Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:97-120

మేమ్

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
    దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
    జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
    ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
    కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
    ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
    కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
    అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.

నూన్

105 యెహోవా, నీ వాక్యాలు
    నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
    నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
    దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
    కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
    కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
    అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
    నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

కీర్తనలు. 81-82

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆసాపు స్తుతి కీర్తన.

82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
    ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
    దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.

“అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
    న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
    దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.

“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
    వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
    వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
నేను (దేవుడు) మీతో చెప్పాను,
    “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
    ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”

దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
    దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.

1 సమూయేలు 2:12-26

ఏలీ దుష్ట సంతానం-హొఫ్నీ, ఫీనెహాసు

12 ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు. 13 యాజకులు ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చినప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి ఇచ్చిన ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు మూడు మొనలు గల ఒక కొంకి గరిటెతో రావాలి. 14 యాజకుని సేవకుడు గరిటెను ఉడుకుతోన్న బాణలిలో గుచ్చి తీయాలి. అప్పుడా గరిటె కొనలకు పట్టుకొని ఎంత మాంసం వస్తుందో అది మాత్రం యాజకునికి చెందుతుంది. బలులు ఇవ్వటానికి షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు చేయవలసిన విధి ఇదే. 15 కాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని వంటకానికై కొంత మాంసం ఇవ్వమనీ, ఉడుకబెట్టిన మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు.”

16 అయితే బలి ఇచ్చే వ్యక్తి గనుక కొవ్వును యధావిధిగా, “ముందు దహించిన తరువాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోమని” అంటే యాజకుని సేవకుడు ఒప్పుకొనేవాడు కాదు. “అలా కాదు, ముందుగా మాంసం ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోతే, బలవంతాన తీసుకోవలసి వస్తుంది!” అని బదులు చెప్పేవాడు.

17 ఈ విధంగా, యెహోవాకు అర్పించబడిన అర్పణలను వారు లక్ష్యపెట్టలేదని హొఫ్నీ, ఫీనెహాసులు వ్యక్తం చేసారు. ఇది చాలా చెడ్డపాపం.

18 కానీ సమూయేలు యెహోవాను సేవించాడు. సమూయేలు ఏఫోదు[a] ధరించిన ఒక బాల సహాయకుడు. 19 ప్రతి సంవత్సరం సమూయేలు తల్లి అతనికై ఒక చిన్న అంగీ తయారుచేసి, తన భర్తతో షిలోహుకు బలి అర్పించేందుకు వెళ్లినపుడు ఆ అంగీని సమూయేలు కొరకు తీసుకొని వెళ్లేది.

20 ఎల్కానాను, అతని భార్యను ఏలీ ఆశీర్వదించేవాడు: “హన్నా ప్రార్థన ఫలితంగా పుట్టిన వానిని మరల యెహోవా సేవకై ఇచ్చారు గనుక అతని స్థానాన్ని భర్తీ చేసే విధంగా హన్నాద్వారా యెహోవా మీకు పిల్లలను కలుగజేయుగాక.”

తర్వాత ఎల్కానా, హన్నా ఇంటికి వెళ్లిపోయారు. 21 దేవుని అనుగ్రహం వల్ల హన్నాకు క్రమేపీ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బాలకుడైన సమూయేలు యెహోవా ఆలయములో దినదినము మంచి స్థితికి ఎదుగు చుండెను.

కుమారుల విషయంలో ఏలీ అసమర్థత

22 ఏలీ చాలా వృద్ధుడై పోయాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే వున్నాడు. పైగా సన్నిధి గుడారపు ద్వారం వద్ద పరిచర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు శయనిస్తున్నారని కూడా ఏలీ విన్నాడు.

23 ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యాలను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెందుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు? 24 నా కుమారులారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. 25 ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యెహోవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు.

అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు.

26 బాలుడైన సమూయేలు మాత్రం దేవుని దయయందును, మనుష్యుల దయయందును పెరుగుతూ వచ్చాడు.

అపొస్తలుల కార్యములు 2:1-21

పవిత్రాత్మ రావటం

పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు. తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది. అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి. అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.

అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు. ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు.

వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా? అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? మేము, అంటే ‘పార్తీయ’ దేశంవాళ్ళు, ‘మాదీయ’ దేశంవాళ్ళు, ‘ఏలామీ’ దేశంవాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు, 10 ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్టు ప్రాంతాలవాళ్ళు, ‘లిబియ’లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాలనుండి వచ్చినవాళ్ళు, రోమా నగరంనుండి వచ్చినవాళ్ళు, 11 యూదులు, యూద మతంలో చేరినవాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.

12 దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు. 13 “బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు” అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు.

పేతురు ఉపన్యసించటం

14 ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 15 మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా! 16 దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి:

17 ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు:
ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను!
    మీ కుమారులు, కుమార్తెలు నా ప్రవచనాలు పలుకుతారు!
    మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది.
    వయస్సు మళ్ళిన మీవాళ్ళు కలలుగంటారు.
18 ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను.
    అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు.
19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను.
    క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను.
    రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.
20 సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను.
    చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను.
ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది.
21 అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’(A)

లూకా 20:27-40

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; మార్కు 12:18-27)

27 చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు: 28 “బోధకుడా! మోషే ‘ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి’ అని వ్రాశాడు. 29 ఒక్కప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. 30 రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణించాడు. 31 మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు. 32 చివరకు ఆమెకూడా మరణించింది. 33 మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది?” అని అడిగారు.

34 యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు. 35 పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు. 36 వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. 37 మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’(A) అని వ్రాసాడు. 38 ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు.

39 కొందరు శాస్త్రులు, “బోధకుడా! చక్కగా చెప్పారు” అని అన్నారు. 40 ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికి ధైర్యం చాలలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International