Book of Common Prayer
ఆసాపు కీర్తనలలో ఒకటి.
50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
ఆయన యెదుట అగ్ని మండుతుంది.
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
7 దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
9 మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
“నా న్యాయ విధులను చదువుటకు,
నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం.
59 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము
నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము.
3 చూడు, బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు.
నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు.
నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందువలన కాదు.
4 వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.
యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!
5 నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు.
లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము.
ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.
6 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు.
వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
7 వారి బెదరింపులు, అవమానపు మాటలు వినుము.
వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు.
వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.
8 యెహోవా, వారిని చూసి నవ్వుము.
ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము.
9 దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను.
దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును.
నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.
12 ఆ దుర్మార్గులు శపించి అబద్ధాలు చెబుతారు.
వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము.
వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము.
13 నీ కోపంతో వారిని నాశనం చేయుము.
వారిని పూర్తిగా నాశనం చేయుము.
అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ
దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు.
14 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వచ్చి
మొరుగుతూ పట్టణం అంతా తిరుగే కుక్కల్లాంటివారు.
15 వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు.
వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
16 మరి నేనైతే,,,,,,,,,, నీకు స్తుతి గీతాలు పాడుతాను.
ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం,
కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తగలను.
17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం.
నీవు నన్ను ప్రేమించే దేవుడవు.
సంగీత నాయకునికి: “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను, అరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది.
60 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.
నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు.
దయచేసి మమ్ములను ఉద్ధరించుము.
2 భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.
మా ప్రపంచం పగిలిపోతోంది.
దయచేసి దాన్ని బాగు చేయుము.
3 నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.
త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
4 నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను
స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.
5 నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,
నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.
6 దేవుడు తన ఆలయంలో నుండి[a] మాట్లాడుతున్నాడు.
“నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను.
నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను.
షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
7 గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.
యూదా నా రాజదండము.
8 మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.
ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”
9 బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?
ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.
కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.
మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.
దేవుడు మా శత్రువులను ఓడించగలడు.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
23 మీరు కాదేషు బర్నేయానుండి వెళ్లిపోండి అని యెహోవా చెప్పినప్పుడు మీరు విధేయులు కాలేదు. ‘మీరు వేళ్లి నేను మీకు యిచ్చిన దేశంలో నివసించండి’ అని ఆయన చెప్పాడు. కానీ మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులు కాలేదు. మీరు ఆయనను నమ్మలేదు. మీరు ఆయన ఆజ్ఞను వినలేదు. 24 నేను మిమ్మల్ని ఎరిగినప్పటినుండియు మీరు యెహోవాకు విధేయలయ్యేందుకు నిరాకరిస్తున్నారు.
25 “కనుక నేను యెహోవా ఎదుట 40 పగళ్లు 40 రాత్రుళ్లు సాష్టాంగపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేస్తానని యెహోవా చేప్పాడు గనుక. 26 నేను యెహోవాకు ప్రార్థన చేసాను. నేను ఇలా చెప్పాను, ‘యెహోవా దేవా, నీ ప్రజలను నాశనం చేయవద్దు. వాళ్లు నీకు చెందినవాళ్లు. నీవే నీ మహాబలం, శక్తి ప్రయోగించి వారిని విడుదల చేసి ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు. 27 నీ సేవకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలు ఎంత మొండివారో అది మరచిపో. వారి చెడు మార్గాలను గాని వారి పాపంగాని చూడకు. 28 నీ ప్రజలను నీవు శిక్షిస్తే “యెహోవా తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన వారిని తీసుకొని వెళ్లలేకపోయాడు, ఆయన వాళ్లను ద్వేషించాడు, కనుక వాళ్లను చంపివేయడానికి అరణ్యంలోనికి తీసుకు వెళ్లాడు” అని ఈజిప్టువాళ్లు అంటారేమో. 29 ఆయితే యెహోవా, వాళ్లు నీ ప్రజలు, వాళ్లు నీకు చేందిన వాళ్లు. నీ మహాగొప్ప శక్తి, బలంతో నీవే వాళ్లను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.’
కొత్త రాతి పలకలు
10 “ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే వీటి కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి. 2 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద నేను వ్రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి.’
3 “కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. 4 అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు. 5 నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”
4 దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. 2 ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. 3 సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.
“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(A)
అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. 4 కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(B) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. 5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.
6 ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. 7 అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:
“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
మూర్ఖంగా ప్రవర్తించకండి.”(C)
8 యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. 9 అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు.
16 దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం. 17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు. 18 తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మనివానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్మలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు. 19 దేవుడు చెప్పిన తీర్పు యిది: ప్రపంచంలోకి వెలుగు వచ్చింది. ప్రజలు దుర్మార్గపు పనులు చేసారు. కనుక వాళ్ళు వెలుగుకు మారుగా చీకటిని ప్రేమించారు. 20 చెడుపనులు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. తన చెడు బయట పడుతుందేమోనని అతడు వెలుగులోకి రాడు. 21 మంచి పనులు చేసేవాడు తాను చేసిన పనులు దేవునివల్ల చేసిన విషయమై ప్రజలు గ్రహించాలని వెలుగులోకి వస్తాడు.
© 1997 Bible League International