లూకా 20:9-19
Telugu Holy Bible: Easy-to-Read Version
రైతుల ఉపమానం
(మత్తయి 21:33-46; మార్కు 12:1-12)
9 ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: “ఒకడు ఒక ద్రాక్షాతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి పోయ్యాడు. 10 పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు. 11 ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్తో పంపారు. 12 అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తీవ్రంగా గాయపరచి తరిమి వేసారు.
13 “ఆ ద్రాక్షాతోట యజమాని, ‘నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కొడుకుని పంపుతాను. బహుశా వాళ్ళతణ్ణి గౌరవించవచ్చు’ అని అనుకున్నాడు. 14 కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు. 15 అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు.
“ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు? 16 వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షాతోట యింకొకరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు.
ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగకూడదు” అని అన్నారు. 17 యేసు వాళ్ళవైపు సూటిగా చూసి, “మరి అలాగైతే లేఖనాల్లో వ్రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి:
‘పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది’?(A)
18 ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలిగిపోతారు” అని అన్నాడు.
19 శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు.
Read full chapter© 1997 Bible League International