Book of Common Prayer
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
ఆయన వారిని రక్షించాడు!
5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
8 ఆ రాజులకు, ప్రముఖులకు
దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.
యెహోవాను స్తుతించండి!
150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
5 పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!
6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!
యెహోవాను స్తుతించండి.
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
3 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యాజకులారా, మీరు చెప్పండి.
4 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
5 నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
6 యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
7 యెహోవా నా సహాయకుడు;
నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
8 మనుష్యులను నమ్ముకొనుటకంటే
యెహోవాను నమ్ముట మేలు.
9 మీ నాయకులను నమ్ముకొనుట కంటే
యెహోవాను నమ్ముకొనుట మేలు.
10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”
యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”
28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
పస్కా పండుగ
12 మోషే, అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండగానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఈనెల[a] మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది. 3 ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. 4 ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్లను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి. 5 గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును. 6 నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజలంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను చంపాలి. 7 ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. ఏ ఇండ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పైకమ్మి మీద ఆ రక్తం చల్లాలి.
8 “ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినెయ్యాలి. చేదుగా ఉండే ఆకు కూరలు, పొంగని రొట్టె కూడా మీరు తినాలి. 9 గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద కాల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి. 10 ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయాలి.
11 “మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతురంగా మీరు భోజనం చేయాలి. ఎందుచేతనంటే, ఇది యెహోవాయొక్క పస్కాబలి[b] (యెహోవా తన ప్రజలను కాపాడి, వారిని ఈజిప్టునుండి త్వరగా బయటకు నడిపించిన సమయం.)
12 “ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణీ చంపేస్తాను. మనుష్యుల్లోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. నేనే యెహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను. 13 అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను.[c] ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.
14 “కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి.
దేవుని స్వంత శక్తి తన ప్రజలను రక్షిస్తుంది
9 యెహోవా హస్తమా (శక్తి) మేలుకో!
మేలుకో! నీ బలం సిద్ధం చేయి.
చాలాకాలం క్రిందట నీవు చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు.
రాహాబును ఓడించిన శక్తి నీవే. మకరాన్ని నీవే ఓడించావు.
10 సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు.
సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా చేశావు.
నీ ప్రజలు ఆ మార్గాన వెళ్లి రక్షించబడ్డారు.
11 యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు.
వారు ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు.
వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు.
వారి ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా ఉంటుంది.
ఆనందంతో వారు పాటలు పాడుతూంటారు.
దుఃఖం అంతా దూరమైపోతుంది.
వాక్యము మానవాతారం ఎత్తటం
1 సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. 2 ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. 3 ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. 4 ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను. 5 వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.
6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. 7 తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. 8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. 9 ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను.
10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు. 11 ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. 12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. 13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.
14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. 15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”
16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు. 18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.
ఎమ్మాయు దారి
(మార్కు 16:12-13)
13 అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేముకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది. 14 వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకొంటున్నారు. 15 వాళ్ళు ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు పెట్టాడు. 16 కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు. 17 యేసు వాళ్ళతో, “మీరు ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగాడు.
వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖంల్లో దుఃఖం ఉంది. 18 వాళ్ళలో క్లెయొపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న వాడివి నీవొక్కడివేనా!”
19 “ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు.
వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప పనులు చేశాడు. ప్రజల మెప్పు, దేవుని మెప్పు పొందాడు. 20 మా ప్రధాన యాజకులు, పాలకులు, మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు. 21 ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము.
“పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. 22 అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు ఝామున సమాధిదగ్గరకు వెళ్ళారు. 23 కాని, అక్కడ వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ దూతల్ని చూసినట్లు, ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు. 24 మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ యేసు కనిపించలేదు” అని అన్నారు.
25 యేసు వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? 26 క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు. 27 ఆ తదుపరి మోషే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు.
28 వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా కనిపించాడు. 29 కాని వాళ్ళు, “సాయంకాలమైంది. చీకటి కాబోతోంది. మాతో ఉండిపొండి!” అని అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి వెళ్ళాడు.
30 వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి వాళ్ళకిచ్చాడు. 31 అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన అదృశ్యమయ్యాడు. 32 ఆ తర్వాత ఆ యిద్దరూ, “దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా?” అని మాట్లాడుకున్నారు.
33 వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు సమావేశమై ఉన్నారు. 34 వాళ్ళలో ఒకడు, “ఔను! ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కనిపించాడు” అని అన్నాడు.
35 ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన సంఘటనను, యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు.
యేసు తన శిష్యులకు కనిపించటం
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49)
19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.
21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. 22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. 23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.
© 1997 Bible League International