దేశ ప్రజల మీద యెహోవాకు అంతగా కోపం వచ్చింది. అందుచేత ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ ఆయన వారి మీదికి రప్పించాడు. 28 యెహోవా వారి మీద చాలా కోపగించాడు. కనుక ఆయన వాళ్లను వారి దేశంనుండి బయటకు లాగేసాడు. ఈనాడు వారు ఉన్న మరో దేశంలో ఆయన వాళ్లను ఉంచాడు.’
29 “మన దేవుడైన యెహోవా రహస్యంగా ఉంచిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఆ సంగతులు ఆయనకు మాత్రమే తెలుసు. ఆయితే యెహోవా తన ధర్మశాస్త్రాన్ని మాత్రం మనల్ని తెలసుకోనిచ్చాడు. ఆ ధర్మశాస్త్రం మనకోసం, మన సంతతివారికోసం. మనం దానికి శాశ్వతంగా విధేయులం కావాలి.
స్త్రీ, ఘటసర్పం
12 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. 2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. 6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. 8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు. 12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సాతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
యేసు అనేకులను నయం చేయటం
29 యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.
30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. 31 మూగ వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు నయమైపోయింది. కుంటి వాళ్ళు నడిచారు. గ్రుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు.
యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మార్కు 8:1-10)
32 యేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళపట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్ఛ పడిపోతారు” అని అన్నాడు.
33 ఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు.
34 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” యేసు అడిగాడు.
“ఏడు రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
35 యేసు ప్రజల్ని కూర్చోమన్నాడు. 36 ఆ తర్వాత ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు. 37 అందరూ సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు. 38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. 39 యేసు ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి వెళ్ళాడు.
© 1997 Bible League International