Book of Common Prayer
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16 ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18 దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
మీరు ఆయన సేవకులు,
దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు
18 యెహోవా మీకు తన దయ చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు.
19 యెహోవా ప్రజలు సీయోను కొండమీద యెరూషలేములో నివసిస్తారు. మీరు ఏడుస్తూనే ఉండరు. యెహోవా మీ ఏడ్పువింటాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. యెహోవా మీ మొర వింటాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు.
20 గతంలో నా ప్రభువు (దేవుడు) మీకు దుఃఖం, విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజూ రొట్టెతిన్నట్లు నీళ్లు తాగినట్టుగా ఉండేది. అయితే, దేవుడు మీ ఉపదేశకుడు, ఆయన ఇకమీదట మీనుండి దాగు కొని ఉండడు. మీ ఉపదేశకుని మీరు మీ కళ్లారా చూస్తారు. 21 అప్పుడు మీరు తప్పుచేసి, తప్పు మార్గంలో పోతే (కుడికి కావచ్చు, ఎడమకు కావచ్చు) “ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్లాలి” అని ఒక స్వరం మీ వెనుకనుండి చెప్పటం మీరు వింటారు.
36 “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”
37 ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
38 పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. 39 దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”
40 వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.” 41 అతని సందేశాన్ని అంగీకరించినవాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.
విశ్వాసుల సహవాసం
42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై, ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు. 43 దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. 44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. 45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. 46 ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించేవాళ్ళు, 47 దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించినవాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.
పవిత్రాత్మ వాగ్దానం
15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు. 16-17 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని[a] పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.
18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”
22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.
23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.
25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.
27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.
30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. 31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను.
“రండి, యిక్కడి నుండి వెళ్దాం!”
© 1997 Bible League International