Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 55

సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.

55 దేవా, నా ప్రార్థన వినుము.
    దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
    నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
    నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
    వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
నాలో నా గుండె అదురుతోంది.
    నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
నాకు భయము మరియు వణకుగా ఉంది.
    నేను భయపడిపోయాను.
ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
    నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
    నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.

నేను పరుగెత్తి పోదును.
    నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
    ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
    ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
    ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
    దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
    నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
    నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
    దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.

15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
    వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
    ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.

16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.
    యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను.
    ఆయన నా మాట వింటాడు.
18 నేను చాలా యుద్ధాలు చేశాను.
    కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
19 దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు.
    నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.

నా శత్రువులు వారి బ్రతుకులు మార్చుకోరు.
    వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.
    అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.
    కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు.
వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి
    కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.

22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు
    ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు.
    మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23 కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు.
    రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు.
కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.

కీర్తనలు. 138:1-139:23

దావీదు కీర్తన.

138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
    దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
    నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.

యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
    నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా మహిమ గొప్పది.
దేవుడు గొప్పవాడు.
    అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
    కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
    నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
    యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.
నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
    యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
    పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
    పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
    ఆ చేతితో నన్ను నడిపిస్తావు.

11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
    “పగలు రాత్రిగా మారిపోయింది.
    తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
    రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
    నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
    నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
    నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
    ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
    నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
    కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.

19 దేవా, దుర్మార్గులను చంపివేయుము.
ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.
20     ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు.
    వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను.
    నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.
22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను!
    నీ శత్రువులు నాకూ శత్రువులే.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
    నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.

ద్వితీయోపదేశకాండము 29:2-15

మోషే ఇశ్రాయేలు ప్రజలందిర్నీ సమావేశపర్చాడు. అతను వాళ్లతో ఇలా చేప్పాడు: “ఈజిప్టు దేశంలో యెహోవా చేసిన వాటన్నింటినీ మీరు చూసారు. ఫరోకు, ఫరో నాయకులకు, అతని దేశం అంతటికీ యెహోవా చేసిన వాటిని మీరు చూసారు. ఆయన వాళ్లకు కలిగించన గొప్ప కష్టాలు అన్నీ మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు మీరు చూసారు. కానీ జరిగిందేమిటో ఈ రోజూకూ మీకు అర్థంకాలేదు. మీరు చూసిన దానిని, విన్నదానిని యెహోవా మీకు అర్థం కానివ్వలేదు. 40 సంవత్సరాలు యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించాడు. ఆ కాలం అంతటిలో మీ బట్టలు పాతబడలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు. మీ వద్ద భోజనం ఏమీలేదు. ద్రాక్షారసంగాని తాగేందుకు మరేదీగాని మీ దగ్గరలేదు. కానీ మీ విషయంలో యెహోవా శ్రద్ధతీసుకొన్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవా అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన ఇలా చేసాడు.

“మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు, హెష్భోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మన మీద యుద్ధానికి వచ్చారు. కానీ మనం వాళ్లను ఓడించాం. అప్పుడు వారి దేశాన్ని మనం స్వాధీనం చేసుకొని, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారికి స్వంతంగా ఇచ్చాము. కనుక ఈ ఒడంబడికలోని ఆదేశాలకు పూర్తిగా లోబడుతుంటే మీరు చేసే ప్రతి దానిలో మీరు విజయం పొందుతూ ఉంటారు.

10 “ఈ వేళ మీరంతా ఇక్కడ మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. మీ నాయకులు, మీ అధికారులు, మీ పెద్దలు, మిగిలిన మనుష్యులంతా ఇక్కడ ఉన్నారు. 11 మీ భార్యలు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీ మధ్య నివసిస్తూ, మీ కట్టెలు కొట్టి, మీకు నీళ్లు మోసే విదేశీయులు కూడా ఇక్కడ ఉన్నారు. 12 మీరంతా మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకొనేందుకు ఇక్కడ ఉన్నారు. యెహోవా నేడు మీతో ఈ ఒడంబడిక చేస్తున్నాడు. 13 ఈ ఒడంబడిక మూలంగా యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటున్నాడు. మరియు సాక్షాత్తూ ఆయనే మీకు దేవుడుగా ఉంటాడు. ఇది ఆయన మీతో చెప్పాడు. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన దీనిని వాగ్దానం చేశాడు. 14 యెహోవా ఈ వాగ్దానాలన్నింటితో కూడిన ఈ ఒడంబడికను మీతో మాత్రమే చేయటం లేదు. 15 ఈ వేళ ఇక్కడ మన దేవుడైన యెహోవా యెదుట నిలిచిన మనందరితో ఆయన ఈ ఒడంబడిక చేస్తున్నాడు. అయితే ఈనాడు ఇక్కడ మనతో లేని మన సంతానానికి కూడ ఈ ఒడంబడిక వర్తిస్తుంది.

2 కొరింథీయులకు 9

మీ ఇచ్చుబడి ఆశీర్వాదం

భక్తులకు చేయవలసిన సహాయాన్ని గురించి నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు. సహాయం చెయ్యాలనే ఉత్సాహం మీలో ఉన్నట్లు నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు, పోయిన సంవత్సరం నుండి యివ్వటానికి సిద్ధంగా ఉన్నారని మాసిదోనియ ప్రజలకు నేను గర్వంగా చెప్పాను. మీ ఉత్సాహం వాళ్ళలో చాలా మందిని ప్రోత్సాహపరిచింది. వాళ్ళు కార్యనిర్వహణకు పూనుకొన్నారు. ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పొగుడుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా ఉద్ధేశ్యం. మీరు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. కనుక సోదరుల్ని పంపుతున్నాను. ఒకవేళ మాసిదోనియవాళ్ళు నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకొంటే, మీకే కాక, మీపై యింత నమ్మకం ఉన్న మాకు కూడా అవమానం కలుగుతుంది. కనుక సోదరుల్ని ముందే మీ దగ్గరకు పంపటం అవసరం అనిపించింది. వాళ్ళు వచ్చి మీరు ధారాళంగా వాగ్దానం చేసిన విరాళాన్ని ప్రోగుచేస్తారు. అలా చేస్తే మేము వచ్చినప్పుడు ఆ కానుక సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ కానుక అయిష్టంగా కాక, ఆనందంగా యిచ్చినట్లు అందరికీ తెలుస్తుంది.

కొంచెముగా విత్తేవాడు కొద్దిపంటను మాత్రమే పొందుతాడు. అదే విధంగా ఎక్కువగా విత్తేవానికి పంటకూడా ఎక్కువగా లభిస్తుంది. మీరిది జ్ఞాపకం ఉంచుకొండి. ఆనందంగా యిచ్చేవాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రతి ఒక్కడూ గొణుక్కోకుండా యివ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను స్వయంగా నిర్ణయించుకొని యివ్వాలి. అప్పుడు దేవుడు మీకవసరమున్నదాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాసారు:

“అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు
    అతని నీతి చిరకాలం ఉంటుంది.”(A)

10 రైతుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు. 11 మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండేటట్లు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మాద్వారా మీరిచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవునికి కృతజ్ఞతలు చెపుతారు.

12 మీరు చేసిన సహాయం విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాక, వాళ్ళు దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్లు చేస్తుంది. 13 మీరు ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను అంగీకరించారు. దాన్ని విధేయతతో పాటించారు. మీకున్నదాన్ని వాళ్ళతో మాత్రమే కాక, అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. 14 దేవుడు మీపై యింత కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు. 15 దేవుడు యిచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము.

లూకా 18:15-30

యేసు చిన్నపిల్లల్ని దీవించటం

(మత్తయి 19:13-15; మార్కు 10:13-16)

15 యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు. 16 కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే. 17 యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మత్తయి 19:16-30; మార్కు 10:17-31)

18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. 20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.

21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.

22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.

24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

ఎవరు రక్షింపబడగలరు

26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.

27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.

28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. 30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International