Book of Common Prayer
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
“దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
నీ శక్తి గొప్పది!
విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
38 కాని దేవా, ఏర్పరచబడిన నీ రాజు[b] మీద నీకు కోపం వచ్చింది.
నీవు అతన్ని ఒంటరివానిగా విడిచి పెట్టావు.
39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు.
రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు.
అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు.
దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు.
అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు.
నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు.
నీవు అతన్ని అవమానించావు.
46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా?
నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా?
ఎంత కాలం యిలా సాగుతుంది?
47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము.
అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు.
ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.
49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ?
దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
50-51 ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము.
యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది.
ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.
52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి.
ఆమేన్, ఆమేన్![c]
పవిత్ర పెట్టె మూలంగా ఫిలిష్తీయులకు కష్టకాలం
5 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు. 2 దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను[a] దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు. 3 అష్డోదు ప్రజలు ఆ మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యెహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది.
అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు. 4 కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయి ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది. 5 అందువల్ల ఈ నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు.
6 అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు. 7 అష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు.
8 అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.”
అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు.
9 అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా ఆ నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు. 10 కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు.
కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు. 11 వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.”
ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది. 12 చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.
అనేకులను నయం చేయటం
12 అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు. 13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. 14 చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. 15 ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. 16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలనుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్నవాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.
అపొస్తలులు హింసించబడటం
17 సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అసూయతో నిండిపోయారు. 18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. 19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. 20 వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. 21 దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు.
ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. 22-23 భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపొస్తలులు కనపడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూసాము. ద్వారపాలకులు ద్వారాల దగ్గర ఉండటం చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే అపొస్తలులు లేరు” అని చెప్పారు. 24 ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.
25 ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచినవాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26 ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.
చెట్ల ఉపమానం
(మత్తయి 24:32-35; మార్కు 13:28-31)
29 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి. 30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు. 31 అదే విధంగా ఈ సంఘటనలు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని గ్రహించండి.
32 “ఇది నిజం. ఇవన్నీ సంభవించేవరకు ఈ తరంవాళ్ళు గతించరు. 33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి.
అన్ని వేళలా సిద్ధంగా ఉండండి
34 “జాగ్రత్త! విందులు, వినోదాలు చేసుకొంటూ త్రాగుబోతులై జీవించకండి. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ధి పని చెయ్యటం మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చి మీ మీద పడుతుంది. 35 అది ప్రపంచం మీదికంతా వస్తుంది. 36 అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్ఘటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్యకుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని ప్రార్థించండి.”
© 1997 Bible League International