Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 146-149

146 యెహోవాను స్తుతించండి!
    నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
    నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
    మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
    అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
    సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
    గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
    విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
    అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!

147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    మన దేవునికి స్తుతులు పాడండి.
    ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
    బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
    వారి గాయాలకు కట్లు కడతాడు.
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
    వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
    ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
పేదలను యెహోవా బలపరుస్తాడు.
    కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
    స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
    భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
    పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
    ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
    సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
    నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
    ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
    దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
    ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
    ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
    మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.

19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
    దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
    ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.

యెహోవాను స్తుతించండి!

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

యెహెజ్కేలు 37:1-14

ఎండిన ఎముకల దర్శనం

37 యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరం నుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది. లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను.

నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు.

“నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.

అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి! నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు! మీమీద మళ్లీ నరాలు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”

ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది! తరువాత నా కళ్ల ముందే వాటిమీద నరాలు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు.

పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగి బ్రతుకుతాయి!’”

10 ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా ఒక పెద్ద సైన్యం!

11 తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు. 12 కావున నీవు నా తరపున వారితో మాట్లాడి ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడని తెలుపు, ‘నా ప్రజలారా నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను. 13 నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 14 నా ఆత్మను మీలో పెడతాను. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు నేనే చెప్పానని, వాటిని జరిగేలా చేశానని మీరు తెలుసుకుంటారు!’” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 3:11-26

పేతురు ఉపన్యసించటం

11 ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళారు.

12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు? 13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. 14 పవిత్రుడు, నీతిమంతుడు అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు. 15 మీరు మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.

16 “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.

17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. 18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు. 19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి. 20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.

21 “చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. సర్వం పునఃస్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి. 22 మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి. 23 దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళనుండి దూరం చేసి నాశనం చేస్తాడు.’(A)

24 “సమూయేలు కాలంనుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు. 25 మీ పూర్వికులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’(B) అని అన్నాడు. 26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”

యోహాను 15:12-27

12 నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. 13 స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు. 15 నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.

16 “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు. 17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ.

ప్రపంచం యొక్క ద్వేషం

18 “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. 19 మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది.

20 “‘యజమాని కంటే సేవకుడు గొప్పకాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు. 21 నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు. 22 నేను రాకుండా, వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుండి తప్పించుకోలేరు.

23 “నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింపబడతాడు. 24 నేను వాళ్ళ కోసం ఎవరూ చేయని ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినట్లైతే వాళ్ళకు ఈ పాపం అంటి ఉండేది కాదు. కాని యిప్పుడు వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. 25 కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు’[a] అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది.

26 “నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. 27 మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్పాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International