Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 61-62

సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.

61 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
    నా ప్రార్థన ఆలకించుము.
నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
    సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
    నన్ను మోసికొనిపొమ్ము.
నీవే నా క్షేమ స్థానం.
    నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
నీ గుడారంలో[a] నేను శాశ్వతంగా నివసిస్తాను.
    నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.

దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
    కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము.
    అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
    నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
    నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను.

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. దావీదు కీర్తన.

62 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
    పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.

ఇంకెంత కాలం వారు నా మీద దాడి చేస్తూ ఉంటారు?
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను.
    పడిపోతున్న కంచెలా ఉన్నాను.
ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి
    పథకాలు వేస్తున్నారు.
వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబుతారు,
    కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.

దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
    దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
    పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి.
    ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
    మీ సమస్యలు దేవునితో చెప్పండి.
    దేవుడే మన క్షేమ స్థానం.

మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
    నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.
వారు గాలిబుడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించుకొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
    దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలంచవద్దు.
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం
    ధనాన్ని నమ్ముకొనవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు,
    “బలము దేవుని నుండే వస్తుంది.”

12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.
    ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.

కీర్తనలు. 68

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

68 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.
    ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
గాలికి ఎగిరిపోయే పొగలా
    నీ శత్రువులు చెదరిపోవుదురుగాక.
అగ్నిలో మైనం కరిగిపోయేలా
    నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.
    మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.
    ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు.
ఆయన పేరు యాహ్.[a]
    ఆయన నామాన్ని స్తుతించండి.
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.
    దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.
    దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు.
    కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.

దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.
    ఎడారిగుండా నీవు నడిచావు.
భూమి కంపించింది.
    దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
దేవా, నీవు వర్షం కురిపించావు
    మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.
    దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.
11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.
    నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు.
12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి.
    యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు.
13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను పంచుకొంటారు.
    వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”

14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు.
    వారు పడిపోతున్న మంచులా ఉన్నారు.
15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.
16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు?
    దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు.
    యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.
17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు.
    ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి.
18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు.
    ఆయన తన బంధీల బృందాలను నడిపించాడు.
ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను
    వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు[b]
19 యెహోవాను స్తుతించండి.
    మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు.
    దేవుడు మనల్ని రక్షిస్తాడు.

20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు.
    మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.
21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు.[c]
    దేవుడు తనకు విరోధంగా పోరాడినవారిని శిక్షిస్తాడు.
22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను.
    సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను.
23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు
    కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.”

24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు.
    నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.
25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు.
    మధ్యలో ఆడపడుచులు తంబురలు వాయిస్తారు.
26 మహా సమాజంలో దేవుని స్తుతించండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు.
    యూదా మహా వంశం అక్కడ ఉంది.
    జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.

28 దేవా, నీ శక్తి మాకు చూపించుము,
    దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.
29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు,
    యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.
30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము.
    ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము
ఆ రాజ్యాలను యుద్ధంలో
    నీవు ఓడించావు.
ఇప్పుడు వారు నీ వద్దకు వెండి
    తీసుకొని వచ్చునట్లు చేయుము.
31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము.
    దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.
32 భూరాజులారా, దేవునికి పాడండి.
    మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.

33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.
    ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
34 మీ దేవుళ్లందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.
    ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తిని, బలాన్ని ఇస్తాడు.
దేవుని స్తుతించండి.

యిర్మీయా 2:1-13

విశ్వాసంలేని యూదా

యెహోవా యొక్క వర్తమానం నాకు వినబడింది. యెహోవా వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి:

“‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు.
    ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు.
ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను
    నీవు నన్ను అనుసరించావు.
ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము:
    వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం.
ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు.
    ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.’”
ఇది యెహోవా వాక్కు.

యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి.
    ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.

యెహోవా ఇలా చెప్పాడు:
“మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా?
    అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు?
మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
    తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.
‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి
    తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మాకు ఎడారులలో మార్గదర్శి అయిన
    యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో
    సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ,
    ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు.
    ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు.
కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’
    మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”

ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో
    నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను.
మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను.
    కాని మీరు వచ్చి, నా దేశాన్ని అపవిత్ర పర్చారు.
ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను.
    అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.

“యెహోవా ఎక్కడ అని
    యాజకులు అడగలేదు.
నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.
    ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు.
బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు.
    వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను
    నేను నిందిస్తున్నాను.
10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి[a] వెళ్లి చూడండి.
    ఒకనిని కేదారు[b] రాజ్యానికి పంపి, శ్రద్ధగా పరిశీలించమనండి.
అక్కడ ఎవరైనా ఈ రకంగా
    ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.
11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను
    క్రొత్త దేవుళ్లతో మార్చుకున్నారా?
లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు
అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని
    పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.

12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి.
    భయకంపితులుకండి!”
యెహోవా ఇలా చెప్పాడు.
13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు:
వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు
    పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు.
(వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.)
    కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.

రోమీయులకు 1:16-25

16 సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది. 17 ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడి ఉంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[a] అని వ్రాయబడి ఉంది.

యూదులుకానివాళ్ళు చేసిన పాపాలు

18 భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు. 19 తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.

20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.

21 ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అంధకారమైపోయాయి. 22 వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. 23 ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.

24 అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు. 25 దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!

యోహాను 4:43-54

రాజ్యాధికారి కుమారునికి నయం చేయటం

(మత్తయి 8:5-13; లూకా 7:1-10)

43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్ళాడు. 44 అక్కడ యేసు, “ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు” అని అన్నాడు. 45 ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యోరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటిని చూశారు.

46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని “కానా” ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు. 48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.

49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.

50 యేసు, “నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు.

అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు. 51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.

52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు.

వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.

53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.

54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International