Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 61-62

సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.

61 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
    నా ప్రార్థన ఆలకించుము.
నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
    సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
    నన్ను మోసికొనిపొమ్ము.
నీవే నా క్షేమ స్థానం.
    నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
నీ గుడారంలో[a] నేను శాశ్వతంగా నివసిస్తాను.
    నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.

దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
    కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము.
    అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
    నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
    నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను.

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. దావీదు కీర్తన.

62 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
    పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.

ఇంకెంత కాలం వారు నా మీద దాడి చేస్తూ ఉంటారు?
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను.
    పడిపోతున్న కంచెలా ఉన్నాను.
ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి
    పథకాలు వేస్తున్నారు.
వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబుతారు,
    కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.

దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
    దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
    పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి.
    ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
    మీ సమస్యలు దేవునితో చెప్పండి.
    దేవుడే మన క్షేమ స్థానం.

మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
    నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.
వారు గాలిబుడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించుకొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
    దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలంచవద్దు.
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం
    ధనాన్ని నమ్ముకొనవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు,
    “బలము దేవుని నుండే వస్తుంది.”

12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.
    ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.

కీర్తనలు. 68

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

68 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.
    ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
గాలికి ఎగిరిపోయే పొగలా
    నీ శత్రువులు చెదరిపోవుదురుగాక.
అగ్నిలో మైనం కరిగిపోయేలా
    నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.
    మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.
    ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు.
ఆయన పేరు యాహ్.[a]
    ఆయన నామాన్ని స్తుతించండి.
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.
    దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.
    దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు.
    కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.

దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.
    ఎడారిగుండా నీవు నడిచావు.
భూమి కంపించింది.
    దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
దేవా, నీవు వర్షం కురిపించావు
    మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.
    దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.
11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
    నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు.
12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి.
    యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు.
13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను పంచుకొంటారు.
    వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”

14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు.
    వారు పడిపోతున్న మంచులా ఉన్నారు.
15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.
16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు?
    దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు.
    యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.
17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు.
    ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి.
18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు.
    ఆయన తన బంధీల బృందాలను నడిపించాడు.
ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను
    వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు[b]
19 యెహోవాను స్తుతించండి.
    మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు.
    దేవుడు మనల్ని రక్షిస్తాడు.

20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు.
    మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.
21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు.[c]
    దేవుడు తనకు విరోధంగా పోరాడినవారిని శిక్షిస్తాడు.
22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను.
    సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను.
23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు
    కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.”

24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు.
    నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.
25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు.
    మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు.
26 మహా సమాజంలో దేవుని స్తుతించండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు.
    యూదా మహా వంశం అక్కడ ఉంది.
    జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.

28 దేవా, నీ శక్తి మాకు చూపించుము,
    దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.
29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు,
    యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.
30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము.
    ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము
ఆ రాజ్యాలను యుద్ధంలో
    నీవు ఓడించావు.
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి
    తీసుకొని వచ్చునట్లు చేయుము.
31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము.
    దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.
32 భూరాజులారా, దేవునికి పాడండి.
    మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.

33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.
    ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
34 మీ దేవుళ్లందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.
    ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తిని, బలాన్ని ఇస్తాడు.
దేవుని స్తుతించండి.

ద్వితీయోపదేశకాండము 30:11-20

జీవం లేక మరణం

11 “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ చాలా కష్టతరమయింది కాదు. అది చాలా దూరమైనదీ కాదు. 12 మేము దానిని విని, దానిని జరిగించేందుకు ‘ఎవరు మా కోసం ఆకాశానికి వెళ్లి దాన్ని తీసుకొని వస్తారు అని మీరు చేప్పేందుకు ఈ ఆదేశం ఆకాశంలో లేదు.’ 13 మేము దానిని విని, దానిని జరిగించడానికి ‘మాకోసం ఎవరు సముద్రం దాటి వెళ్లి, దానిని మాకోసం తీసుకొని వస్తారు అని చెప్పటానికి ఈ ఆదేశం సముద్రానికి అవతలపక్క లేదు.’ 14 లేదు, మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.

15 “జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకొనే అవకాశం ఈ వేళ నేను మీకు యిచ్చాను. 16 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనీ, ఆయన మార్గాల్లో నడచుకోవాలనీ, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలనీ ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ దేశం విస్తరిస్తుంది. మరియు స్వంతంగా మీరు తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 17 అయితే మీరు యెహోవా నుండి మరలిపోయి, వినడానికి నిరాకరిస్తే, ఇతర దేవుళ్లను పూజించి, సేవించేందుకు మీరు తిప్పివేయబడితే 18 మీరు నాశనం చేయబడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశించాలని సిద్ధంగా ఉన్నయొర్దాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకరు.

19 “ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెండు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుతున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపం తెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు. 20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందుచేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు.”

2 కొరింథీయులకు 11:1-21

పౌలు మరియు అబద్ధపు అపొస్తలులు

11 నా తెలివితక్కువతనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను. సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.[a]

ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను. మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.

దైవసందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చెయ్యటం పాపమా? ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది. నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను. 10 దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్నవాడెవ్వడూ నన్ను ఆపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను. 11 ఎందుకు, మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు.

12 వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను. 13 అలాంటివాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్తలుల వలే నటిస్తారు. 14 దీనిలో ఆశ్చర్యమేలేదు! సాతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు. 15 మరి సాతాను సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ్చర్యమేలేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు.

పౌలు తన కష్టాలలో అతిశయించుట

16 నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువవాణ్ణని అనుకొంటే, తెలివిలేనివాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు. 17 నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను. 18 అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను. 19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. 20 మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్నవాళ్ళపట్ల, దోచుకొనేవాళ్ళపట్ల, మీ వల్ల లాభం పొందేవాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టేవాళ్ళపట్ల, మీ చెంపమీద కొట్టినవాళ్ళపట్ల, మీరు సహనం చూపుతారు. 21 వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది.

ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది.

లూకా 19:1-10

జక్కయ్య

19 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు. ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకొన్నాడు. కాని ప్రజలు గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టివాడు అవటంవలన యేసును చూడలేకపోయాడు. యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి అందిరకన్నా ముందు పరుగెత్తి ఒక మెడి చెట్టెక్కి కూర్చున్నాడు.

యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బసచెయ్యాలి!” అని అన్నాడు.

అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. ప్రజలు జరిగినదంతా చూసి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి వెళ్తున్నాడే!” అని గొణిగారు.

కాని జక్కయ్య ప్రభువుతో, “ప్రభూ! నేనుయిక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్ళకు యిస్తాను. నేను ఎవరినుండైనా ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను” అని అన్నాడు.

అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ వచ్చింది. 10 మనుష్యకుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International