Book of Common Prayer
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
రెండవ భాగం
(కీర్తనలు 42–72)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం
42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.
4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.
5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
ఆయన నన్ను కాపాడుతాడు.
6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.
8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
9 ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
“యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
“నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.
11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
నా సహాయమా! నా దేవా!
43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
2 దేవా, నీవే నా క్షేమ స్థానం.
నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
నేనెందుకు విచారంగా ఉండాలి?
3 దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
4 దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.
5 నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
నా దేవుడే నాకు సహాయము.
16 అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొనివచ్చి, సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నాను.” 17 ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు. 18 తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని ఆదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు.
19 ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. 20 రాజు చింతాక్రాంతుడుగా సింహాల గుహవద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు దేవుని సేవకుడవైన దానియేలూ, నీవెప్పుడూ ఆరాధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడగలిగెనా?”
21 “రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి! 22 నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూతను పంపి, సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాలు నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు” అని దానియేలు బదులు చెప్పాడు.
23 దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దానియేలును పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరగలేదు.
24 తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపడానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని విరుగగొట్టాయి.
25 తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు మాట్లాడే మనుష్యులకందరికీ రాజైన దర్యావేషు ఈ క్రింది లేఖను వ్రాశాడు:
అందరికి శుభమగు గాక!
26 నేనిప్పుడు క్రొత్త చట్టం చేస్తున్నాను. నా రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తిస్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి భయపడి వణకాలి.
దానియేలు దేవుడే సజీవుడు.
ఆయన ఎప్పుడూ జీవిస్తాడు.
ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు,
ఆయన పరిపాలన అంతం కాదు.
27 దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు.
ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోకమందునూ, భూమి మీదనూ చేస్తాడు.
దేవుడు దానియేలును సింహాలనుండి రక్షించాడు.
28 అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనూ, పారశీకుడైన కోరెషు రాజుగావున్న కాలంలోనూ దానియేలు అభివృద్ధి చెందాడు.
1 నా ప్రియ మిత్రుడైన గాయునకు,
పెద్దనైన నాకు నీపట్ల నిజమైన ప్రేమ ఉంది.
2 ప్రియ మిత్రమా! నీ ఆత్మ క్షేమంగా ఉన్నట్లు నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ జీవితం చక్కటి మార్గాల్లో నడవాలని ప్రార్థిస్తున్నాను. 3 కొందరు సోదరులు వచ్చి నీలో ఉన్న సత్యాన్ని గురించి చెప్పారు. నీవేవిధంగా సత్యాన్ని అనుసరిస్తున్నావో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది. 4 నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవటంకన్నా మించిన ఆనందం నాకు మరొకటి లేదు.
5 ప్రియ మిత్రమా! ఆ సోదరులు నీకు పరాయి వాళ్ళయినా వాళ్ళకోసం నీవు చేస్తున్నది విశ్వాసంతో చేస్తున్నావు. 6-7 నీ ప్రేమను గురించి వాళ్ళు సంఘానికి చెప్పారు. వాళ్ళు క్రైస్తవులు కాని వాళ్ళనుండి సహాయం కోరక క్రీస్తు పేరు కోసం బయలుదేరారు. నీవు దేవునికి నచ్చే విధంగా వాళ్ళను సాగనంపి మంచి పని చేసావు. 8 సత్యం కోసం మనం కలిసి పని చెయ్యాలంటే, అలాంటివాళ్ళను ఆదరించాలి.
9 నేను సంఘానికి వ్రాసాను. కాని దియొత్రెఫే తనకు ప్రాముఖ్యత కావాలని కోరుకుంటున్నాడు కనుక, మనకు సుస్వాగతం చెప్పలేదు. 10 దానితో తృప్తి పడక సోదరులకు సుస్వాగతం చెప్పటానికి అంగీకరించటం లేదు. పైగా సుస్వాగతం చెప్పేవాళ్ళను అడ్డగిస్తూ వాళ్ళను సంఘంనుండి బహిష్కరిస్తున్నాడు. అందువల్ల నేను వస్తే అతడు మనల్ని గురించి ద్వేషంతో ఎందుకు మాట్లాడుతున్నాడో కనుక్కుంటాను.
11 ప్రియ స్నేహితుడా! చెడుననుసరించటం మాని మంచిని అనుసరించు. మంచి చేసినవాణ్ణి దేవుడు తనవానిగా పరిగణిస్తాడు. చెడు చేసినవాడెవ్వడు దేవుణ్ణి ఎరుగడు.
12 దేమేత్రిని గురించి అందరూ సదాభిప్రాయంతో మాట్లాడుకొంటారు. సత్యమే అతణ్ణి గురించి సదాభిప్రాయము కలిగిస్తుంది. మేము కూడా అతణ్ణి గురించి సదాభిప్రాయంతో మాట్లాడుకుంటున్నాము. మేము చెపుతున్నది నిజమని నీకు తెలుసు.
13 నేను నీకు వ్రాయవలసినవి ఎన్నో ఉన్నాయి. కాని సిరాతో, కలంతో వ్రాయాలని అనిపించటం లేదు. 14 నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. 15 నీకు శాంతి కలుగుగాక! ఇక్కడి స్నేహితులు తమ అభివందనాలు తెలుపుతున్నారు. అక్కడి స్నేహితుల్ని ఒక్కొక్కరిని పేరుతో పిలిచి అభివందనాలు తెలుపు.
లేవి (మత్తయి) యేసును వెంబడించటం
(మత్తయి 9:9-13; మార్కు 2:13-17)
27 తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. లేవి[a] అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు అతణ్ణి చూసి, “నా వెంటరా!” అని అతనితో అన్నాడు. 28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు.
29 ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతర్లు ఆయనతో కలసి భోజనం చేస్తూఉన్నారు. 30 పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు.
31 యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది. 32 నేను నీతిమంతుల్ని పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం చెప్పాడు.
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మత్తయి 9:14-17; మార్కు 2:18-22)
33 వాళ్ళు, “యోహాను శిష్యులు ఎప్పుడూ ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. కాని మీ వాళ్ళు తింటూ త్రాగుతూ ఉంటారు” అని యేసుతో అన్నారు.
34 యేసు, “పెళ్ళి కుమారుని అతిథులు పెళ్ళి కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? 35 కాని పెళ్ళి కుమారుణ్ణి వాళ్ళనుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
36 యేసు వాళ్ళకు ఈ ఉపమానం కూడా చెప్పాడు: “క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్తబట్ట నుండి చింపిన గుడ్డ పాతబట్టకు సరిగ్గా అతకదు. 37 అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో ఎవ్వరూ నింపరు. అలా చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది. ద్రాక్షారసం కారి పోతుంది. తిత్తి కూడా నాశనమౌతుంది. 38 అలా చెయ్యరాదు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తిలోనే పొయ్యాలి. 39 పాత ద్రాక్షారసం త్రాగిన వాడు క్రొత్త ద్రాక్షారసాన్ని కోరడు. అతడు, ‘పాతది బాగుంది’ అని అంటాడు.”
© 1997 Bible League International