Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 95

95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
    మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
    సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
    ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
    దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
    మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
ఆయన మన దేవుడు,
    మనం ఆయన ప్రజలము.
    మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.

దేవుడు చెబుతున్నాడు, “మెరీబా[a] దగ్గర మీరు ఉన్నట్టుగా
    అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
    కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
    వారు నమ్మకస్థులు కారని నాకు తెలుసు.
    ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
11 అందుచేత నాకు కోపం వచ్చి,
    ‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”

కీర్తనలు. 40

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
    నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
    ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
    ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
    యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
    వారు యెహోవాను నమ్ముకొంటారు.
ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
    ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
    ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
    మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
    నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

కీర్తనలు. 54

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

ద్వితీయోపదేశకాండము 10:12-22

నిజంగా యెహోవా కోరేది

12 “ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి. 13 ఈ వేళ నేను మీకు చెబుతున్న యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.

14 “సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహోవాదే. 15 మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజలు కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.

16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి. 17 ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు. 18 తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు. 19 అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు దేశంలో విదేశీయులు గనుక.

20 “మీరు మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు మాత్రమే ఉపయోగించాలి. 21 మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు. 22 మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.

హెబ్రీయులకు 4:11-16

11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.

12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.

యేసు గొప్ప ప్రధాన యాజకుడు

14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.

యోహాను 3:22-36

యోహాను చెప్పిన సందేశం

22 ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు. 23 అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. 24 ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన.

25 పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది. 26 వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.

27 యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు. 28 నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం. 29 పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది. 30 ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.

పరలోకమునుండి వచ్చువాడు

31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు. 33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. 36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International