Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 63

దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.

63 దేవా, నీవు నా దేవుడవు.
    నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
    నీకొరకు దాహంగొని ఉన్నాయి.
అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
    నీ బలము నీ మహిమలను నేను చూశాను.
నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
    నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
    నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
    రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
    నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
    నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
    వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
    అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
    ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.

కీర్తనలు. 98

స్తుతి కీర్తన.

98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
    గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
    ఆయనకు విజయం తెచ్చింది.
యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
    యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
    రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
    త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
    స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
బూరలు, కొమ్ములు ఊదండి.
    మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
భూమి, సముద్రం, వాటిలో ఉన్న
    సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
నదులారా, చప్పట్లు కొట్టండి.
    పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
    గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
    నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.

కీర్తనలు. 103

దావీదు కీర్తన.

103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
    నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
    ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
    మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
    ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
    ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
యెహోవా న్యాయం కలవాడు.
    ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
    తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
    దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
    యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
    కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
    తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
    దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
    అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
    మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
    మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16     ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
    త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
    దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18     దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
    దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
    మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
    దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
    మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
    మీరు ఆయన సేవకులు,
    దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
    అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!

ద్వితీయోపదేశకాండము 8:1-10

యెహోవాను జ్ఞాపకం చేసుకోండి

“ఈ వేళ నేను మీకు యిచ్చే ఆజ్ఞలు అన్నింటినీ మీరు విని, విధేయులు కావాలి. అప్పుడు మీరు జీవిస్తారు. మీరు యింకా యింకా అనేకమందిగా పెరిగి పోతారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, జీవిస్తారు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకొన్నాడు. మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో, మీ హృదయంలోని సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకొన్నాడు. యెహోవా మిమ్మల్ని అణచి వేసి, ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని మన్నాతో[a] మిమ్మల్ని ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే ప్రతి మాటవలన బద్రుకుతారు. గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు. ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే. మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవుడైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు తెలుసుకోవాలి.

“మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు విధేయులు కావాలి. ఆయన మార్గాలలో నడుచుకొని, ఆయనను గౌరవించాలి. నదులు, నీటి మడుగులు ఉండి, కొండల్లో, లోయల్లో నీటి ఊటలు ప్రవహించే మంచి దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మును తీసుకొని వస్తున్నాడు. అది గోధుమ, యవలు, ద్రాక్షాతోటలు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లతో నిండిన దేశం. ఒలీవ నూనె, తేనెగల దేశం అది. అక్కడ మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఉండరు. ఆ దేశంలో మీరు ఆ కొండలు తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును. 10 మీరు తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు.

1 కొరింథీయులకు 1:17-31

17 ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.

నిజమైన జ్ఞానము

18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. 19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను.
పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.”(A)

20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా! 21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించినవాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.

22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. 23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. 24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకానివాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. 25 దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.

26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచం మిమ్మల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్ఠలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. 27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. 28 ప్రపంచం ముఖ్యమైనవాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్ళనూ, ఏవగించుకొనబడేవాళ్ళనూ, లెక్క చెయ్యబడనివాళ్ళను ఎన్నుకొన్నాడు. 29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. 30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. 31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”(B)

మార్కు 2:18-22

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మత్తయి 9:14-17; లూకా 5:33-39)

18 యోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.

19 యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు, 20 కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.

21 “పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలుసంచీ, ద్రాక్షారసం రెండూ నాశనమౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International