నిర్గమకాండము 17:1-7
Telugu Holy Bible: Easy-to-Read Version
బండనుండి నీరు ఇవ్వటం
17 ఇశ్రాయేలు ప్రజలంతా కలసి సీను అరణ్యమునుండి ప్రయాణమయ్యారు. యెహోవా ఆజ్ఞాపించినట్లెల్లా ఒక తావు నుండి మరో తావుకు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలు రెఫీదీముకు ప్రయాణం చేసి అక్కడ బసచేసారు. అక్కడ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేవు. 2 కనుక ప్రజలు మోషే మీదికి లేచి, అతనితో వాదించటం మొదలు పెట్టారు. “తాగేందుకు నీళ్లు ఇమ్ము” అని ప్రజలు మోషేను అడిగారు.
అయితే మోషే, “మీరెందుకు నామీదికి ఇలా లేచారు? మీరు యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” (యెహోవా మనతో లేడని మీరనుకొంటున్నారా?) అని వారితో అన్నాడు.
3 కాని ప్రజలు మాత్రం నీళ్ల కోసం చాల దాహంగా ఉన్నారు. అందుచేత వాళ్లు మోషేకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు, “అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అని అన్నారు ప్రజలు.
4 కనుక మోషే, “ఈ ప్రజల్ని నేనేమి చేయాలి? నన్ను చంపెయ్యటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు” అంటూ యెహోవాకు మొరబెట్టాడు.
5 మోషేతో యెహోవా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల ముందుకు వెళ్లు. ప్రజల పెద్దలలో (నాయకులు) కొందర్ని నీ వెంట తీసుకొని వెళ్లు. నీ చేతి కర్రను తీసుకొని వెళ్లు. నీవు నైలునదిని కొట్టిన కర్ర యిది. 6 హోరేబులో (సీనాయి పర్వతం) నీ యెదుట ఒక బండమీద నేను నిలబడతాను. కర్రతో ఆ బండను కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి. అప్పుడు ప్రజలు తాగవచ్చు.”
మోషే ఈ పనులు చేసాడు, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) అది చూచారు. 7 మెరీబా[a] అని మస్సా[b] అని ఆ స్థలానికి మోషే పేరు పెట్టాడు. ఎందుచేతనంటే, ప్రజలు తన మీదికి లేచి యెహోవాను పరీక్షించిన స్థలం ఇది. యెహోవా వారితో ఉన్నాడో లేదో తెల్సుకోవాలని ప్రజలు కోరారు.
Read full chapter© 1997 Bible League International