Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 45

సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.

45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
    అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
    నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.

నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
    నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
    కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
    అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
    అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
    నీ నీతి రాజదండము.
నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
    కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
    నీ దేవుడు కోరుకొన్నాడు.
నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
    నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
    నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.

10 కుమారీ, నా మాట వినుము.
    నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11     రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
    నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
    వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.

13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
    ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
    ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
    సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.

16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
    దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
    శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

కీర్తనలు. 47-48

సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.

47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
    సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
    భూలోకమంతటికీ ఆయన రాజు.
ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
    ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
    యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.

బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
    యెహోవా దేవుడు లేచాడు.
దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
    మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
దేవుడు సర్వలోకానికి రాజు.
    స్తుతిగీతాలు పాడండి.
దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
    దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
    దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
    దేవుడు మహోన్నతుడు.

కోరహు కుమారుల స్తుతి పాట.

48 యెహోవా గొప్పవాడు.
    మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
    అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
    అది మహారాజు పట్టణం.
ఇక్కడ ఆ పట్టణంలోని
    భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
    వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
    ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
    వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
    ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
దేవా, బలమైన తూర్పుగాలితో
    తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
    మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.

దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
    భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
    మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
    ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
    సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
    ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.

ద్వితీయోపదేశకాండము 12:1-12

దేవుణ్ణి ఆరాధించేందుకు స్థలం

12 “కొత్త దేశంలో మీరు మీ జీవితకాలమంతా పాటించేందుకు జాగ్రత్త పడాల్సిన ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వారి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి. వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి.

“కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. మీ దేవుడైన యెహోవా తన ఆలయం కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణయిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచుతాడు. అది ఆయన ఆలయం. ఆయనను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్లాలి మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం[a] మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి. మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమై అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు కష్టపడిన వాటి ఫలాలను భుజిస్తారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటిని మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు.

“ఆ సమయంలో మనం ఇంతవరకు ఆరాధిస్తున్న విధానాన్ని మీరు కొనసాగించకూడదు. ఇంతవరకు మనకు యిష్టం వచ్చిన ఏ పద్ధతిలోనైనా దేవుణ్ణి మనం ఆరాధించాం. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న శాంతియుతమైన దేశంలో మనం యింకా ప్రవేశించలేదు గనుక. 10 ఆయితే మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. మరియు మీరు క్షేమంగా జీవిస్తారు. 11 అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి. 12 మీ పిల్లలు, మీ పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు మీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి రండి. (ఆ లేవీయులకు దేశంలో వారి స్వంత భాగం ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలిసి సంతోషంగా సమయం గడపండి.

2 కొరింథీయులకు 6:3-7:1

మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగించము. దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పని చేసినప్పుడు, నిష్కల్మషంగా ఉండటంలో, యితర్లను అర్థం చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో, సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విషయంలో, కుడి ఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల విషయంలో, కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, మోసగాళ్ళన్నా, మేము తెలిసినా మమ్మల్ని తెలియనివాళ్ళుగా చూసినప్పుడు, చనిపోవుచున్నను చనిపోనివారిగా ఉన్నప్పుడు, కొట్టబడినా చంపబడకుండా ఉన్నప్పుడు, 10 దుఃఖంతో ఉన్నా ఆనందంగా ఉన్నప్పుడు, దరిద్రులమైనా యితరులను ధనవంతులుగా చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన్నట్టుగా ఉన్నప్పుడు మేము దేవుని సేవకులంగా రుజువు చేసుకొంటున్నాం.

11 కొరింథులోని ప్రజలారా! మేము మీతో దాచకుండా మాట్లాడి మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించాము. 12 మేము మా ప్రేమ దాచకుండా మీకు చూపాము. కాని మీరు మీ ప్రేమ మాకివ్వకుండా దాస్తున్నారు. 13 నేను మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి మాట్లాడుతున్నాను. మేము మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించినట్లే, మమ్మల్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి.

అవిశ్వాసులతో కలిసిపోకండి

14 అవిశ్వాసులతో అంటిపెట్టుకోకండి. నీతికి, దుర్మార్గతకు పొత్తు ఏ విధంగా కుదురుతుంది? వెలుగుకూ, చీకటికి ఏమి సహవాసము? 15 క్రీస్తుకు, బెలియాలుకు మధ్య సంబంధము ఎలా ఉంటుంది? విశ్వాసం ఉన్నవానికి, విశ్వాసం లేనివానికి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? 16 దేవుని ఆలయానికి, విగ్రహాలకు ఒడంబడిక ఎలా ఉంటుంది? మనం జీవంతో ఉన్న దేవునికి ఆలయంగా ఉన్నాము. దేవుడు ఈ విధంగా అన్నాడు:

“నేను వాళ్ళ మధ్య నడుస్తూ వాళ్ళతో జీవిస్తాను. వాళ్ళు నా ప్రజగా,
నేను వాళ్ళ దేవునిగా ఉంటాము.”(A)

17 “కాబట్టి వాళ్ళను వదిలి వేరుగా ఉండండి.
అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిన్ను స్వీకరిస్తాను
    అని ప్రభువు అన్నాడు.”(B)

18 “నేను మీకు తండ్రిగా ఉంటాను.
    మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తిసంపన్నుడైన ప్రభువు అంటున్నాడు.”(C)

మిత్రులారా! మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. కనుక మన దేహాలకు, మన ఆత్మలకు కలిగిన మలినాన్ని కడిగి పరిశుద్ధమౌదాం. మనకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక పరిపూర్ణత పొందటానికి ప్రయత్నం చేద్దాం.

లూకా 17:11-19

పదిమంది కుష్టురోగులకు నయం చెయ్యటం

11 యేసు యెరూషలేముకు ప్రయాణం సాగిస్తూ గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు. 12 ఒక గ్రామంలోకి వెళ్తూండగా పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని, 13 “యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు.

14 ఆయన వాళ్ళను చూసి, “వెళ్ళి యాజకులకు చూపండి” అని అన్నాడు.

వాళ్ళు వెళ్తూంటే వాళ్ళకు నయమైపోయింది. 15 వాళ్ళలో ఒకడు తనకు నయమవటం గమనించి, గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ వెనక్కు వెళ్ళాడు. 16 యేసు ముందు మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకున్నాడు. అతడు సమరయ వాడు. 17 యేసు, “పది మందికి నయమైంది కదా! మిగతా తొమ్మిది మంది ఏరి? 18 ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?” అని అన్నాడు. 19 ఆ తర్వాత అతనితో, “లేచి వెళ్ళు, నీ విశ్వాసమే నీకు నయం చేసింది” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International