Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 37

దావీదు కీర్తన.

37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
    చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
    దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
    నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
యెహోవాను సేవించటంలో ఆనందించుము.
    ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
    జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
నీ మంచితనం, న్యాయం
    మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
    చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
    చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
    కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
    అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
    వాళ్లు శాంతిని అనుభవిస్తారు.

12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
    ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
    వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
    మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
    వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
    మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
    కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
    వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
    కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
    ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
    వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
    కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
    కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
    వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
    ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
    మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
    మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
    మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
    అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
    కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
    వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
    అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
    అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.

32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
    మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
    మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
    దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
    మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.

35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
    వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
    నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
    సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
    వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
    నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
    నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.

దానియేలు 5:13-30

13 అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా? 14 నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను. 15 వివేకవంతుల్నీ, ఇంద్రజాలికుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుపలేకపోయారు. 16 నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.

17 తర్వాత దానియేలు రాజుతో, “బెల్షస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకో. లేకపోతే, ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.

18 “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తివంతుడైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు. 19 పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడేవారు. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింపజేయ తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. ఏ మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచుకుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.

20 “కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయ్యానాడు, మొండివాడయ్యాడు. అందువల్ల అతనినుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది. 21 అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవి గాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చుకొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించువాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించగలడని తెలుసుకొన్నాడు.

22 “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు, 23 అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు. 24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు. 25 ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి:

మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.

26 “ఈ మాటలకు అర్థం ఇది:

మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.

27 టెకేల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.

28 ఉఫార్సీన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసివేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”

29 తర్వాత బెల్షస్సరు ఊదారంగు బట్టలు దానియేలుకు ధరింపచేసేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు. 30 ఆ రాత్రే బబులోను రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు.

1 యోహాను 5:13-21

చివరి మాట

13 దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను. 14 దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది. 15 మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా!

16 మరణం కలిగించే పాపము తన సోదరుడు చెయ్యటం చూసినవాడు తన సోదరుని కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నేను చెప్పటం లేదు. 17 ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి.

18 దేవుని బిడ్డగా జన్మించినవాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించినవాణ్ణి దేవుడు కాపాడుతాడు. సాతాను అతణ్ణి తాకలేడు. 19 మనము దేవుని సంతానమని, ప్రపంచమంతా సాతాను ఆధీనంలో ఉందని మనకు తెలుసు. 20 దేవుని కుమారుడు వచ్చి నిజమైనవాడెవడో తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు తెలుసు. మనము నిజమైనవానిలో ఐక్యమై ఉన్నాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో కూడా ఐక్యమై ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్యజీవం. 21 బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి.

లూకా 5:1-11

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మత్తయి 4:18-22; మార్కు 1:16-20)

ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు ప్రక్కన నిలబడి దైవసందేశం ఉపదేశిస్తున్నాడు. ప్రజలు ఆయన ఉపదేశం వినటానికి త్రోసుకుంటూ ఆయన చుట్టూ చేరారు. యేసు సరస్సు ప్రక్కన రెండు పడవలుండటం చూశాడు. బెస్తవాళ్ళు పడవలు దిగి ఆ ప్రక్కనే తమ వలలు కడుక్కుంటున్నారు. యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆయన ఆ పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.

ఆయన మాట్లాడటం ముగించాక సీమోనుతో, “పడవను నీళ్ళు లోతుగా ఉన్న చోటికి పోనిచ్చి వలవేయండి. మీకు చేపలు దొరకుతాయి” అని అన్నాడు.

సీమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని అన్నాడు. వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసి ఎన్నో చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు పెట్టాయి. కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి.

సీమోను పేతురు యిది చూసి యేసు కాళ్ళపైపడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” అని అన్నాడు. అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. 10 వీళ్ళే కాక జెబెదయ కుమారులు యాకోబు, యోహానులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్లు సీమోను భాగస్థులు.

యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి నువ్వు మనుష్యుల్ని పడ్తావు!” అని అన్నాడు.

11 వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International