Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:49-72

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

తేత్

65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
    నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
    నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
    కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
    కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
    నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
    నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
    వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.

కీర్తనలు. 49

సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.

49 సర్వ దేశములారా, ఇది వినండి.
    భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
    ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
    నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
సామెతపైనా ఆసక్తినుంచుతాను.
    ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.

అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
    నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
    తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
    నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
    సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
    కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
    మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
    మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
    వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
    వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
    అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
    మరణం వారి కాపరి.
    వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.

15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
    సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
    వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
    వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
    ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
    అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.

కీర్తనలు. 53

సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.

53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
    అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
    సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
    దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
    కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
    ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
    ఒక్కడూ లేడు.

దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
    కాని వారు నన్ను ప్రార్థించరు.
    ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”

కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
    భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
    కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.

ఇశ్రాయేలు ప్రజలారా,
    సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
    యాకోబు సంతోషిస్తాడు.
    ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.

ద్వితీయోపదేశకాండము 9:13-21

13 “ఇంకా యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘ఈ ప్రజలను నేను గమనించాను. వాళ్లు చాలా మొండివాళ్లు. 14 వారి పేర్లనుకూడ ఎన్నటికీ ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోకుండా నేను వాళ్లను పూర్తిగా నాశనం చేసేస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలుకంటె ఎక్కువ బలం గల యింకా గొప్ప ప్రజలను నీనుండి నేను కలుగ జేస్తాను.’

బంగారు దూడ

15 “అప్పుడు నేను వెనక్కు తిరిగి కొండదిగి క్రిందికి వచ్చాను. ఆ కొండ అగ్నితో మండుతోంది. ఒడంబడిక రాతి పలకలు రెండు నా చేతిలో ఉన్నాయి. 16 నేను చూసినప్పుడు కరిగించిన బంగారంతో మీరు మీకోసం ఒక దూడను చేసుకొని, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయటం గుర్తించాను. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు త్వరగా తిరిగిపోయారు. 17 అందుచేత నేను ఆ రెండు రాతి పలకలు తీసుకొని నేలకేసి కొట్టాను. అక్కడ మీ కళ్లముందు ఆ పలకలను నేను ముక్కలుగా విరుగగొట్టేసాను. 18 అప్పుడు నేను మొదటిసారిలాగ 40 పగళ్లు, 40 రాత్రుళ్లు యెహోవా యెదుట నేలమీద సాష్టాంగ పడ్డాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. మీరు అంత ఘోరంగా పాపం చేసారు గనుక నేను యిలా చేసాను. యెహోవా దృష్టికి అపవిత్రమైనది చేసి మీరు ఆయనకు కోపం పుట్టించారు. 19 యెహోవా భయంకర కోపానికి నేను భయపడి పోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం మీమీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి యెహోవా నా మాట విన్నాడు. 20 అహరోనును నాశనం చేసివేయాలన్నంత కోపం వచ్చింది యెహోవాకు. కనుక ఆ సమయంలో అహరోను కోసం కూడా నేను ప్రార్థించాను. 21 మీరు చేసిన ఆ బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. ఆ దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత ఆ కొండనుండి ప్రవహించే నదిలో ఆ ధూళిని పారవేసాను.

హెబ్రీయులకు 3:12-19

12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:

“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
    కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(A)

16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.

యోహాను 2:23-3:15

23 పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది. 24 కాని ఆయనకు మానవ స్వభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. 25 మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు.

యేసు నికోదేముకు బోధించటం

నీకోదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు. అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు.

యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.

నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోకి రెండవ సారి ప్రవేశించలేము కదా!” అని అడిగాడు.

యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది. అందువల్ల నేను, ‘నీవు మళ్ళీ జన్మించాలి’ అనటం విని అశ్చర్యపోవద్దు. గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు” అని అన్నాడు.

“అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.

10 యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా? 11 ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు. 12 నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? 13 పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.

14-15 “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International