మార్కు 12:1-12
Telugu Holy Bible: Easy-to-Read Version
రైతుల ఉపమానం
(మత్తయి 21:33-46; లూకా 20:9-19)
12 ఆ తర్వాత ఆయన వాళ్ళతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఒకడు ద్రాక్షాతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.
2 “పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకు రమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు. 3 కాని ఆ రైతులతణ్ణి పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేసారు. 4 ఆ తర్వాత అతడు యింకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తలపై బాది అవమానపరిచారు. 5 అతడు యింకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్ళతణ్ణి చంపివేసారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు. మరి కొందరిని కొట్టారు.
6 “తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి యింకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరకు తన కుమారుణ్ణి పంపాడు.
7 “కాని ఆ రైతులు, ‘ఇతడు వారసుడు! యితణ్ణి చంపుదాం; అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 8 ఆ కారణంగా వాళ్ళతణ్ణి పట్టుకొని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేసారు.
9 “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను యితరులకు కౌలుకిస్తాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: ఇది మీరు చదువలేదా?
‘ఇల్లు కట్టువాళ్ళు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
11 ఇది ప్రభువు చేసాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూసాము.’”(A)
12 ఈ దృష్టాంతం తమనుగూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపొయ్యారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
Read full chapter© 1997 Bible League International