Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 20-21

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
    యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
    సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
    నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
    నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
    దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.

ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
    దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
    ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
    కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
    కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!

దేవుడు రాజును రక్షించును గాక!
    మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
    నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
    మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.

యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
    బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
    నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
    నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
    నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
    సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
    నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
నీవు కనబడినప్పుడు
    ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
    మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
    వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
    చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
    ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.

13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
    మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.

కీర్తనలు. 110

దావీదు స్తుతి కీర్తన.

110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
    అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.

నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
    వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
    నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
    రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]

యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
    యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
    నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”

నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
    ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.

దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
    చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!

మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
    శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
    ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.

కీర్తనలు. 116-117

116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
    నాకు ఎంతో సంతోషం.
సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
    ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
    సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
    నేను భయపడి చింతపడ్డాను.
అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
    “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
    యెహోవా దయగలవాడు.
నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
    నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
నా ఆత్మా, విశ్రమించు!
    యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
    నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
    నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.

10 “నేను నాశనమయ్యాను!”
    అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
    అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.

12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
    నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
13 నన్ను రక్షించినందుకు
    నేను ఆయనకు పానార్పణం యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.

15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
    యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
    యెహోవా, నీవే నా మొదటి గురువు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.
    యెహోవాను స్తుతించండి!

117 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి.
    సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు.
    దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు.

యెహోవాను స్తుతించండి!

దానియేలు 3:19-30

19 అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కోపంగా చూశాడు. కొలిమి మామూలుకంటె ఏడు రెట్లు వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు. 20 తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వేడి కొలిమిలోకి తోసివేయుమని ఆజ్ఞాపించాడు.

21 అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి తోసివేశారు. వాళ్లను మంటలోకి విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. 22 రాజు చాలా ఉగ్రుడై ఉండటంవల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే, ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలి చచ్చారు. 23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి అగ్నిగుండంలోకి త్రోసేశారు.

24 అప్పుడు జరిగింది చూసి నెబుకద్నెజరు ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాముగదా!” అని అడిగాడు.

“చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు.

25 “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగాగాని, కాలిపోయినట్టుగాగాని లేరు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు.

26 తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా! బయటికి రండి” అని పిలిచాడు.

అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు. 27 వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు, ఉన్నతాధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళమీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకొన్నారు.

28 తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటలనుండి రక్షించాడు. ఈ వ్యక్తులు ముగ్గురు తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొలవడానికిగాని, పూజించుటకుగాని ఇష్టపడలేదు. 29 అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందినవారుగాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బలుగా నాశానం చేయబడతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడుగాని తన మనుష్యులను రక్షించలేడు.” 30 ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు.

1 యోహాను 3:11-18

పరస్పరం ప్రేమతో ఉండండి

11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. 12 సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.

13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు.

16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము. 17 ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది? 18 బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.

లూకా 4:1-13

సైతాను యేసును శోధించటం

(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)

యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.

సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.

యేసు,

“‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.(A)

ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.

యేసు,

“‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి,
    ఆయన సేవ మాత్రమే చెయ్యి’(B)

అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.

సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.

10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’(C)

11 అంతేకాక:

‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా
    నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’(D)

అని వ్రాయబడింది” అని అన్నాడు.

12 యేసు,

“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’(E)

అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. 13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International