Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 16-17

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

దావీదు ప్రార్థన.

17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
    నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
    నీవు సత్యాన్ని చూడగలవు.
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
    దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
    నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
    నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
నేను నీ మార్గాలు అనుసరించాను.
    నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
    కనుక ఇప్పుడు నా మాట వినుము.
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
    నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
    నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
    మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
    ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
    వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
    నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14     యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
    ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
    మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.

కీర్తనలు. 134-135

యాత్ర కీర్తన.

134 యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి!
    రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
సేవకులారా, మీ చేతులు ఎత్తి
    యెహోవాను స్తుతించండి.
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
    యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

దానియేలు 3:1-18

బంగారు విగ్రహం-అగ్నిగుండం

నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను రాజ్యంలో దూరా అనే మైదాన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధికారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు సమావేశపరచాడు. ఆ విగ్రహ ప్రతిష్ఠోత్సవానికి రాజు వారందరిని పిలించాడు.

రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు. రాజు తరఫున ప్రకటనలు చేసే వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాలనుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ నా మాటలు ఆలకించండి. ఇది మీరు చేయాలని రాజాజ్ఞ. కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల ధ్వనులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగపడి పూజించాలి. ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.”

అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.

తర్వాత కల్దీయులలో కొందరు రాజు వద్దకు వచ్చి, యూదులకు విరుద్ధంగా మాటలాడసాగారు. వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక! 10 రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీత వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు. 11 ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు. 12 రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.”

13 నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. 14 అందువల్ల వారిని అతని సమక్షానికి తీసుకు వచ్చారు. నెబుకద్నెజరు వారిని చూచి, “షద్రకు, మేషాకు, అబెద్నెగో! మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా? 15 కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించకపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”

16 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు. 17 మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే, మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు. 18 మా దేవుడు మమ్ములను రక్షించని పక్షంలో కూడా, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”

1 యోహాను 3:1-10

మనం దేవుని బిడ్డలం

మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు. ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు. ఇలాంటి ఆశాభావాన్ని ఉంచుకొన్న ప్రతి ఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు.

పాపాలు చేసిన ప్రతి ఒక్కడూ నీతిని ఉల్లంఘించిన వాడౌతాడు. నిజానికి, పాపమంటేనే ఆజ్ఞను ఉల్లంఘించటం. కాని, యేసు పాప పరిహారం చెయ్యటానికి వచ్చాడని మీకు తెలుసు. ఆయనలో పాపమనేది లేదు. ఆయనలో జీవించేవాడెవ్వడూ పాపం చెయ్యడు. ఆయన్ని చూడనివాడు, ఆయనెవరో తెలియనివాడు మాత్రమే పాపం చేస్తూ ఉంటాడు.

బిడ్డలారా! మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. యేసు నీతిమంతుడు. ఆయనలా నీతిని పాలించే ప్రతివ్యక్తి నీతిమంతుడు. ఆదినుండి సాతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం చేసే ప్రతివ్యక్తి సాతానుకు చెందుతాడు. సాతాను చేస్తున్న పనుల్ని నాశనం చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు.

దైవేచ్ఛవల్ల జన్మించిన వానిలో దేవుని బీజం ఉంటుంది. కనుక పాపం చెయ్యడు. అతడు దేవునివల్ల జన్మించాడు కనుక పాపం చెయ్యలేడు. 10 అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సాతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.

లూకా 3:15-22

15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.

16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము[a] నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. 17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.” 18 యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.

యోహాను సేవా ఎలా అంతమైయింది

19 రాజ్యాధికారి హేరోదుకు అతని సోదరుని భార్య అయిన హేరోదియతో సంబంధంవుంది. దీని కారణంగా, హేరోదు చేసిన యితర దుష్కార్యాల కారణంగా యోహాను అతణ్ణి తీవ్రంగా విమర్శించాడు. 20 తద్వారా హేరోదు, యోహానును కారాగారంలో ఉంచాడు. ఇలా చేసి తాను చేసిన దుష్కార్యాలకు మరొక దుష్కార్యం చేర్చుకొన్నాడు.

యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం

(మత్తయి 3:13-17; మార్కు 1:9-11)

21 యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. 22 పవిత్రాత్మ ఒక పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. వెంటనే పరలోకం నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీయందు ఎక్కువగా నేను ఆనందించుచున్నాను” అని వినబడింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International