Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

యెహెజ్కేలు 2:1-7

యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడటం

ఆ స్వరం, “నరపుత్రుడా, లెమ్ము; నేను నీతో మాట్లాడదలిచాను” అని అన్నది.

ఇంతలో ఒకగాలి వచ్చి నన్ను నా పాదాలమీద నిలబెట్టింది. ఆ వ్యక్తి (దేవుడు) చెప్పేది నేను విన్నాను. ఆయన ఇలా చెప్పాడు, “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడటానికి నిన్ను నేను పంపుతున్నాను. ఆ ప్రజలు అనేక సార్లు నాకు వ్యతిరేకులయ్యారు. వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు చేశారు. వారు నా పట్ల అనేకసార్లు పాపం చేశారు. ఈనాటికీ వారు నాపట్ల పాపం చేస్తూనే వున్నారు. ఆ ప్రజలతో మాట్లాడటానికి నేను నిన్ను పంపుతున్నాను. కాని వారు చాలా మొండివారయ్యారు. వారు తలబిరుసు కలిగినవారు. అయినా, నీవు వారితో తప్పక మాట్లాడాలి. ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు’ అని నీవు అనాలి. కాని ఆ ప్రజలు నీ మాట వినరు. వారు నా పట్ల పాపం చేయటం మానరు. ఎందువల్లనంటే వారు మిక్కిలిగా తిరుగబడే స్వభావం గలవారు. వారు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు! కాని నీవావిషయాలు చేప్పాలి. దానితో వారిమధ్య ఒక ప్రవక్త నివసిస్తున్నాడని వారు తెలుసుకుంటారు.

“ఓ నరపుత్రుడా, ఆ ప్రజలకు నీవు భయపడవద్దు, వారు చెప్పేవాటికి నీవు భయపడకు, వారు నీకు వ్యతిరేకులై, నీకు హాని చేయటం ఖాయం. వారు ముండ్లవంటి వారు. తేళ్లమధ్య నివసిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. కాని వారు చెప్పేవాటికి నీవు భయపడవద్దు. వారు తిరుగుబాటుదారులు. అయినా వారికి నీవు భయపడవద్దు. నేను చేప్పే విషయాలు నీవు వారికి తప్పక తెలియజేయాలి. వారు నీ మాట వినరని నాకు తెలుసు. పైగా నా పట్ల పాపం చేయటం వారు మానరు. ఎందువల్లనంటే వారు తిరుగబడే స్వభావం గలవారు.

అపొస్తలుల కార్యములు 11:1-18

పేతురు తన అనుభవాల్ని చెప్పటం

11 అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కానివాళ్ళకు కూడా దైవసందేశం లభించిందని విన్నారు. పేతురు యెరూషలేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించే వాళ్ళ గుంపు అతణ్ణి విమర్శిస్తూ, “నీవు సున్నతి చేసుకోనివాళ్ళ యిళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి తిన్నావు!” అని అన్నారు.

పేతురు వాళ్ళకు జరిగింది జరిగినట్లు ఈ విధంగా విడమర్చి చెప్పటం మొదలు పెట్టాడు: “నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక దివ్యమైన సంగతి చూసాను. ఆ దివ్య దర్శనంలో ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశంనుండి ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు చూసాను. అది నేనున్న స్థలంలో దిగింది. నేను అందులో ఏముందోనని జాగ్రత్తగా చూసాను. భూమ్మీద నివసించే నాలుగు కాళ్ళ జంతువులు, క్రూర మృగాలు, ప్రాకే ప్రాణులు, గాల్లో ఎగిరే పక్షులు కనిపించాయి. అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, ‘పేతురూ! లే! వీటిలో ఏ జంతువునైనా చంపి దానిని తిను!’ అని అంది.

“‘నేనాపని చేయలేను ప్రభూ! తినకూడదన్నదాన్ని నా నాలుక ఎన్నడూ రుచి చూడలేదు’ అని నేను సమాధానం చెప్పాను.

“ఆకాశంనుండి ఆ స్వరం రెండవసారి యిలా అంది: ‘దేవుడు తినవచ్చని అన్నవాటిని తినకూడదని అనకు.’

10 “ఇలా మూడుసార్లు జరిగాక అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది. 11 అదే క్షణంలో నన్ను పిలుచుకు వెళ్ళడానికి కైసరియనుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేనున్న యింటి ముందు ఆగారు. 12 వాళ్ళతో వెళ్ళటానికి నేను ఏ మాత్రం వెనకాడరాదని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. అక్కడున్న ఆరుగురు సోదరులు కూడా నాతో వచ్చారు. మేమంతా కలిసి కొర్నేలీ యింటికి వెళ్ళాం. 13 అతడు తన యింట్లో ఒక దేవదూత ప్రత్యక్షమైన విషయము, అతణ్ణి తాను చూసిన విషయము, దేవదూత, ‘పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు, 14 అతడు మాట్లాడే విషయాలు నిన్ను, నీ యింట్లోని వాళ్ళనందరిని రక్షిస్తాయి’ అని తనతో చెప్పిన విషయము మాకు చెప్పాడు.

15 “నేను మాట్లాడటం మొదలెడుతుండగా, మొట్టమొదట మన మీదికి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు కూడా వచ్చాడు. 16 ‘యోహాను నీళ్ళతో బాప్తిస్మము యిచ్చాడు కాని నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతావు!’ అని అన్న యేసు ప్రభువు మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. 17 మనం యేసు క్రీస్తు ప్రభువును నమ్మినందుకు మనకిచ్చిన వరమునే దేవుడు వాళ్ళకు కూడా యిచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎదిరించటానికి నేనెవర్ని?”

18 వాళ్ళీ మాటలు విన్నాక వేరే ఆక్షేపణలు చేయలేదు. దేవుడు యూదులు కానివాళ్ళకు కూడా మారుమనస్సు కలిగి రక్షణ పొందే అవకాశ మిచ్చాడంటూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.

కీర్తనలు. 97

97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
    దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
    నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
    ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
    ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
    భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
    ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!

మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
    వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
    వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
సీయోనూ, విని సంతోషించుము!
    యూదా పట్టణములారా, సంతోషించండి!
    ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
    ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
    కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.

కీర్తనలు. 138

దావీదు కీర్తన.

138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
    దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
    నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.

యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
    నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా మహిమ గొప్పది.
దేవుడు గొప్పవాడు.
    అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
    కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
    నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
    యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.

గలతీయులకు 2:1-9

అపొస్తలులు పౌలును అంగీకరించటం

పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు. దేవుడు ఆదేశించటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యూదులు కానివాళ్ళకు నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం చేస్తున్న సేవ, యిదివరకు చేసిన సేవ వ్యర్థంకాకూడదని నా అభిప్రాయం.

నా వెంటనున్న తీతు గ్రీకు దేశస్థుడైనా సున్నతి చేయించుకోమని వాళ్ళు బలవంతం చెయ్యలేదు. మాలో కొందరు దొంగ సోదరులు చేరారు. వాళ్ళలో కొందరు తీతు సున్నతి పొందాలని బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్ళు గూఢచారులుగా సంఘంలో మేము యేసుక్రీస్తులో విశ్వాసులముగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని పరిశీలించాలని వచ్చారు. మమ్మల్ని మళ్ళీ బానిసలుగా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశ్యం. సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు.

సంఘంలో ముఖ్యమైనవాళ్ళలా కనిపించే వాళ్ళు, వాళ్ళ అంతస్థు ఏదైనా సరే నేను లెక్క చెయ్యను. అంతేకాక అంతస్థును బట్టి దేవుడు తీర్పు చెప్పడు, నేను చెప్పిన సందేశాన్ని మార్చలేదు. పైగా యూదులకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినట్లే, యూదులు కాని వాళ్ళకు బోధించే బాధ్యత నాకివ్వబడిందని వాళ్ళు గమనించారు. పేతురు యూదులకు అపొస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్లే, అపొస్తలుడనుగా యూదులు కానివాళ్ళ కోసం నేను చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు. ముఖ్యమైన వాళ్ళని పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి నాకు, బర్నబాకు సహాయం చెయ్యటానికి అంగీకరించారు. మేము యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్ళేటట్లు, వాళ్ళు యూదుల దగ్గరకు వెళ్ళేటట్లు నిర్ణయించుకొన్నాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International