Add parallel Print Page Options

యేసు శతాధిపతి సేవకుని నయం చేయటం

(మత్తయి 8:5-13; యోహాను 4:43-54)

యేసు తాను చెప్పవలసినవన్నీ చెప్పాడు. ప్రజలు ఆయన చెప్పినవన్నీ విన్నారు. ఆ తర్వాత యేసు కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ కపెర్నహూములో ఒక శతాధిపతి ఉండేవాడు. అతని సేవకుడు జబ్బుతో చాలా బాధపడ్తూ చివరి దశలో ఉన్నాడు. శతాధిపతి అతణ్ణి చాలా ప్రేమతో చూసుకొనేవాడు. ఆ శతాధిపతి యేసును గురించి విన్నాడు. అతడు యూదుల పెద్దల్ని కొందర్ని పంపించి తన సేవకునికి వచ్చి నయం చేయమని అడగమన్నాడు. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “ఈ మనిషి మీ సహాయం పొందటానికి అర్హుడు. మన సమాజ మందిరాన్ని కట్టించిన వాడు అతడే” అని దీనంగా అన్నారు.

యేసు వాళ్ళ వెంట వెళ్ళాడు. ఆయన శతాధిపతి యింటికి వస్తుండగా ఆ శతాధిపతి తన స్నేహితుల్ని పంపి ఆయనతో యిలా చెప్పమన్నాడు: “ప్రభూ! మీరు నా గడప దాటి నా యింట్లో కాలు పెట్టే అర్హత నాకు లేదు. మీకా శ్రమ వద్దు. నేను మీ దగ్గరకు వచ్చే అర్హత నాకు ఉందనుకోను. కనుక అక్కడినుండి ఆజ్ఞాపిస్తే నా సేవకునికి నయమైపోతుంది. ఆజ్ఞాపించటం అంటే ఏమిటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకరి అధికారంలో ఉన్నవాణ్ణి. నా క్రింద ఉన్న సైనికులపై నాకు అధికారం ఉంది. ఇతణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. అతణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘యిది చెయ్యి’ అంటే చేస్తాడు.”

యేసు శతాధిపతి చెప్పి పంపింది విని ఆశ్చర్యపొయ్యాడు. తనను అనుసరిస్తున్న ప్రజల వైపు తిరిగి, “ఇంత భక్తి నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదని చెప్పగలను” అని అన్నాడు.

10 యేసు దగ్గరకు పంపబడిన పెద్దలు తిరిగి శతాధిపతి దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆ సేవకునికి నయమై ఉండటం గమనించారు.

Read full chapter